Tirumala Dasa Sahitya Auditions : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య క్షేత్రంలో భాగమయ్యేందుకు, స్వామివారి సేవలో తరించేందుకు సంగీత కళాకారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. తిరుమలలో ప్రతిరోజూ అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవలో, అలాగే తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నిర్వహించే దాససాహిత్య సంకీర్తనలను గానం చేసేందుకు గానూ ప్రతిభావంతులు, అర్హులైన సంగీత కళాకారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
నవంబరులో ఆడిషన్లు….

ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఆడిషన్లను 2026 నవంబరు 27వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్లలో పాల్గొని తమ స్వర మాధుర్యంతో స్వామివారిని పూజించాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ వివరాలను సమర్పించేందుకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ( https://apps.tirumala.org/dsp / ), ( https://apps.tirumala.org/dsp/ ) పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు.
అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఆడిషన్స్ నిర్వహణ విధానం, దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన ధ్రువపత్రాలు వివరాలు కూడా టీటీడీ వెబ్ సైట్ లో ఉన్నాయి. అంతేకాకుండా అడ్మిషన్లు మార్గదర్శకాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన అన్ని వివరాలను కూడా పొందుపరిచారు.
దళారులను నమ్మవద్దు - టీటీడీ
ఈ ఆడిషన్స్ ప్రక్రియపై టీటీడీ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించి టీటీడీ ఎటువంటి ఏజెంట్లను, మధ్యవర్తులను లేదా ప్రతినిధులను నియమించలేదని అత్యంత స్పష్టంగా వెల్లడించారు. అభ్యర్థులు ఎవరూ అనధికార వ్యక్తులను లేదా దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం టీటీడీ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సురక్షితంగా సమర్పించాలని కోరారు.