మార్చిలో ఈ తేదీల్లో దర్శనాలపై టీటీడీ కీలక అప్డేట్.. అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు
TTD Updates : మార్చి 17, 19వ తేదీల్లో దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మరోవైపు విద్యకు బడ్జెట్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా కేటాయింపులు చేసింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.
అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.
విద్యకు టీటీడీ బడ్జెట్
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను టీటీడీ కేటాయించింది. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గతంలో టీటీడీ విద్యా శాఖలో జీతాలు మినహా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.24.37 కోట్లు, 2022–23 సంవత్సరానికి రూ.39.04 కోట్లు, 2023–24 సంవత్సరానికి రూ.33.08 కోట్లు, 2024–25 సంవత్సరానికి రూ.25.99 కోట్లు, 2025–26 సంవత్సరానికి రూ.13.08 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి తదితర పనులు చేపట్టారు.
ఈ ఏడాది 2026–27 ఆర్థిక సంవత్సరానికి శ్రీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, టీటీడీ కలిపి విద్యాసంస్థలను మరింత ఆధునికరించి విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మొత్తం రూ.118.89 కోట్లు కేటాయించారు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ విద్యా సంస్థల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈసారి రూ.118.89 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో టీటీడీ విద్యా సంస్థలలో అదనపు తరగతి గదులు, అదనపు వసతి గదుల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అలాగే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి స్పోర్ట్స్, సాంస్కృతిక, సహ పాఠ్య కార్యకలాపాలు, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్, సీఏ, క్లాట్ తరహా కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్, జాబ్ ఓరియెంటెడ్, వృత్తి ఆధారిత కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అత్యాధునిక సాంకేతిక బోధనకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ప్యానల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, వర్చువల్ కాన్ఫరెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలలో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు అందించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.
ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విద్యాసంస్థల (ఎస్పీడబ్ల్యూ జూనియర్, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు)లో చదువుతున్న విద్యార్థినులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


