Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - అక్టోబర్ నెల దర్శన కోటా విడుదల, షెడ్యూల్ వివరాలు
Tirumala Darshan Tickets 2026 : తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటాను జూలై 18 నుంచి 24 వరకు విడతల వారీగా టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Tirumala Darshan Tickets 2026 : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అప్డేట్ ఇచ్చింది. 2026 అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ కోటాను జూలై 18వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు విడతల వారీగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

అక్టోబర్ నెల దర్శన కోటా టికెట్లు - వివరాలు
తిరుమల శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) పద్ధతిలో కేటాయిస్తారు.
భక్తులు జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తుల జాబితాను విడుదల చేసిన తర్వాత, వారు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సొమ్ము సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే టికెట్లు ఖరారవుతాయి.
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను జూలై 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదేవిధంగా, వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను అదే రోజు (జూలై 21) మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ నెట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.
- అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు : శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం కేటాయించే టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు విరాళాలు ఇచ్చి దర్శనం పొందే భక్తుల కోసం కేటాయించే శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను జూలై 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
- వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు (వ్యాధులు) ఉన్న భక్తులు తిరుమల శ్రీవారిని సులభంగా దర్శించుకునేలా టీటీడీ ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను అందిస్తోంది. ఈ ప్రత్యేక కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా : సాధారణ భక్తులు ఎక్కువగా ఆశ్రయించే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తుల వసతి సౌకర్యార్థం తిరుమల, తిరుపతిలలో అందుబాటులో ఉండే గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
భక్తులు నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని, శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

