Tirumala : తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

Tirumala : తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

Published on: Apr 26, 2026, 09:51:53 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అర టన్ను పండ్లు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 100 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

అదేవిధంగా శ్రీ శ్రీనివాస పద్మావతి పరిణయం, గజ వాహనంపై విష్ణుమూర్తి, గజ లక్ష్మి, తామరపువ్వుపై విష్ణుమూర్తి, గోపాల కృష్ణుడు, అష్ట లక్ష్ముల రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శనివారంనాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది.

ఈ క్రతువుల అనంతరం వివిధ రాగ-తాళ-వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

తర్వాత ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More