టీటీడీ : తిరుమలలో రథ సప్తమి రోజున ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
జనవరి 25వ తేదీన నిర్వహించే రథ సప్తమిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. రథ సప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తారు.
రథ సప్తమిపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి జిల్లా, టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో జనవరి 25వ తేదిన జరగనున్న రథ సప్తమిని కూడా వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.

జిల్లా, పోలీసు, టీటీడీ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు ఈవో సింఘాల్. తద్వారా భక్తులు సంతృప్తి పడేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సదుపాయాలు కల్పించామని తెలిపారు.
అన్న ప్రసాదాలు
రథ సప్తమి రోజున శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. భద్రతకు పెద్ద పీట వేయాలని, టీటీడీ భద్రత విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వంయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అదనంగా 5 లక్షల లడ్డూలు
'అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులతో కలిసి క్రమశిక్షణతో భక్తులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలి. రథ సప్తమి రోజున భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచుకోవాలి. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. పోలీసులు, టీటీడీ భద్రత సిబ్బంది సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించాలి.' అని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్
స్వామివారి వాహనాలను తనిఖీ చేసి అవసరమైన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు ఈవో. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వాటర్ పైపు లైన్లు, మరుగు దొడ్లు, బ్యారికేడ్లు, తదితర ఏర్పాట్లను ముందస్తుగా తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణి పరిశీలించి చక్రస్నానం సందర్భంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. చక్రస్నానం అనంతరం భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్యాలరీల్లోనూ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
వైద్య సిబ్బంది
గ్యాలరీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చెత్తను తరలించాలని, గ్యాలరీలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని ఆరోగ్యం విభాగం అధికారులను అనిల్ సింఘాల్ ఆదేశించారు. అత్యవసర సమయంలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
వాహన సేవలు
- తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.
- ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.
- తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


