Tirumala : భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి - త్వరలో అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం
TTD Pilgrim Experience Center : భక్తుల నిరీక్షణ సమయాన్ని ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను రూపొందించారు. త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రకటించారు.
TTD Pilgrim Experience Center Tirumala : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తుల నిరీక్షణ సమయాన్ని కేవలం వేచి ఉండటానికే కాకుండా, అత్యంత ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వినూత్న శ్రీకారం చుట్టింది. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ‘హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్’ (పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్)ను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ విశేషాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శుక్రవారం మీడియా వేదికగా వెల్లడించారు.

శుక్రవారం ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ ‘హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్’తో పాటు నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను మీడియా ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో అదనపు ఈవో పాత్రికేయులతో సమావేశమై, ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై వారి అభిప్రాయాలు, సూచనలను సేకరించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ….. సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. అందులో భాగమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ పిల్గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అని తెలిపారు.
ఆధ్యాత్మిక జ్ఞాన సమయం…
క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు శ్రీవారి మహత్యం, తిరుమల క్షేత్ర మహత్యం, పురాణాలు, ఆలయ నిర్మాణ విశిష్టతలను కళ్లకు కట్టేలా వివరించడమే ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం 3డీ (3D), వర్చువల్ రియాలిటీ (VR) వంటి అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. భక్తులు కేవలం దర్శనం కోసం వేచి ఉండటమే కాకుండా, ఆధ్యాత్మిక పరిపూర్ణతను, తిరుమల దివ్య చరిత్ర జ్ఞానాన్ని పొందేలా ఈ ప్రాజెక్టును రూపుదిద్దినట్లు ఆయన వివరించారు.
ఇప్పటికే 'దుర్లభ్ దర్శనం' అనే సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కంటెంట్‌ను సిద్ధం చేశారని, దాన్ని భారీ స్థాయిలో భక్తులకు చేరవేసేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో శ్రీవారి లీలలు, భక్తుల అనుభూతులు, తిరుమల గిరుల విశిష్టతలు, ఆలయ సేవలు, పరిపాలన మరియు దాతల వివరాలతో కూడిన నాణ్యమైన కంటెంట్‌ను క్రమం తప్పకుండా ప్రసారం చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
14 గ్యాలరీలతో ఎస్వీ మ్యూజియం….
ముఖ్యమంత్రి ప్రారంభించిన మరొక ముఖ్యమైన ప్రాజెక్టు శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అని అదనపు ఈవో తెలిపారు. తిరుమల ఆలయ పురాతన వారసత్వం, చారిత్రక కళాఖండాలు, ప్రాచీన నాణేలు, వస్తువులను ప్రదర్శించేందుకు వీలుగా దాదాపు 14 డిజిటల్ గ్యాలరీలతో మ్యూజియాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
మ్యూజియం నిర్వహణ కోసం ప్రత్యేక ప్రామాణిక నిబంధనావళి (SOP) మరియు మాన్యువల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సీసీ కెమెరాల నిఘా, శిక్షణ పొందిన సిబ్బంది నియామకం, గైడ్ల సేవలు, భద్రతా చర్యలు, మరియు కళాఖండాలకు ప్రత్యేక నంబరింగ్ వ్యవస్థను పొందుపరుస్తున్నామని, త్వరలోనే దీనిని భక్తుల సందర్శనార్థం సంపూర్ణంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
మీడియా ప్రతినిధులు ఇచ్చిన సూచనలను సానుకూలంగా స్వీకరిస్తామని…. ప్రత్యేకించి తెలుగు భాషా కంటెంట్‌ను మరింతగా పెంచడం, కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా మార్చడం వంటి సూచనలను త్వరలోనే అమలు చేస్తామని అదనపు ఈవో తెలిపారు. తిరుమల యాత్రను ప్రతి భక్తుడికీ ఒక మరువలేని ఆధ్యాత్మిక అనుభవంగా మార్చడమే తమ ప్రథమ ప్రాధాన్యమని ఆయన ముగించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

