...
...
Next Story

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌‌పై అప్డేట్.. భూసేకరణకు రూ.100 కోట్లు

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు సంబంధించి కీలక అడుగు పడింది. భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Oct 2, 2026, 09:05:10 IST
Advertisement

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 57 కిలోమీటర్ల కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అధికారికంగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఒప్పందం ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన 25 శాతం వాటాలో భాగంగా ఈ నిధులను కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ పురోగతికి ఈ నిధుల విడుదల ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏపీ సర్కార్ కేటాయించిన రూ.100 కోట్లు భూసేకరణకు ఉపయోగిస్తారు.

దివంగత జి.ఎం.సి. బాలయోగి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుకు 2001లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,120 కోట్లుగా ఉంది. ఇప్పుడు అది రూ.3900 కోట్లకు చేరింది. ఒప్పందం ప్రకారం మొత్తం వ్యయంలో 25 శాతం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి ఉండగా, మిగిలిన 75 శాతం వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖ భరిస్తుంది. రైల్వే శాఖకు అప్పగించాల్సిన భూమిలో ఇప్పటికీ దాదాపు 238 హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి అందించాల్సి ఉంది.

రైల్వే శాఖతో కుదుర్చుకున్న అసలు ఒప్పందం ప్రకారం భూసేకరణ, నిర్మాణ పనులు రెండింటికి కలిపి 25 శాతం వ్యయాన్ని భరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. మధ్యంతర కాలంలో భూసేకరణ కోసం అయిన వ్యయాన్ని కూడా రాష్ట్ర వాటా కింద జమ చేయనున్నట్లు తెలిపారు.

ప్రాజెక్టుకు రూ.100 కోట్లు విడుదల చేయడంపై అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి జి.ఎం.సి. బాలయోగి 75వ జయంతి సందర్భంగా ఈ నిధులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే పనులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు 2024 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసి ప్రాజెక్టును పునరుద్ధరించినందుకు కోనసీమ రైల్వే సాధన సమితి కన్వీనర్ ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం, స్టీరింగ్ కమిటీ సభ్యులు కల్వకోలను తాతాజీ, సప్పా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సెప్టెంబర్ 29న అమలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కోనసీమ రైల్వే ఉద్యమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు సాధన సమితి తీర్మానించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks