ఏపీ రైతులకు అలర్ట్ - ఇకపై 'యాప్' ద్వారానే యూరియా, డీఏపీ విక్రయాలు, కొత్త మార్పులివే

ఏపీలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త విధానాన్ని ప్రకటించింది. సోమవారం(జూన్ 8) నుంచి ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారానే పంటల విస్తీర్ణాన్ని బట్టి విడతల వారీగా యూరియా, డీఏపీ విక్రయించనుంది.

Published on: Jun 7, 2026, 11:35:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాగు ఎరువులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. సాగుదారులకు సకాలంలో…. సరైన ధరకే యూరియా, డీఏపీ ఎరువులను అందించే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌' (APAIMS 2.0 - ఏపీఎయిమ్స్‌) యాప్‌ను ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త యాప్ ఆధారిత విధానం ద్వారా సోమవారం(జూన్ 8) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

యూరియా
యూరియా

కృష్ణా, కాకినాడ జిల్లాల్లో మాత్రం ఈ విధానం ప్రస్తుతానికి ప్రారంభం కావడం లేదు. ఈ రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సోమవారం నుంచే ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్‌కు పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికైనందున కృష్ణా, కాకినాడ జిల్లాలను మాత్రం ప్రస్తుతానికి ఈ విధానం నుంచి మినహాయించారు. ఈ కొత్త విక్రయ విధానంపై శనివారం వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

యాప్ - రిజిస్ట్రేషన్ విధానం

  • వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఏపీఏఐఎంఎస్ (APAIMS) యాప్‌లో భూమి కలిగిన రైతులు తమ ఆధార్‌ నంబరుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • రైతులు తమ వివరాలు నమోదు చేసుకున్న వెంటనే, వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌తో అనుసంధానమైన వారి భూమి వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ఇందులో గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా రైతుకు ఉన్న నికర విస్తీర్ణం వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
  • ఆ తర్వాత రైతులు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఏ పంట వేస్తున్నారనే వివరాలను యాప్‌లో నమోదు చేయాలి.
  • పంట వివరాలు నమోదు చేసిన వెంటనే సదరు పంటకు ఎంత మోతాదులో ఎరువుల అవసరం ఉందో యాప్ లెక్కిస్తుంది. అందుకు అనుగుణంగా మొదటి విడతలో ఎంత ఇవ్వాలి. రెండో విడతలో ఎంత కోటా కేటాయించాలి అనేది విడతల వారీగా రైతుకు చూపిస్తుంది.
  • స్క్రీన్‌పై స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఎరువుల దుకాణాల వివరాలు కూడా లభ్యమవుతాయి. రైతులు తమకు నచ్చిన దుకాణాన్ని ఎంచుకుని, తమ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా ధృవీకరించి కావాల్సిన ఎరువులను సేకరించవచ్చు.

కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో….. సోమవారం నుంచి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. రైతులు, రైతు సంఘాలు, అభ్యుదయ రైతులు మరియు ఎరువుల డీలర్లకు ఈ సరికొత్త యాప్ విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు.

ఈ కొత్త విధానంతో ఎరువుల కృత్రిమ కొరతకు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్‌ చేసుకుంటే కంపెనీ నిర్ణయించిన ధరలకే ఎరువులు లభిస్తాయని…. అదనపు వసూళ్లకు అస్కారం ఉండదని చెబుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More