మారిషస్‌లో హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల

ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ అన్నారు. అతిథులను గౌరవించడంలో భారతీయులు ముందంజలో ఉంటారన్నారు.

Published on: Jan 7, 2026, 22:13:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంస్కృతి, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ అన్నారు. తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని బుధవారం ఉదయం మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సందర్శించారు. ముందుగా వేద విజ్ఞాన పీఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

తిరుమలలో మారిషస్ అధ్యక్షుడు
తిరుమలలో మారిషస్ అధ్యక్షుడు

అనంతరం వేద పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మారిషస్ దేశాధ్యక్షుడికి స్వాగతోపాన్యాసం చేశారు.

అనంతరం వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు సామూహిక వేద పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం చరిత్రను మారిషస్ దేశాధ్యక్షుడికి వివరించారు.

అనంతరం మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడుతూ తాను అధ్యాపక వృత్తి నుండి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందని, ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని పేర్కొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు. వసుదైక కుటుంబకమైన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక, సాంప్రదాయ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అతిథులను గౌరవించడంలో, స్వాగతం పలకడంలో భారతీయులు ముందంజలో ఉంటారని గోకుల్ చెప్పారు. మారిషస్ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు.

అనంతరం వేద పండితులు మారిషస్ దేశాధ్యక్షుడికి వేదాశీర్వచనం అందించగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటం అందజేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More