ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం.. లక్షల ఎకరాలకు సాగునీరు!
ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు దశాబ్దాల కల నెరవేరనుంది. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో సాగు, తాగు నీరు అందనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి, ఆగస్టు 31న ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, మార్కాపురం జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా లక్షలాది మందికి తాగునీటి ఎద్దడి తీరనుంది.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మూడో విడత పరిహారం కింద రూ.250 కోట్లను సీఎం చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేశారు. 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, 30 ఏళ్ల స్వప్నం ఇప్పుడు సాకారమవుతోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో ఫేజ్-1 కోసం రూ.2,250 కోట్లు వెచ్చించి పనులను శరవేగంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శంకుస్థాపన చేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించే అదృష్టం తనకు దక్కడం ఎంతో సంతోషాన్నిస్తోందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల 50 శాతం వర్షపాతం లోటు నమోదైందని, దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గి తీవ్ర కొరత ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. అందుకే ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా, శ్రీశైలం, రాయలసీమ ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు చంద్రబాబు. గంగ, గోదావరి, కావేరి నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నొక్కి చెప్పారు.
రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు సెప్టెంబర్‌లో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే రామాయపట్నం పోర్టు ద్వారా స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే గొప్ప అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
900 కోట్ల పరిహారంలో జగన్ ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నిర్వాసితులను మోసం చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రాజెక్టు పనులే కాదని, సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెుత్తం 7 నిర్వాసిత కాలనీల్లో 4 కాలనీల్లో 100 శాతం మౌలిక వసతులు పూర్తయ్యాయన్నారు.
'40 రోజుల్లో మూడు విడతలుగా రూ.768 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో వేశాం. వెలిగొండ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడంతోపాటు దీనికోసం భూములు ఇచ్చిన, ఆస్తులు కోల్పోయినవారికి న్యాయం చేయడానికి సమ ప్రాధాన్యం ఇచ్చాం.' అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


