Vijayasai Reddy Letter : 'జగన్‌కు నేను నమ్మక ద్రోహం చేయలేదు.. ఇప్పుడు వైసీపీలో నంబర్ 1 సజ్జలనే' - విజయసాయిరెడ్డి లేఖ

Vijayasai Reddy Open Letter : వైసీపీలో తనకు జరిగిన అవమానాలు, సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ రాజకీయాలను బయటపెడుతూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. జగన్‌కు తాను ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదని బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం వైసీపీలో సజ్జలనే నెంబర్ 1 గా ఉన్నారని పేర్కొన్నారు.

Published on: Aug 29, 2026, 16:50:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijayasai Reddy Open Letter : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు, అధికార సమీకరణాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ వల్ల తనకు జరిగిన అవమానాలు, పార్టీ వీడటానికి గల కారణాలను ఆయన ఐదు పేజీల లేఖలో సమగ్రంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై "నమ్మకద్రోహి" అని వైసీపీ కోటరీ చేస్తున్న దుష్ప్రచారానికి ఈ లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి(ఫైల్ ఫొటో)
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి(ఫైల్ ఫొటో)

నా రక్తంలోనే నమ్మకద్రోహం లేదు…

"నేను నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లలో నా పేరు లేకుండా చేసుకునేవాడిని" అని విజయసాయిరెడ్డి తన లేఖలో వ్యాఖ్యానించారు. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నందుకే ఆయనతో పాటు ప్రతి ఛార్జ్‌షీట్‌లో తనను ఎ-2గా చేర్చారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉంటే, తాను కూడా 15 నెలలు జైలు జీవితం గడిపానని, నమ్మకద్రోహం చేసే మనస్తత్వమే ఉంటే ఆనాడే అప్రూవర్‌గా మారేవాడినని స్పష్టం చేశారు.

కేసుల్లో పేర్లు.. కోటరీ కుట్రలు

2024 ఎన్నికల తర్వాత కూడా తనకు ఎలాంటి సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో A-5గా, కాకినాడ సీపోర్టు కేసులో A-2గా తన పేరును చేర్చారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో "సకల శాఖ మంత్రి" పేరు మాత్రం ఏ ఛార్జ్‌షీట్‌లోనూ లేకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వెన్నుపోటు పొడుస్తూ, కేసులు లేకుండా ఎలా బయటపడాలో అక్కడ ఉన్న కోటరీ నాయకుడికి బాగా తెలుసని ధ్వజమెత్తారు.

సజ్జలే పార్టీకి నంబర్-1…

వైసీపీలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తూ, "ఇప్పుడు ఆ పార్టీలో నంబర్-2 జగన్ అయితే, నంబర్-1 సకల శాఖల మంత్రి సజ్జల" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. 2019 విజయాల తర్వాత సజ్జల రాజ్యాంగేతర శక్తిగా మారి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దక్కకుండా గోడ కట్టారని ఆరోపించారు. 2022 మంగళగిరి ప్లీనరీలో సకల శాఖ మంత్రి తనపై భౌతికంగా దాడి చేసినా జగన్ ప్రేక్షకపాత్ర వహించారని, ఆ తర్వాత వరుసగా రీజినల్ కోఆర్డినేటర్, జిల్లా ఇన్ఛార్జ్, అనుబంధ సంఘాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఆత్మగౌరవాన్ని చంపుకుని సజ్జల కింద పనిచేయడం ఇష్టం లేకనే నాలుగేళ్ల రాజ్యసభ పదవీ కాలాన్ని, పార్టీని వదులుకున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదని… చేయబోనని స్పష్టం చేస్తూ, త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More