విజయవాడ టూ వారణాసి ఫ్లైట్‌లో వెళ్లొచ్చు.. విమాన సర్వీసు ప్రారంభం

విజయవాడ నుంచి వారణాసి వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. విజయవాడ-కోల్‌కతా వయా వారణాసి విమాన సర్వీసు ప్రారంభమైంది.

Published on: Aug 14, 2026, 06:00:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి, ఆధ్యాత్మిక భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విజయవాడ - వారణాసి (కాశీ) మధ్య విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు రాకపోకలు సాగించే ఇండిగో సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దిల్లీ నుంచి వర్చువల్‌‌గా ప్రారంభించారు. అమరావతి కనకదుర్గమ్మ దర్శనం నుంచి కాశీ విశ్వనాథుని దివ్య సన్నిధికి వెళ్లే భక్తులకు ఈ కొత్త సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

విజయవాడ టూ వారణాసి ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం
విజయవాడ టూ వారణాసి ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం

ఇప్పటివరకు వారణాసి వెళ్లాలనుకునే తెలుగు భక్తులు హైదరాబాద్ లేదా ఇతర నగరాల మీదుగా కనెక్టింగ్ విమానాల్లో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు విజయవాడ విమానాశ్రయం నుంచి కాశీకి సర్వీసులు అందుబాటులోకి రావడంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం ఎంతో సులభతరం కానుంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకునే భక్తులకు, వారణాసి క్షేత్రాన్ని దర్శించే దక్షిణాది భక్తులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం స్ఫూర్తితో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల కల్పన శరవేగంగా జరుగుతోంది. విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాజమండ్రి, కడప ఈ రెండు విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చేపట్టిన కొత్త టెర్మినల్ భవనాల నిర్మాణాలు త్వరలోనే పూర్తి కానున్నాయి.

తిరుపతికి ఈ-వీసా

భారత ఈ వీసా కలిగిన విదేశీయులు నేరుగా దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉన్న అధికారిక విమానాశ్రయాల జాబితాలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇటీవల ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తిరుపతితో పాటు భోపాల్ విమానాశ్రయాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో దేశంలో ఈ-వీసా ద్వారా ప్రవేశించగల పోర్టుల సంఖ్య 88కి చేరింది. వీటిలో 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు (సీపోర్టులు), 13 లాండ్ (సరిహద్దు) పోర్టులు ఉన్నాయి.

తిరుపతి విమానాశ్రయాన్ని విదేశీ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఇక్కడి నుంచి క్రమబద్ధమైన అంతర్జాతీయ విమానాలు నడవాలంటే విమానయాన సంస్థలు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలతో సర్వీసులు ప్రారంభించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రారంభంలో వచ్చే నష్టాలను అధిగమించడానికి, సర్వీసులను కొనసాగించడానికి విమానయాన సంస్థలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సాయాన్ని కోరుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం అనేకమంది విదేశీ భక్తులు వస్తుంటారు. ఇప్పటివరకు వీరు చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగి, అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా లేదా దేశీయ విమానాల ద్వారా తిరుపతికి చేరుకునేవారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More