దశాబ్ధాల 'విశాఖ ఎయిర్‌పోర్ట్' సేవల ప్రస్థానం ముగింపు - ఇక భోగాపురం నుంచే ప్రయాణాలు!

విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులు ముగిశాయి. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయి.

Published on: Aug 17, 2026, 05:12:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, పారిశ్రామిక రాజధాని విశాఖపట్నం వైమానిక రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ముగిసి…. మరో నూతన అధ్యాయం ప్రారంభమైంది. భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ (ఐఎన్ఎస్ డేగా) నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులను అధికారికంగా నిలిపివేశారు.

విశాఖ విమానాశ్రయం
విశాఖ విమానాశ్రయం

ఆదివారం రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో 6E 2018 విమానమే విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచిన చివరి షెడ్యూల్డ్ వాణిజ్య సర్వీస్ గా రికార్డుల్లోకి ఎక్కింది.

ఈ సందర్భంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎన్. పురుషోత్తమ్ మాట్లాడుతూ.. "దశాబ్దాలుగా విశాఖ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు సేవలు అందించి, నగర అభివృద్ధిలో భాగమైంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన ఉద్యోగులు, భాగస్వాములు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఆగస్టు 17న అర్ధరాత్రి 12.01 గంటల నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో విశాఖ సివిల్ ఎన్‌క్లేవ్‌లో సాధారణ వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తారు. ఇన్నాళ్లూ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గుర్తింపుగా ఉన్న అంతర్జాతీయ కోడ్ 'VTZ' (IATA Code) కూడా ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుంది.

విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్డ్ విమానాలు నిలిచిపోయినప్పటికీ, నాన్-షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల (చార్టర్డ్ విమానాలు, ప్రైవేట్ జెట్లు) రాకపోకలు మాత్రం కొనసాగే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వివరించారు.

దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం….

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పర్యాటక రంగాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. దేశంలోని ప్రధాన నగరాలకు సేవలు అందిస్తూ, నగర రూపురేఖలను మార్చడంలో ప్రధాన భూమిక వహించింది. కాలక్రమేణా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టెర్మినల్ విస్తరణ, విమానాల పార్కింగ్ సదుపాయాలు, డిజియాత్ర (DigiYatra) సేవలు, పర్యావరణ అనుకూల చర్యలు వంటి అనేక మౌలిక వసతులను ఇక్కడ అభివృద్ధి చేశారు.

ఇన్నాళ్లూ ఈ సివిల్ ఎన్‌క్లేవ్‌లో విమాన కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు సహకరించిన భారత నౌకాదళానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాన్-షెడ్యూల్డ్ విమాన సర్వీసులు కొనసాగే క్రమంలో నేవీ సహకారం మున్ముందు కూడా చాలా కీలకమని పేర్కొంది. అలాగే రక్షణ బాధ్యతలు చూసుకున్న సీఐఎస్ఎఫ్ (CISF), వివిధ ఎయిర్‌లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల సేవలను ఏఏఐ కొనియాడింది.

విశాఖపట్నం కొత్తగా ప్రారంభమవుతున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో వైమానిక రంగంలో సరికొత్త శిఖరాలను అందుకోబోతోందని…. ఈ ప్రాంతం మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఏఏఐ ఆశాభావం వ్యక్తం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More