సివిక్ సెన్స్ ఎక్కడయ్యా? భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం తర్వాత ఘోరం!
భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఉత్తరాంధ్రుల కల. ఇలాంటి ఎయిర్‌పోర్ట్ ఘనంగా ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అక్కడకు వచ్చిన జనాలు చేసిన పనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక మైలురాయిగా నిలవాల్సిన శుభ సందర్భం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని వీడియోల వల్ల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేలా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజే అక్కడ చోటుచేసుకున్న ఘటనలు నెటిజన్లను, రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ఆగస్టు 1, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయంలో, ఆగస్టు 17, 2026 నుండి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే విమానాశ్రయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రజలు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అయిన వీడియో దృశ్యాల ప్రకారం... విమానాశ్రయాన్ని చూడటానికి వచ్చిన సందర్శకులు అక్కడ అందం కోసం నాటిన మొక్కలను పీకేయడం, అలంకారిక వాటర్ ఫౌంటెన్లలోకి దిగి ఆటలాడటం, ఫోటోలకు భంగిమలు ఇవ్వడం వంటి పనులు చేశారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పిక్నిక్ స్పాట్‌గా, వినోద పార్కుగా భావించి వారు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంత గొప్ప మౌలిక వసతులు కల్పించినా, వాటిని కాపాడుకునే పౌర బాధ్యత మనలో లోపించిందనడానికి ఈ ఘటన నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినమైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేకమంది డిమాండ్ చేశారు.
తొలిసారి విమానాశ్రయాలకు వచ్చే వారికి ప్రజా ఆస్తులను ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు.
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, పార్కులు కేవలం ప్రభుత్వ రికార్డుల్లో ఉండే కట్టడాలు కావు. అవి మన పన్నుల డబ్బుతో, మన ప్రయాణ సౌకర్యార్థం, మన ప్రాంత గౌరవాన్ని పెంచేందుకు నిర్మించిన మన సొంత ఆస్తులు. అధునాతన మౌలిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ బాధ్యత అయితే, వాటిని పరిశుభ్రంగా, సురక్షితంగా కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక ధర్మం.
ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా, పర్యాటకంగా ఎదగడానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక ప్రధాన వేదిక. ఇలాంటి ప్రాజెక్టుల వద్ద మనం ప్రదర్శించే క్రమశిక్షణే మన ప్రాంతీయ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. అంతేకానీ మెుక్కలు తీసుకుని వెళ్లడం, అక్కడ వాటిని నాశనం చేయడం సరికాదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


