Visakhapatnam Airport : విశాఖ విమానాశ్రయం తరలింపు…! జులై 8 నుంచి భోగాపురం నుంచే విమాన సర్వీసులు! ఈ మార్పులు తెలుసుకోండి

Visakhapatnam International Airport : విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. జులై 8 నుంచి వాణిజ్య విమాన సర్వీసులన్నీ విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానున్నాయి.

Published on: Jun 29, 2026, 13:37:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Visakhapatnam International Airport : విశాఖపట్నం ప్రాంత పౌర విమానయాన రంగంలో చారిత్రాత్మక మార్పునకు ముహూర్తం ఖరారైంది. జులై 8వ తేదీ నుంచి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ పౌర విమాన (సివిలియన్) రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఆ తేదీ నుంచి వాణిజ్య విమాన సర్వీసులన్నీ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుండి ప్రారంభం కానున్నాయి.

విశాఖపట్నం విమానాశ్రయం
విశాఖపట్నం విమానాశ్రయం

ప్రస్తుతం విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయం పూర్తిగా భారత నావికాదళం (ఇండియన్ నేవీ) ఆధీనంలో ఉంది. జులై 8 నుంచి ఇక్కడ పౌర విమానాల నిర్వహణను నిలిపివేసి, గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం విమానాశ్రయాన్ని ఈ ప్రాంత ఏకైక వాణిజ్య విమానయాన గేట్‌వేగా మారుస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా పరిపాలనా యంత్రాంగ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం..!

పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) నమూనాలో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) ఈ అత్యాధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. జులై మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది.

అనంతరం జులై 8 నుంచి ఇక్కడి నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు షురూ అవుతాయి. మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా నామకరణం చేసిన ఈ విమానాశ్రయం….. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల (6 మిలియన్) మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా రూపొందించారు. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.

ఎయిర్‌పోర్ట్ కమిషనింగ్‌కు ముందు భాగంగా ఇప్పటికే జనవరి 4వ తేదీన ట్రయల్ మరియు వాలిడేషన్ ఫ్లైట్స్ (ప్రయోగాత్మక విమాన సర్వీసులు) విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రయాణికులకు అవసరమైన చెక్-ఇన్ కౌంటర్లు, బ్యాగేజీ హ్యాండ్లింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్ వంటి వసతులపై అధికారులు తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు.

విమానయాన సంస్థల అలర్ట్.. టారిఫ్ వివరాలు ఇవే

సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సహా పలు ప్రముఖ విమానయాన సంస్థలు జులై 8 మరియు ఆ తర్వాత ప్రయాణించే తమ ప్యాసింజర్లకు, ట్రావెల్ ఏజెంట్లకు ఇప్పటికే అలర్ట్‌లు జారీ చేశాయి. జులై 8 నుండి విశాఖకు వచ్చే, ఇక్కడి నుండి వెళ్లే అన్ని విమానాలు పాత ఎయిర్‌పోర్ట్‌కు బదులుగా భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే నడుస్తాయని స్పష్టం చేశాయి.

ఆంధ్రప్రదేశ్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ (TTAA) కూడా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు డిపార్చర్ మరియు అరైవల్ ఎయిర్‌పోర్ట్ వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించింది. ప్రారంభంలో ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ లోని టెర్మినల్-1 నుండి చెక్-ఇన్ కార్యకలాపాలు సాగుతాయి.

మరోవైపు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (AERA) జూన్ 22న ఈ కొత్త విమానాశ్రయానికి సంబంధించి అడ్ హాక్ టారిఫ్ (తాత్కాలిక రుసుములు) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రెగ్యులర్ ఛార్జీలు ఖరారయ్యే వరకు ఇవే అమలులో ఉంటాయి.

  • డొమెస్టిక్ (దేశీయ) ప్రయాణికులు : యూజర్ డెవలప్‌మెంట్ ఫీజ్ (UDF) కింద బయలుదేరే ప్రయాణికులు రూ. 835, వచ్చే ప్రయాణికులు రూ. 355 చెల్లించాలి.
  • ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు: వెళ్లే ప్రయాణికులకు యూడీఎఫ్ రూ. 1,255 గా, వచ్చే ప్రయాణికులకు రూ. 545 గా నిర్ణయించారు.
  • ల్యాండింగ్ ఛార్జీలు: ఎయిర్‌క్రాఫ్ట్ గరిష్ట బరువును బట్టి ప్రతి మెట్రిక్ టన్నుకు డొమెస్టిక్ విమానాలకు రూ. 1,400, అంతర్జాతీయ విమానాలకు రూ. 1,975 చొప్పున వసూలు చేస్తారు.

భోగాపురం విమానాశ్రయం వాణిజ్య పరంగా ముస్తాబవుతున్నప్పటికీ…. విశాఖ నగరం నుండి ప్రయాణించే వారికి కనెక్టివిటీ (రవాణా సౌకర్యం) అతిపెద్ద సవాలుగా మారబోతోంది. ఈ ఎయిర్‌పోర్ట్ విశాఖ నగరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, హెచ్‌పీసీఎల్, ఈస్టర్న్ నావల్ కమాండ్ వంటి ప్రధాన కేంద్రాలు, పరిశ్రమలన్నీ విశాఖకు దక్షిణ వైపున ఉన్నాయి. అక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడానికే కనీసం ఒకటిన్నర నుండి రెండు గంటల సమయం పడుతుందని, ఇక చెక్-ఇన్ సమయాన్ని కూడా కలుపుకుంటే ప్రయాణికులు చాలా ముందుగా బయలుదేరాల్సి ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాన మార్గమైన జాతీయ రహదారి-16 (NH-16) పై ఎప్పుడూ భారీగా సరుకు రవాణా లారీల రద్దీ ఉంటుంది. ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం రహదారిని ఎయిర్‌పోర్ట్ కారిడార్‌గా గుర్తించినప్పటికీ…. అది కూడా నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోతోంది.

పీక్ అవర్స్‌లో గాజువాక లేదా స్టీల్ ప్లాంట్ ప్రాంతం నుండి సబ్బవరం, ఆనందపురం మీదుగా వెళ్తే 1 గంట 40 నిమిషాలు, బీచ్ రోడ్ మరియు భీమిలి మీదుగా వెళ్తే 1 గంట 35 నిమిషాల సమయం పడుతుందని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) అంచనా వేసింది. కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు వీఎంఆర్‌డీఏ (VMRDA) ఏడు రోడ్డు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. వీటిలో అడవివరం-సొంత్యం, వేపగుంట-పినగాడి రోడ్లు మాత్రమే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగలవని అధికారులు భావిస్తున్నారు.

ఈ సమస్యపై విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ స్పందించారు. గతంలో హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం నుండి శంషాబాద్‌కు విమాన సర్వీసులు మార్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయని….. ఆ తర్వాత రోడ్డు మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతో సమస్యలన్నీ సర్దుకున్నాయని చెప్పారు. భోగాపురం విషయంలోనూ అదే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పౌర విమాన సర్వీసులను పూర్తిగా భోగాపురానికి తరలించడంపై విశాఖలో రాజకీయ చర్చ మొదలైంది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే, సీనియర్ బీజేపీ నేత పి. విష్ణుకుమార్ రాజు పాత ఎయిర్‌పోర్ట్‌లో వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని….. అయితే అంతర్జాతీయ మరియు సుదూర ప్రాంతీయ విమానాలను కొత్త ఎయిర్‌పోర్ట్ నుండి నడుపుతూనే, తక్కువ దూర ప్రయాణాల డొమెస్టిక్ సర్వీసులను ప్రస్తుత నావల్ ఎయిర్‌ఫీల్డ్ లోని పాత ఎయిర్‌పోర్ట్ నుంచే కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నావికాదళం కూడా నిర్దేశిత సమయాల్లో పౌర విమానాలకు సహకరించగలదని… కొత్త ఎయిర్‌పోర్ట్ దూరం కావడంతో ప్రజలు ఇళ్లనుంచి రెండు గంటల ముందే బయలుదేరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More