వైజాగ్ గూగుల్-అదానీ డేటా సెంటర్: పర్యావరణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖపట్నంలో నిర్మిస్తున్న $15 బిలియన్ల గూగుల్-అదానీ డేటా సెంటర్‌కు పర్యావరణ, చట్టబద్ధమైన అనుమతులు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధనలను పక్కన పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Published on: Aug 24, 2026, 20:36:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న $15 బిలియన్ల గూగుల్-అదానీ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ, చట్టబద్ధమైన అనుమతులన్నీ పూర్తిస్థాయిలో ఉన్నాయో లేదో ప్రభుత్వం సరిచూసుకోవాలని స్పష్టం చేసింది. "పర్యావరణ అనుమతులను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోలేం" అని పేర్కొన్న కోర్టు, క్షేత్రస్థాయి పనులు తగిన అనుమతులతోనే సాగుతున్నాయని అధికారులు నిర్ధారించుకోవాలని సూచించింది.

నెదర్లాండ్స్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ డేాటా సెంటర్ (ప్రతీకాత్మక చిత్రం) (AFP)
నెదర్లాండ్స్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ డేాటా సెంటర్ (ప్రతీకాత్మక చిత్రం) (AFP)

స్టే ఇవ్వడానికి నిరాకరణ.. నివేదికకు ఆదేశం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమైనందున పనులను నిలిపివేస్తూ 'యథాతథ స్థితి' (Status Quo) ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ బొలిశెట్టి సత్యనారాయణ తరఫు న్యాయవాది విరాగ్ గుప్తా కోరారు. అయితే, పనుల నిలిపివేతకు నిరాకరించిన ధర్మాసనం.. సంబంధిత ప్రభుత్వ శాఖలన్నింటి నుంచి ఒక పూర్తిస్థాయి సంయుక్త నివేదికను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

సింహాచలం దేవస్థానం భూములు, పర్యావరణ ఆందోళనలు

సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూముల కేటాయింపు, రక్షిత అటవీ ప్రాంతానికి ప్రాజెక్టు సమీపంలో ఉండటం, పర్యావరణ అనుమతులు, నీరు, విద్యుత్ వినియోగంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పర్యావరణ అనుమతి కేవలం భవన నిర్మాణానికే పరిమితమని, డేటా సెంటర్ నిర్వహణకు కాదని పిటిషనర్ వాదించారు.

అలాగే, హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేవాదాయ భూములను వేరే అవసరాలకు బదిలీ చేయడానికి వీల్లేదన్న పాత ఉత్తర్వులను గుర్తుచేశారు. ఆసక్తికరంగా, ఇప్పటివరకు ఉన్న అనుమతి పత్రాల్లో గూగుల్ పేరు ఎక్కడా లేకపోవడాన్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు ప్రాంతం రక్షిత అటవీ ప్రాంతానికి 0.86 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నందున, దీనికి కేంద్ర పర్యావరణ శాఖ (Category A) అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

లీజు మాత్రమే.. బదిలీ కాదు: ప్రభుత్వం స్పష్టత

దేవాదాయ భూముల ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. దేవస్థానం భూములను ఎవరికీ విక్రయించలేదని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (APIIC) కేవలం లీజుకు మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ లీజు ఒప్పందం ద్వారా సింహాచలం ఆలయానికి ఏటా దాదాపు రూ. 26 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని కోర్టుకు తెలిపారు.

విశాఖలో మెగా డేటా సెంటర్లు

గూగుల్ సంస్థ 2025 అక్టోబర్‌లో విశాఖలో ఏఐ (AI) హబ్ ఏర్పాటును ప్రకటించింది. అందులో భాగంగా అదానీ కనెక్స్‌తో కలిసి 1 గిగావాట్ (1GW) సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన 'డేటా సెంటర్ పాలసీ 4.0' ద్వారా భారీ రాయితీలు ఇస్తుండటంతో విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. 6 గిగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రూ. 1.6 లక్షల కోట్ల ($17 బిలియన్లు) పెట్టుబడితో 1.5GW డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More