...
...
Next Story

ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్.... టీడీపీలో చేరిన జెడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను!

విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తన కుమార్తెతో కలిసి మంగళవారం టీడీపీలో చేరారు. అమరావతిలో సీఎం చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Published on: Sep 9, 2026, 07:58:40 IST
Advertisement

ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు
టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు

మజ్జి శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు వారికి పార్టీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చిన్న శ్రీను రాకతో ఉత్తరాంధ్రలో టీడీపీ మరింత బలపడనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆ పార్టీ బలోపేతానికి మజ్జి శ్రీనివాసరావు కీలక భూమిక పోషించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు అయిన శ్రీను… జిల్లా వ్యాప్తంగా బలమైన నాయకత్వ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నారు. గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన… తన అనుచరులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఈ చేరిక ద్వారా విజయనగరం జిల్లా పరిషత్‌పై కూడా స్పష్టమైన రాజకీయ ప్రభావం పడనుంది. చిన్న శ్రీనుతో పాటు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ కీలక నాయకులు కూడా త్వరలోనే పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో వైసీపీకి అనుకూలంగా ఉన్న విజయనగరంలో ఈ పరిణామం ఆ పార్టీ ఉనికికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతకుముందు వైసీపీకి, పదవులకు చిన్న శ్రీను రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి, భీమిలి నియోజకవర్గం ఇంఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలుపుతూ…. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖను పంపించారు.

మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి చేరిక చర్చనీయాంశంగా మారింది. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks