విశాఖలో నీటి కొరత.. ట్యాంకర్ల సరఫరాను పెంచిన జీవీఎంసీ, ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
భూగర్భ జల వనరులు అడుగంటిపోవడంతో విశాఖపట్నం నగరంలో నీటి కొరత ఉంది. దీంతో పలు ప్రాంతాల ప్రజలు తమ రోజువారీ నీటి అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సప్లై చేస్తోంది.
భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో విశాఖపట్నంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు దైనందిన అవసరాల కోసం, చివరికి తాగునీటి కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అరిలోవ, యారాడ, మధురవాడ, భీమునిపట్నం వంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అత్యవసర చర్యలు చేపట్టింది. నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరాను వేగవంతం చేసింది. మరోవైపు అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల సముదాయాల నివాసితులు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రైవేట్ నీటి కోసం నెలకు రూ. 6,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.
ఇన్నేళ్లలో నగరంలో ఇటువంటి తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నీటి సమస్య పరిష్కారానికి జీవీఎంసీ డయల్ ఎ ట్యాంకర్ పేరుతో ప్రత్యేక టోల్ ఫ్రీ సేవను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రారంభించిన 48 గంటల్లోనే దాదాపు 1,000 అభ్యర్థనలు రాగా అధికారులు చాలా వరకు నీటిని సరఫరా చేశారు.
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 102 ట్యాంకర్ల ద్వారా రోజుకు దాదాపు 400 ట్రిప్పులు వేస్తూ యుద్ధప్రాతిపదికన నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
నగరానికి నీటిని అందించే ప్రధాన జలాశయాల్లో సరిపడా నీటి మట్టాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం 154.11 అడుగులుగా ఉందని, దీని ద్వారా రోజుకు 0.50 MGD (2.27 MLD) నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. అరిలోవ, భీమిలి ప్రాంతాలకు ప్రాధాన్యత క్రమంలో నీటిని అందిస్తున్నామన్నారు. అలాగే సరఫరా చేసే నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 8 రాత్రి నాటికి డయల్-ఎ-ట్యాంకర్ ద్వారా వచ్చిన 977 వినతులలో 619 పూర్తయ్యాయని కమిషనర్ వెల్లడించారు.
వాటర్ ట్యాంకర్ ఎలా బుక్ చేసుకోవాలి?
జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్ gvmc.gov.in లోకి లాగిన్ అవ్వండి.
e-Booking విభాగంలోకి వెళ్లి Water Tanker Booking ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ ప్రాంతం, కావలసిన నీటి పరిమాణం, ఇతర వివరాలను నమోదు చేయండి.
వినతి సమర్పించిన తర్వాత ఒక అకనాలెడ్జ్‌మెంట్ జనరేట్ అవుతుంది.
వెబ్‌సైట్‌లోని My Booking విభాగానికి వెళ్లి Make My Payment ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు పూర్తి చేయండి.
సంప్రదించాల్సిన నంబర్లు
టోల్ ఫ్రీ నంబర్: 1800 4250 0009
కార్పొరేషన్ ఆఫీస్ : 9014218870
వాట్సాప్ నంబర్: 8187897569
మొబైల్ నంబర్: 7386001360
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


