...
...
Next Story

Mango Pulp Export : పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. మ్యాంగో పల్ప్‌ ఎగుమతులకు బ్రేకులు

Mango Pulp Export : ఏపీ నుంచి ఎగుమతి అయ్యే మ్యాంగో పల్ప్ మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇందుకు కారణంగా ఉన్నాయి.

Published on: Apr 20, 2026, 14:21:36 IST
Advertisement

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రాసెస్ చేసిన మామిడి గుజ్జు(Mango Pulp) నిలిచిపోయింది. దీని ఫలితంగా 90 శాతానికి పైగా గుజ్జు నిల్వలు గోదాములు, ఓడరేవు గిడ్డంగులలోనే నిలిచిపోయాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.

మ్యాంగో పల్ప్
మ్యాంగో పల్ప్

ప్రస్తుత మామిడి సీజన్ పెద్దగా ఆశాజనకంగా లేదు. విదేశీ దిగుమతిదారుల నుండి చెల్లింపులు ఇంకా అందనందున, ఈ ఏడాది రైతుల నుండి మామిడి పండ్లను సేకరించలేకపోతున్నామని ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు పేర్కొంటున్నారు. ప్రాసెస్ చేసిన మామిడి ఉత్పత్తులకు ప్రపంచ కేంద్రంగా పేరుగాంచిన చిత్తూరు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

పరిశ్రమ ప్రతినిధుల ప్రకారం.. ప్రస్తుతం 3 లక్షల టన్నులకు పైగా మామిడి గుజ్జు గోదాములు, పోర్టు గిడ్డంగులలో నిల్వ ఉండిపోయింది. ఇదిలా ఉండగా గల్ఫ్ దేశాలకు గుజ్జును రవాణా చేయడానికి ప్రతి కంటైనర్‌కు 2,000 డాలర్ల యుద్ధ నష్టపు సర్‌చార్జిని చెల్లించాల్సి ఉంటుందని కంటైనర్ కంపెనీలు మామిడి గుజ్జు యూనిట్ యజమానులకు తెలియజేశాయి.

మరోవైపు బీమా కంపెనీలు సాధారణ రేట్లతో పోలిస్తే తమ ఛార్జీలను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచినట్టుగా తెలుస్తోంది. ఫలితంగా ఎగుమతి లాభాలు తీవ్రంగా పడిపోయాయి. ప్రతి 7.4 టన్నుల మామిడి గుజ్జు కంటైనర్ ఎగుమతిపై, ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పుడు కేవలం అతి తక్కువ లాభాలను మాత్రమే ఆర్జిస్తున్నాయి. గోదాములలో ఉన్న నిల్వలను ఖాళీ చేయడానికి, అనేక యూనిట్లు గుజ్జును గణనీయంగా తగ్గించిన ధరలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

మిగిలిన 30 శాతం పల్ప్‌ను దేశీయ మార్కెట్‌లో విక్రయిస్తారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడానికి, ప్రస్తుతం పల్ప్‌ను పాత ఓటీఎస్ టిన్‌లకు బదులుగా 215 కేజీల ఆరు పొరల ఏసెప్టిక్ బ్యాగులలో ఎగుమతి చేస్తున్నారు. మామిడి గుజ్జు ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశం టాప్‌లో ఉన్నది. మొత్తం ఎగుమతుల్లో దాదాపు 70 శాతం చిత్తూరు నుంచే వస్తుందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి, ఎగుమతిదారుల లాభాల మార్జిన్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అంతేకాదు పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా మామిడి గుజ్జు పరిశ్రమపై పడిన ఆర్థిక ప్రభావం రూ.750 కోట్లు వరకు ఉంటుందని అంచనా. మరోవైపు చెల్లింపులు ఆలస్యం కావడంతో ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి నగదు రావడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. రైతుల నుంచి మామిడి పండ్లను సేకరించడంపై ప్రభావం పడింది.

ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి పండ్లకు డిమాండ్ తగ్గింది. మెుత్తం మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ మీద దీని ప్రభావం పడింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks