ఏపీ స్థానిక ఎన్నికలు 2 నెలలు ఆలస్యం కానున్నాయా? ఎస్‌ఈసీ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం కానున్నాయనే వార్తపై స్పష్టతనిచ్చింది.

Published on: Sep 29, 2026, 14:55:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం కానున్నాయని, కోర్టు కేసుల క్లియరెన్స్ వస్తేనే ప్రక్రియ మొదలవుతుందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఏపీ స్థానిక ఎన్నికలు
ఏపీ స్థానిక ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితా (ఎలక్టోరల్ రోల్స్), రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులలో నడుస్తున్న కేసుల విచారణ పూర్తయ్యాకే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, అందుకే కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందని కొందరు తప్పుడు ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారం ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ పరిస్థితిపై తక్షణమే స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారికంగా వెల్లడించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం కమిషన్ జారీ చేసినది కాదని, అది కేవలం కల్పితమని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది. ధ్రువీకరించని వార్తలను సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేయడం, ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేయడం చేయవద్దని ప్రజలతో పాటు రాజకీయ పార్టీలకు, ఇతర భాగస్వామ్య పక్షాలకు విజ్ఞప్తి చేసింది.

అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్‌ఈసీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పేరుతో కల్పిత వార్తలు, తప్పుదోవ పట్టించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక వార్త లేదా నవీకరణ ఉన్నా, దానిని నేరుగా మీడియా సమావేశాల ద్వారా లేదా అధికారిక ప్రెస్ రిలీజ్‌ల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని కమిషన్ వెల్లడించింది.

ఏదైనా వార్త లేదా సమాచారం సోషల్ మీడియాలో చూసినప్పుడు, దానిని నమ్మే ముందు ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్, ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలని సూచించింది. ఈ స్పష్టమైన వివరణతో ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యంపై సాగుతున్న పుకార్లకు తెరపడినట్లయింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More