శేషాచలం నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా బయటికి వెళ్లొద్దు - డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. అమూల్యమైన సంపదను భావి తరాలకు అందించాలని అభిప్రాయపడ్డారు.

Published on: Nov 16, 2025, 12:08:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పర్యావరణపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైందన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారుయ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఒక్క దుంగ కూడా వెళ్లొద్దు - డిప్యూటీ సీఎం

ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనీ… దీని కోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని తాజాగా అధికారులను ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తే అక్రమార్కుల ఆటకట్టించడం అసాధ్యం కాదన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొన్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్ వైజర్లు, గోదాము కీపర్లు వంటి కిందిస్థాయి వారిని గుర్తించి… వారికి చట్టంపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. వారికి ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్ర చందనం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘‘2015లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ తీసుకుంది. అప్పట్లోనే దీని కోసం ప్రత్యేకంగా ఆలోచించి రెడ్ సాందర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు. కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్ కు నియమించి, అటవీ-పోలీసు అధికారులతో ప్రత్యేకంగా దళం ఏర్పాటు చేయించి ముందుకు వెళ్లారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత టాస్క్ ఫోర్సును ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేశారు" అని చెప్పుకొచ్చారు.

“2019-24 మధ్య లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించారు. నేను ఇటీవల సందర్శించిన తిరుపతిలోని 8 గోదాముల్లో 2,63,267 ఎర్రచందనం దుంగులున్నాయి. కేవలం పట్టుబడిన దుంగలను బట్టి చూస్తేనే సుమారు 2 లక్షల చెట్లు నరికినట్లు అర్ధమవుతోంది. మరి అక్రమ మార్గాల్లో ఎన్ని లక్షల చెట్లను నరికివేశారో ఊహకు అందటం లేదు” అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.

సంకల్పంలా తీసుకోవాలి - పవన్ దిశానిర్దేశం

“ఎర్రచందనం అనేది పర్యావరణహితమైన చెట్టు. అత్యంత పటిష్టంగా శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్షం. ఇక నుంచి ఎర్రచందనం ఒక్క దుంగ కూడా బయటకుపోకుండా చేయాలి. దీనికి మన ముందున్న దారులన్నీ వినియోగించుకుందాం. మళ్లీ టాస్క్ ఫోర్సుకు జీవం పోసి, అక్రమ రవాణా నిరోధించే ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతాను. స్మగ్లర్లపై పెట్టిన కేసుల్లోనూ న్యాయస్థానాల నుంచి వేగంగా తీర్పులు రావడం శుభసూచకం. అటవీ శాఖ సిబ్బంది ఎర్ర చందనం సంరక్షణను ఒక సంకల్పంలా తీసుకోవాలి” అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మన రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అయిన ఎర్రచందనం దుంగలు దేశంలో ఎక్కడ దొరికినా మనకు చెందేలా ప్రత్యేకంగా ఆదేశాలను ఇప్పించామని పవన్ గుర్తు చేశారు. దీంతోనే ఇటీవల గుజరాత్ లో 5 టన్నులు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లో 7 టన్నులు, కర్ణాటకలో 6 టన్నులు, ఢిల్లీలో 10 టన్నులు సీజ్ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేపాల్ లో ఉన్న 173 టన్నల ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రక్రియ మొదలైందని వివరించారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాల్లో 2019-24 ప్రాంతాల్లో పట్టుబడిన 407 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

“ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అందుబాటులో ఉన్న సాంకేతిక వినియోగానికి తోడు సిబ్బంది కృషి చాలా అవసరం. టెక్నాలజీతోపాటు సంకల్పం తోడైతేనే ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించగలం. పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం ఎర్రచందనం స్మగ్లింగు జరిగే అవకాశం ఉన్న ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ డ్రోన్లతో నిఘాను పెంచాలి. అటవీ చెక్ పోస్టులను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను అమర్చి, నిత్యం పర్యవేక్షణ చేయాలి. సరికొత్త బ్యారికేడ్లను చెక్ పోస్టుల వద్ద అమర్చి, బేస్ క్యాంపులు, వాచ్ టవర్లలో గస్తీ ముమ్మరం చేయాలి” అని డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More