అమరావతి శాసనసభ భవనానికి ప్రపంచస్థాయి రూపకల్పన.. కీలక చర్చలు

అమరావతి శాసనసభ భవనం ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు. వాస్తుతోపాటుగా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా డిజైన్ చేయనుంది ప్రభుత్వం.

Published on: Aug 27, 2026, 06:10:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో, ఆధునిక వాస్తుశిల్పం-తెలుగు సంస్కృతి సమ్మేళనంగా, రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, సుస్థిర నిర్మాణ విధానాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

అమరావతి శాసనసభ భవనంపై చర్చలు
అమరావతి శాసనసభ భవనంపై చర్చలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో జరిగిన మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్, సీఆర్‌డీఏ చీఫ్ ఇంజనీర్ ఏ.వి. రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ భవనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపకల్పన చేయడంపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక వాస్తుశిల్ప సౌందర్యంతో పాటు, భవనం వినియోగించే ప్రతి వర్గానికి సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు.

శాసనసభ సముదాయంలో ముఖ్యమంత్రి ఛాంబర్, శాసనసభ స్పీకర్ ఛాంబర్, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ కార్యాలయం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశ మందిరం, మంత్రులు, శాసనసభ్యుల కార్యాలయాలు, వివిధ శాసనసభ కమిటీల సమావేశ మందిరాలు తదితర విభాగాలను సమగ్రంగా ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు.

అదేవిధంగా ప్రధాన సభా మందిరం, కమిటీ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్స్, శాసనసభ్యుల లాబీలు, ప్రోటోకాల్ ప్రాంతాలు, మీడియా సెంటర్, ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, మీడియా వర్క్‌స్టేషన్లు, మీడియా బ్రీఫింగ్ సదుపాయాలు, సందర్శకుల గ్యాలరీలు, పబ్లిక్ లాంజ్‌లు, విజిటర్స్ రిసెప్షన్ ప్రాంతాలు వంటి కీలక సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంపై ప్రతినిధులతో అభిప్రాయాలు పంచుకున్నారు.

శాసనసభ కార్యకలాపాలను ఆధునిక పద్ధతుల్లో నిర్వహించేందుకు ఆడియో-విజువల్ వ్యవస్థలు, డిజిటల్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు, ఆధునిక కమ్యూనికేషన్ నెట్‌వర్క్, లైవ్ టెలికాస్ట్, బ్రాడ్‌కాస్టింగ్ సదుపాయాలు, డిజిటల్ శాసన వ్యవస్థలు వంటి సాంకేతిక మౌలిక వసతులను సమగ్రంగా ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు.

ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, సందర్శకుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ప్రోటోకాల్ మూవ్‌మెంట్, యాక్సెస్ కంట్రోల్, భద్రతా జోన్లు, పార్కింగ్, డ్రాప్–ఆఫ్, పికప్ ప్రాంతాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ వ్యవస్థలు వంటి అంశాలను డిజైన్‌లో సమర్థవంతంగా సమన్వయం చేయాలని చర్చించారు.

అంతర్గత రూపకల్పనలో సభా మందిరం, ముఖ్యమంత్రి, స్పీకర్ ఛాంబర్లు, మంత్రులు, శాసనసభ్యుల కార్యాలయాలు, BAC సమావేశ మందిరం, ఇతర కమిటీ హాళ్లు, మీడియా సెంటర్ తదితర విభాగాలను ప్లాన్ చేస్తున్నారు. భద్రతకు సంబంధించి సీసీటీవీ నిఘా, యాక్సెస్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ, ఫైర్ సేఫ్టీ తదితర ఆధునిక వ్యవస్థలను సమగ్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సమావేశంలో వివరించారు.

అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, శాసనసభ భవనం కేవలం పరిపాలనా నిర్మాణంగా కాకుండా రాష్ట్ర ప్రజాస్వామ్య స్ఫూర్తికి, తెలుగు సంస్కృతి, వారసత్వానికి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలకు చిరస్థాయి ప్రతీకగా నిలిచేలా నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో దృష్టి సారించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More