రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ : చంద్రబాబుపై సీఎం రేవంత్ కామెంట్స్ - వైసీపీ చేతికి సరికొత్త అస్త్రం..!

ఏపీ - తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. బనకచర్లతో అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు… ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Published on: Jan 4, 2026, 10:40:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకానికి 90 టీఎంసీలు రావాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అలా కుదరకపోతే జూరాల నుంచి నేరుగా నీటిని తరలిస్తామని కూడా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో బనకచర్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు (ఫైల్ ఫొటో)
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు (ఫైల్ ఫొటో)

అసెంబ్లీ వేదికగా కామెంట్స్…

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నీళ్లు – నిజాలు' అన్న అంశంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఆపిన చరిత్ర తనదంటూ మాట్లాడారు.

“నాకు నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాత పార్టీ. ఆ తర్వాత నాయకుడు. సీఎం కుర్చీలో ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా ప్రవర్తించను. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించిన చరిత్ర నాది. ఆ ప్రాజెక్టు పనులను ఆపితేనే చర్చలకు వస్తామని చెప్పిన చరిత్ర మాది” అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆగాయా? లేదో.. కేసీఆర్, హరీశ్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ వేసి చూసుకోవాలని చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రశ్నాస్త్రాలు…!

తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త అస్త్రంలా మారాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేసే దిశగా ప్రశ్నాస్త్రాలను సంధించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోడ్ చేస్తూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

“తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి, రాయలసీమకు మరణశాసనం రాశారు. తన స్వార్థంకోసం, లాలూచీపడి రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారు. తన చేతులతో కరువునేలకు మరణ శాసననం రాశారు. తెలంగాణ సీఎం రేవంత్‌తో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ను ఆపేశారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డే ఆ రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజాలను ఈ రకంగా తన స్వార్థంకోసం అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడాచూసి ఉండం. చంద్రబాబు వల్లే ఆరోజు రాష్ట్రానికి ఆల్మట్టి రూపంలో ఒక శాపం వచ్చింది, కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ కమీషన్లకోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి తన చేతిలోకి తీసుకున్నాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూనే ఉన్నాడు” అని ప్రకటనలో పేర్కొంది.

“శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుజిల్లాలకు నీళ్లు రావాలంటే ప్రాజెక్టు నీటిమట్టం 875 అడుగులు ఉంటేనేకాని పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నీళ్లు రావు. 840 అడుగులు ఉంటేనే హంద్రీనీవాకు నీళ్లు రావు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి 800 అడుగులనుంచే నీళ్లు ఎత్తిపోసేందుకు తెలంగాణ రాష్ట్రం పలు ప్రాజెక్టులు చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ప్రాజెక్టులనుంచి పెద్ద ఎత్తున నీటిని తీసుకెళ్లడానికి వేగంగా అడుగులు ముందుకేశారు” అని వివరించింది.

“శ్రీశైలం డ్యాం నిండకుండానే విద్యుత్‌ ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం ఖాళీ చేస్తోంది. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి తాగునీటికి, సాగునీటికి తీవ్ర కొరతను దృష్టిలో ఉంచుకుని వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకుని రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును మొదలుపెట్టారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను జోరుగా ముందుకు తీసుకెళ్లారు. జగన్మోహన్‌రెడ్డిగారి పేరువస్తుందని గత ప్రభుత్వంలో చంద్రబాబుగారు తన టీడీపీ కార్యకర్తల ద్వారా కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నంచేశారు. అయినా సరే రాయలసీమ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ముందుకు కొనసాగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది” అని వివరించింది.

“చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పూర్తిగా చేతులు కలిపి, రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్కాయం చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా తన చేతుల ద్వారా స్వయంగా అడ్డుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఇవాళ దీనికి సంబంధించి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించిన విషయాలు దీన్ని నిర్దారిస్తున్నాయి. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు” అని స్పష్టం చేసింది.

మరోవైపు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నీటి ప్రాజెక్టుల వివాదాలు ఇటు తెలంగాణలోనూ… మరోవైపు ఏపీలోనూ రాజకీయ సెగలు పుట్టిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More