...
...
Next Story

యూట్యూబర్ ప్రశ్న రావణ్ భార్య సంచలన ప్రకటన.. ఆ వీడియోలన్నీ ఫేక్.. అంతా కుట్ర!

ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్(బచ్చలకుర జోసెఫ్) భార్య బచ్చలకుర అనూష స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. తన భర్తపై వస్తున్న ఆరోపణలను, ప్రచారంలో ఉన్న వీడియోలను ఆమె తీవ్రంగా ఖండించారు.

Published on: Jul 5, 2026, 19:48:07 IST
Advertisement

ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ భార్య అనూష తాజాగా స్పందించారు. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రశ్న రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు అనూష. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలు పూర్తిగా కల్పితమైనవి, క్రియేట్ చేశారని చెప్పారు. తమ తప్పులను సమర్థించుకునేందుకే కొందరు లేని వీడియోలను సృష్టించి ఈ తప్పుడు ప్రచారానికి దిగారని పేర్కొన్నారు.

యూట్యూబర్ ప్రశ్న రావణ్
యూట్యూబర్ ప్రశ్న రావణ్

కొన్ని మీడియా సంస్థలు రావణ్ కులాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అనూష అన్నారు. కులాలు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు తమ కుటుంబం పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి తన భర్త కులం గురించి చెప్పారు. తన భర్త పేరును ఉపయోగించి ఫలానా పార్టీ, ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తమకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధాలు లేవని, గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలబడడమే రావణ్ పార్టీ అన్నారు.

'సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్నదే రావణ్ సిద్ధాంతం. ఎవరినీ కించపరచాలని, నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆయన గట్టిగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు చెప్పాలి లేదా లోపాలను సరిదిద్దుకోవాలి. అంతే కానీ ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే రావణ్ మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్‌ను కూడా అరెస్ట్ చేయాలి కదా.' అని అనూష అన్నారు.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే రావణ్‌ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారని అనూష ఆరోపించారు. 'ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు, కానీ నిజాయితీ మాకు ఉంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల మా కుటుంబానికి అపారమైన నమ్మకం ఉంది.' అని ఆమె పేర్కొన్నారు.

సామాజిక, రాజకీయ అంశాలపై యూట్యూబ్ వేదికగా మాట్లాడే ప్రశ్న రావణ్‌పై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA - Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సాధారణంగా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు భంగం కలిగించే తీవ్రమైన కేసుల్లో ఉపయోగించే ఉపా(UAPA) చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు నమోదును పలువురు ప్రజాస్వామ్యవాదులు, హక్కుల నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య అనూష స్పందిస్తూ.. ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe