ఎస్ఈసీ తీరు దారుణం... చంద్రబాబుకు తొత్తుగా మారింది - వైఎస్ జగన్ ఫైర్

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో విస్తృతంగా అక్రమాలు జరిగాయని, రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎం చంద్రబాబుకు తొత్తుగా మారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Published on: Nov 2, 2026, 10:56:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పూర్తి తొత్తుగా మారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల అక్రమాలకు ఎస్‌ఈసీ ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన మున్సిపల్ పోలింగ్ రోజు చోటుచేసుకున్న దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్)లో ప్రకటన విడుదల చేశారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్

పులివెందులలో జరిగాయని చెప్తున్న పోలింగ్ అక్రమాలపై జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో ఏకంగా 70 చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు లేకుండా చేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేశారని తెలిపారు.

తమ పార్టీకి చెందిన ఏజెంట్లు బూత్‌లలోకి వెళ్లకుండా దాడులు చేశారని… కొన్నిచోట్ల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు లాగేశారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇవన్నీ పోలీసుల ప్రత్యక్ష సహకారంతోనే జరిగాయని విమర్శించారు. ఓటర్ల నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారని…. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద చాలా స్పష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఎస్ఈసీ తీరు దారుణం - వైఎస్ జగన్

ఆ 70 బూత్‌లలో తమ పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా తన సమక్షంలోనే అధికారులకు ఏజెంట్ ఫారాలు చూపిస్తూ ఫిర్యాదు చేసి నిరసన తెలిపారని, రాష్ట్రం మొత్తం ఈ దృశ్యాలను చూసిందని జగన్ గుర్తుచేశారు. అయినా ఎస్‌ఈసీ స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 బూత్‌లకు గాను 70 బూత్‌లలో అక్రమాలు జరిగి, దాడులు చేసి ఏజెంట్లను తరిమేస్తే.. కేవలం 4 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి అధికారులు చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

ఎస్‌ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా అని నిలదీశారు. వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని ఎలా అంటారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు.

పులివెందులలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయని జగన్ ఎత్తిచూపారు. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అక్రమాలు సాగాయని తెలిపారు. వీటితో పాటు మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, సూళ్లూరుపేట, పలాస, డోన్, నాయుడుపేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఈ ఎన్నికల అక్రమాలపై తమ పార్టీ తరఫున గట్టిగా న్యాయపోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాన్ని, వీడియో సాక్ష్యాలను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. న్యాయం జరగడానికి కొంత ఆలస్యం కావచ్చునేమో గానీ, చివరికి న్యాయం, ధర్మమే గెలుస్తాయని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More