మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
రాయలసీమ లిఫ్ట్ కొత్త ప్రాజెక్ట్ కాదు.. కాంగ్రెస్ తో చంద్రబాబువి దోస్తీ రాజకీయాలు - వైఎస్ జగన్
రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని…. కరువు పరిస్థితుల్లో నీటిని సమర్థవంతంగా వాడుకునే ఇన్సూరెన్స్ పథకమని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు ప్రాజెక్టు పనులు ఆపేశారని తీవ్రంగా విమర్శించారు.
కృష్ణా జలాలు, రాయలసీమ లిఫ్ట్ స్కీం చుట్టూ రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. తాజా పరిస్థితులపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తెలంగాణలో పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం అసలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తోందని స్పష్టం చేశారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన చంద్రబాబు, కాంగ్రెస్తో రాజకీయ దోస్తీ కోసం మౌనంగా ఉంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.

రాయలసీమ లిఫ్ట్ కొత్త ప్రాజెక్ట్ కాదు - వైఎస్ జగన్
రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని జగన్ తేల్చిచెప్పారు. ఈ పథకం వల్ల కొత్తగా నీటి కేటాయింపులు, కొత్త కాలువలు, అదనపు రిజర్వాయర్లు లేదా కొత్త ఆయకట్టు ఏవీ లేవని వివరించారు. కృష్ణానదిలో లభించే అవే నీటిని, అవే కేటాయింపుల మేరకు, పోతిరెడ్డిపాడు ద్వారా అవే కాలువల్లోకి తరలించేందుకు రూపొందించిన బీమా పథకం వంటిదని తెలిపారు. కరువు పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.
కృష్ణా నది ద్వారా రాష్ట్రానికి చేరే నీటి ప్రవాహం దశాబ్దాలుగా తగ్గుముఖం పడుతోందని జగన్ గుర్తు చేశారు. ఎగువ నుంచి రావాల్సిన నీరు తగ్గడం ఒక సమస్య అయితే….. వచ్చిన నీటిని కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టారీతిన దిగువకు విడుదల చేయడం మరో తీవ్ర సమస్యగా మారిందన్నారు.
శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం కనీసం 880 అడుగులకు పైన ఉంటేనే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తిస్థాయిలో అంటే 44 వేల క్యూసెక్కుల నీరు పారే అవకాశం ఉందని జగన్ వివరించారు. నీటిమట్టం 854 అడుగుల కంటే తగ్గితే అసలు నీరే తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. 880 అడుగులకు పైన నీటిమట్టం ఎన్ని రోజులు ఉంటుందో తెలియని అనిశ్చితి వల్ల….. రాయలసీమలో తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తోడుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోందని జగన్ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 టీఎంసీ, కల్వకుర్తి ద్వారా 0.4 టీఎంసీ, ఎస్ఎల్బీసీ ద్వారా 0.5 టీఎంసీ చొప్పున మొత్తంగా దాదాపు రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని వదులుతోందని పేర్కొన్నారు.
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీంను ప్రారంభించామని జగన్ తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా సహజంగా నీరు తీసుకోలేని సమయంలో…. లిఫ్ట్ చేసి అదే కాలువలోకి ఎత్తిపోస్తూ, ఉన్న రిజర్వాయర్లకు నీటిని చేర్చడమే దీని ఉద్దేశమని చెప్పారు. నీటి వాటా ఉన్నా వాడుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు అర్థమేముంటుందని ప్రశ్నించారు. అదనపు నీరు, కొత్త రిజర్వాయర్లు లేని ఈ పథకం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని నిలదీశారు. ప్రజల దాహార్తి తీర్చే ఇన్సూరెన్స్ లాంటి పథకాన్ని భూతద్దంలో చూపించడం భావ్యమా….? అని ప్రశ్నించారు.
దాదాపు పూర్తి దశకు చేరుకున్న రాయలసీమ లిఫ్ట్ పనులను….. చంద్రబాబు అధికారంలోకి రాగానే తనకు ఎక్కడ పేరు వస్తుందోనని నిలిపివేశారని జగన్ ఆరోపించారు. పథకం ఆవశ్యకతను గట్టిగా వినిపించాల్సింది పోయి, రాజకీయ లబ్ధి కోసం పక్కన పెట్టేశారని విమర్శించారు. కరువు వంటి క్లిష్ట పరిస్థితుల్లో హక్కుగా దక్కాల్సిన నీటిని వాడుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల జీవనాధారానికే ముప్పు తెచ్చారని అన్నారు. ఎవరికీ హాని చేయని ఈ ప్రాజెక్టుపై అనవసర విమర్శలు మానుకోవాలని జగన్ హితవు పలికారు.

E-Paper
