రూ.లక్ష కోట్లతో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్'

రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సాగునీరు, ఉద్యానవనం, గ్రామీణ రహదారులు, ప్రాసెసింగ్, ఎగుమతులు ఒకే వేదికపై తీసుకువస్తున్నట్టుగా వెల్లడించారు.

Published on: Oct 1, 2026, 16:49:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఒకప్పుడు కరువుకు చిరునామాగా భావించిన రాయలసీమను దేశానికే కాకుండా ప్రపంచానికే ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ కార్యక్రమానికి సమగ్ర కార్యాచరణ రూపొందించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు సంప్రదాయంగా తక్కువ ఆదాయం ఇచ్చే వర్షాధార పంటలకే పరిమితం కాకుండా, తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల వైపు అడుగులు వేయాలన్నదే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాయలసీమ ప్రాంతంలో వార్షిక వర్షపాతం పరిమితంగా ఉండటం, తరచూ కరువు పరిస్థితులు ఏర్పడటం, సాగునీటి కొరత, మార్కెట్ అనుసంధానం లోపించడం వంటి సమస్యలను ఒక్కొక్కటిగా కాకుండా నీరు నుంచి మార్కెట్ వరకు రైతుకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒకేసారి పరిష్కారం చూపేలా సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–IHDP రూపొందించినట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యానికి మొదటి నుంచీ అత్యంత ప్రాధాన్యం లభించిందన్నారు.

రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికలో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడుల్లో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యానవన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకు మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేసి, 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం, ఉత్పత్తిని దాదాపు రెట్టింపు చేయడం, సుమారు 9.6 లక్షల రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యమన్నారు.

మొదటి దశలో 2026-27లో రూ.12,066 కోట్లతో 72 క్లస్టర్లపై దృష్టి సారిస్తామని మంత్రి అచ్చెన్న తెలిపారు. రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెరువులు, చివరి ఆయకట్టు వరకు నీరు చేరే వ్యవస్థలు, కీలక గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. రెండో దశలో 2027-28లో రూ.15,036 కోట్లతో మరో 67 క్లస్టర్లు, మూడో దశలో 2028–29లో రూ.13,250 కోట్లతో మిగిలిన 62 క్లస్టర్లను అభివృద్ధి చేసి మొత్తం 201 క్లస్టర్లను సమగ్ర ఉద్యాన ఉత్పత్తి-ప్రాసెసింగ్-మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

రాయలసీమ రైతుకు నీటి భద్రత కల్పించకుండా ఉద్యాన విప్లవం సాధ్యం కాదు. అందుకే నీరు-పంట-మార్కెట్ అనే మూడు అంశాలను ఒకే ప్రణాళికలో అనుసంధానిస్తున్నాం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా సుమారు 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, మరో 4.3 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించేందుకు 5,721 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి కూడా ప్రతిపాదించినట్టుగా చెప్పారు.

ఉద్యాన పంటలను సాగు చేయించడం దగ్గరే ప్రభుత్వ బాధ్యత ముగియదని మంత్రి స్పష్టం చేశారు. పంట కోత, గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, రవాణా, దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును అభివృద్ధి చేయడమే IHDP ప్రత్యేకత అన్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు–FPOలను బలోపేతం చేసి ప్రాసెసింగ్ సంస్థలు, ఎగుమతిదారులు, రిటైల్ మార్కెట్లతో నేరుగా అనుసంధానిస్తామని చెప్పారు. మామిడి పల్ప్, అరటి పౌడర్, చిప్స్, టమాటా ప్యూరీ, మిర్చి ఒలియోరెసిన్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తాజా పండ్ల మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులను రక్షించే అవకాశం ఉంటుందన్నారు. కోల్డ్ చైన్లు, ప్యాక్‌హౌస్‌లు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రణాళికలో భాగం చేసినట్లు తాజా ప్రభుత్వ నోట్ ఆధారంగా నివేదికలు పేర్కొన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగంలో ఇప్పటికే సాధించిన అరటి ఎగుమతుల పురోగతి ఈ విధానానికి మంచి ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. 2016–17లో కేవలం 246 టన్నులుగా ఉన్న అరటి ఎగుమతులు, క్లస్టర్ విధానం, ఎగుమతి సంస్థల భాగస్వామ్యం, నాణ్యతా ప్రమాణాలు, రవాణా సదుపాయాల అభివృద్ధితో అనంతపురం నుంచి ఇరాన్‌కు లక్ష టన్నులకు పైగా ఎగుమతి అయ్యే స్థాయికి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. పండించిన రైతు ధర కోసం ఎదురు చూడకూడదు. మార్కెట్ రైతు వద్దకు రావాలి. మన రైతు ఉత్పత్తి ప్రపంచ మార్కెట్‌లో బ్రాండ్‌గా నిలవాలి. అదే మా ప్రభుత్వ లక్ష్యం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఈ సమగ్ర ప్రణాళిక ద్వారా మూడో సంవత్సరం నుంచి సుమారు రూ.81 వేల కోట్ల అదనపు స్థూల విలువ జోడింపు–GVA సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన మొక్కలు, సూక్ష్మ సాగునీరు ద్వారా ఉత్పాదకత పెంపు, గ్రేడింగ్–సార్టింగ్–బ్రాండింగ్ ద్వారా రైతుకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కూడా ఈ ప్రణాళికలో కీలక లక్ష్యాలని పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More