భద్రతాపరమైన సమస్యలు వస్తాయి...మరో వేదికను ఎంచుకో..! నా పిల్లలైనా ఇదే నిర్ణయం - షర్మిలకు వైఎస్ జగన్ లేఖ
వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖను వైసీపీ విడుదల చేసింది. వైఎస్ జగన్పై చంద్రబాబు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. షర్మిల కుమార్తె వివాహ వేదికకు సంబంధించి కీలక వివరాలను పేర్కొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పక్కా ప్రణాళికాబద్ధమైన దాడులు, అక్రమాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చిందని మండిపడింది. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. షర్మిల కుమార్తె వివాహ వేదిక విషయంలో కూడా జగన్ ను టార్గెట్ చేస్తూ… లేనిపోని ఆరోపణలు చేయటాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా జగన్ రాసిన ఓ లేఖను పార్టీ విడుదల చేసింది.

లేఖలో కీలక విషయాలు…
ఇదే సమయంలో వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీన రాసిన లేఖను పార్టీ తాజాగా విడుదల చేసింది. షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖలో అనేక కీలక, భావోద్వేగ విషయాలను ప్రస్తావించారు. అంజలి వివాహం నిశ్చయమైన వార్త తెలిసి తాను ఎంతో సంతోషించానని లేఖలో పేర్కొన్నారు.
"గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని రాజకీయ, వ్యక్తిగత పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అంజలి జీవితాంతం ఎంతో సంతోషంగా, ప్రేమానురాగాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని జగన్ ఆకాంక్షించారు.
అయితే బెంగళూరులోని తన నివాస ప్రాంగణంలోనే వివాహ వేడుక నిర్వహించాలనే నిర్ణయంపై తనకున్న భద్రతాపరమైన అభ్యంతరాలను లేఖ ద్వారా వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
"వివాహం వంటి శుభకార్యానికి పెద్ద సంఖ్యలో బంధువులు, అతిథులతో పాటు క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పెద్ద ఎత్తున వస్తారు. వీరిలో చాలామంది తమకు ముందస్తు పరిచయం లేని వ్యక్తులే ఉంటారు. అంతమంది వ్యక్తులు నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. నివాస ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం భద్రతకు ఏమాత్రం మంచిది కాదు" ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు.
"నా పిల్లల (హర్ష లేదా వర్ష) పెళ్లి అయినా కూడా భద్రత, గోప్యత ప్రయోజనాల దృష్ట్యా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. నా సొంత ఇల్లు కాబట్టి ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది," అని లేఖలో వివరించారు.
తన అభ్యంతరాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వివాహ వేదికను మార్చాలని వైఎస్ జగన్ కోరారు. గతంలో రాజా పెళ్లి నిర్వహించిన విధంగా ఏదైనా కన్వెన్షన్ సెంటర్లో గానీ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ వివాహం జరపవచ్చని సూచించారు. అటువంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంటిని వివాహానికి ఉపయోగించుకోవచ్చని ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే అమల్లో ఉంటుందని చెప్పారు.
"అంజలి వివాహం ఆమె జీవితంలో ఒక ప్రత్యేకానుభూతిగా నిలిచిపోవాలి. భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని ఆశిస్తున్నాను. అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ జగన్ ముగించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

