కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, తమ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయన ఈ ఆందోళన చేపట్టారు.
ఆర్వో ఆఫీస్ ముందు నిరసన….

ఈ రోజు ఉదయం పులివెందుల క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్… నేరుగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట సుమారు 70 మంది వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు కూడా ఉన్నారు. అయితే, భద్రతా కారణాలు మరియు నిబంధనలను బూచిగా చూపుతూ అధికారులు జగన్ బృందాన్ని ఆర్వో ఆఫీసు లోపలికి అనుమతించలేదు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్, దానికి నిరసనగా కార్యాలయం ప్రాంగణం ముందే బైఠాయించి ఆందోళన ప్రారంభించారు.
అనేక ప్రాంతాల్లో తమ పార్టీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇటువంటి అక్రమాలు సరికాదని, తక్షణమే నిబంధనల ప్రకారం వైఎస్సార్సీపీ ఏజెంట్లందరినీ బూత్‌లలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్వో ఆఫీసు వద్ద జగన్ బైఠాయించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. స్థానికంగా ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.