...
...
Next Story

YS Jagan : మేం ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు... అమరావతి పేరుతో చంద్రబాబు దండుకుంటున్నారు - వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి చట్టబద్ధత తీర్మానం విషయంలోనూ డ్రామాలు ఆడారని విమర్శించారు. అమరావతిలో ఆర్గనైజ్డ్‌ కరప్షన్‌ జరుగుతోందని ఆరోపించారు.

Published on: Apr 1, 2026, 12:47:34 IST
Advertisement

సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతి పేరిట ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అనే అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిందని… కేంద్రం పాత్ర లేనేలేదని స్పష్టం చేశారు. అయినా సరే చంద్రబాబు అమరావతి పేరిట డ్రామా నడిపిస్తున్నారని విమర్శించారు.

డ్రామాలు చేస్తున్నారు - వైఎస్ జగన్

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

“చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. పరిపాలన అంటే ఆయన దృష్టిలో దోపిడీ, అవినీతి మాత్రమే. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టం. అమరావతి చట్టబద్ధత తీర్మానం విషయంలోనూ డ్రామాలు ఆడారు. తాను చేసే దోపిడీనుంచి డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు ” అని వైఎస్ జగన్ కామెంట్స్ చేశారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన జగన్…. అమరావతిలో ఆర్గనైజ్డ్‌ కరప్షన్‌ జరుగుతోందని చెప్పారు. 2018లో ఎవరు ఏ పనులు చేశారో.. 2024 తర్వాత అవే కంపెనీలకు బాధ్యతలు అప్పగించారని వివరించారు. ఫైవ్‌స్టార్‌ నిర్మాణాల్లో కూడా చ.అడుగుకు రూ.4,500 మించదు…. వీళ్లు చేసే దోపిడీ ముందు వీరప్పన్‌ కూడా సరిపోడంటూ దుయ్యబట్టారు.

వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు…

రాజధానిపై తీర్మానం అవసరం లేదని మంత్రి పార్థసారథి స్టేట్‌మెంట్‌ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు." రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే పదం ఉందా.? రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌కు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి" అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దృష్టిలో పరిపాలన అంటే దోపిడీ, అవినీతి చేయడమే అని జగన్ ఫైర్ అయ్యారు. విజన్.. సంపద సృష్టి అంటూ కొత్త పేర్లు పెట్టి స్కామ్‌ల ద్వారా దోపిడీకి పాల్పడుతుంటాడని విమర్శించారు.

“ఏడేళ్లు నువ్వు సీఎంగా ఉండి.. లక్ష ఎకరాల అమరావతిలో ఇప్పటి వరకు కట్టింది ఎంత చంద్రబాబూ…? ఏ దేశానికి పోతే.. ఆ దేశం బొమ్మలు చూపిస్తూ ఇదిగో అమరావతి ఇలా ఉంటుందని చెప్తావు. కానీ ఆచరణలో అవి కనిపించవు. కనీసం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలనైనా నెరవేర్చావా చంద్రబాబూ..? అమరావతి పేరిట జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న చంద్రబాబు లోకేష్ ఏనాడైనా ఇక్కడ ఉన్నారా ? నెలలో సగం రోజులు హైదరాబాదులో ఉంటూ ఇక్కడికి షికారు మాదిరి వచ్చి వెళ్తున్నారు.. ఇదేనా మీ పాలన..” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఏ ప్రాంతానికి మేం వ్యతిరేకం కాదు - జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయంతో పాటు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే మా పార్టీ నిర్ణయాలు తీసుకుందన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలు… తప్పకుండా బయటికి వస్తాయని చెప్పారు. సాక్ష్యాధారాలతో సహా అన్ని విషయాలను వెలుగులోకి తీసుకువస్తామన్నారు.

"రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. ఆ లెక్కన లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి. రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?. ఈ 2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి. 2019కి ముందు మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు మారుస్తున్నారు..? అని వైఎస్ జగన్ నిలదీశారు.

“అమరావతికి మేం వ్యతిరేకం కాదు. కానీ సాధ్యం కాదని తెలిసి కూడా లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలను పక్కనబెట్టి… ఇలా లక్షల కోట్లు ఖర్చు చేయటం ఎందుకు..? ప్రజలను మోసం చేస్తూ…పాలన కొనసాగిస్తున్నారు”అని జగన్ దుయ్యబట్టారు.

MAVIGUN ప్రతిపాదన…

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మరో కొత్త ప్రతిపాదన చేశారు. “మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కి.మీ, విజయాడ నుంచి గుంటూరు 40 కి.మీ.. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్‌ కారిడార్‌ కింద డిక్లేర్‌ చేస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుందని చెప్పాం. మేం ప్రాక్టికల్‌గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు. ప్లాన్‌-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి. దీని కోసం అమరావతిలో పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ పెట్టినా చాలు” అని వైఎస్ జగన్ కామెంట్స్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks