'పవన్ కల్యాణ్ గారు.. ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ విద్వేషాలు నింపకండి' - వైఎస్ షర్మిల
కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ మాట్లాడటం బాధాకరమన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దని కోరారు.
కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తుండగా…. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు.

మళ్లీ విద్వేషాలు నింపొద్దు - వైఎస్ షర్మిల
“కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం బాధాకరం. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే. ఇది పవన్ గారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు” అని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.
శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదు. మూడ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదు" అంటూ పవన్ కల్యాణ్ కు షర్మిల హితవు పలికారు.
కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. రూ. 3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలుపెట్టాలని సూచించారు.
కూల్చివేతలు దారుణం - వైఎస్ షర్మిల
ఇక విజయవాడలోని భవానీపురంలో ఇళ్ల కూల్చివేతలపై వైఎస్ షర్మిల స్పందించారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా భవానిపురంలో 42 ఇండ్లను కనికరం లేకుండా కూల్చడం దారుణమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ తొందరపాటు చర్యగా అభివర్ణించారు.
“25 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న స్థానికులకు నిలువ నీడ లేకుండా చేశారు. ఉన్న పళంగా కట్టుబట్టలతో రోడ్డున పడేశారు. వారి ఆవేదన వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఎన్నికల్లో సమస్యను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేశారు. చివరికి సమస్య చెప్పుకునేందుకు వెళ్తే సీఎం గారు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. భవానిపురంలో ఇండ్లు కోల్పోయిన బాధితులను పిలిచి మాట్లాడండి. వారి వేదన వినండి.వారికి న్యాయం చేయండి. వివాదానికి పరిష్కారం చూపండి” అని వైఎస్ షర్మిల కోరారు.














