YSRCP MAVIGUN : ప్రజల్లోకి 'మావిగన్'... ప్లాన్ బీపై వైసీపీ ఫోకస్..!

రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ కొత్త రాగాన్ని వినిపిస్తోంది. అమరావతి కాకుండా ‘మావిగన్’ తెరపైకి తీసుకువచ్చింది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించగా… ఆ పార్టీ నేతలు గట్టిగా సమర్థిస్తున్నారు. అమరావతి పేరుతో దోచుకోవటమే చంద్రబాబు లక్ష్యమని ఆరోపిస్తున్నారు.

Published on: Apr 4, 2026, 10:13:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో తీర్మానం చేయగా…. పార్లమెంట్ లో కూడా ఆమోదం లభించింది. రాష్ట్రపతి సంతకం తర్వాత… గెజిట్ విడుదల కానుంది. ఫలితంగా అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని… ఇక శాశ్వత రాజధానిగా ఉండిపోతుందని కూటమి పార్టీలు చెబుతున్నాయి.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

ఇదిలా ఉంటే… ప్రతిపక్ష వైసీపీ స్టాండ్ మరోలా ఉంది. అమరావతి కాకుండా మావిగన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు… చర్చనీయాంశంగా మారాయి. అమరావతి పేరుతో దోచుకోవటమే చంద్రబాబు పని అని… అసలు రాజధాని నిర్మాణం పూర్తవుతుందా వంటి ప్రశ్నాస్త్రాలను కూడా సంధించారు.

పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా కూడా వైసీపీ ఎంపీలు… వాకౌట్ చేశారు. అమరావతికి వ్యతిరేకం కాదని… ఈ తరహా బిల్లుకే వ్యతిరేకమంటూ మాట్లాడారు. అయితే వైసీపీ తీరుపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాజధాని విషయంలో వారికే స్పష్టత లేదనవి… ఆ పార్టీ తీరులో మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ అమరావతిని టచ్ చేయాలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి… పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ, పార్టీ వ్యవస్థాపక అంశాలు, ప్రజా సమస్యలు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో రాజధాని అంశంపై మాట్లాడారు.

ప్లాన్ బీపై దిశానిర్దేశం…

రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది స్పష్టమైన వైఖరని… చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదని సజ్జల విమర్శించారు. ఆ పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ఆయన ప్లాన్‌ అని ఆరోపించారు.

“మనం గతంలో విశాఖను గ్రోత్‌ కారిడార్‌గా అనుకున్నాం, అమరావతిని గుదిబండలా మార్చే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు. జగన్‌ చెప్పినట్లు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు‌ రియల్ క్యాపిటల్ గా గ్రోత్ కారిడార్‌గా మెగా సిటీగా మారుతుంది. ఆర్గానిక్‌ గ్రోత్ ఉంటుంది. ఇది మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. రాయ్‌పూర్‌, నోయిడాలు ఎన్ని ఏళ్ళయినా ప్రజా రాజధానిగా లేవు, చంద్రబాబు అమరావతి కోసం చేస్తున్న అప్పు ఎప్పటికి తీరుతుందో తెలీదు, కానీ జగన్‌ ప్రతిపాదిస్తున్న ప్లాన్ బి అమరావతిలో పదో వంతు ఖర్చు పెడితే చక్కటి రాజధాని సిద్దమవుతోంది” అని సజ్జల వ్యాఖ్యానించారు.

“ పార్లమెంట్‌లో, ఉద్దండరాయునిపాలెంలో మట్టి కుప్పవద్ద దండాలు పెట్టి టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చక్కగా మాట్లాడి రాష్ట్రం గురించి, రాజధాని గురించి చెప్పారు, జగన్‌ చెప్పిన ప్రతి మాట గ్రామగ్రామానికి వెళ్ళాలి. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అప్పులు అంతులేకుండా పోయాయి. ఇక దానికి వడ్డీల సంగతి సరేసరి. కానీ జగన్‌ ఏది సాధ్యం…? ఏది అసాధ్యం..? అనేది వివరించారు. ఆచరణాత్మకంగా మనం చేయగలిగేది జగన్‌ స్ఫష్టంగా చెప్పారు” అని సజ్జల వివరించారు.

ప్రజల మధ్య చర్చ జరగాలి - సజ్జల


“చంద్రబాబు మాత్రం వేల ఎకరాల భూసమీకరణ, భూసేకరణలపై ప్రజల్లో చర్చ జరగాలి. రాజధాని పేరుతో చంద్రబాబు దింపుతున్న ఊబిలో దిగకుండా ప్లాన్ బి పేరుతో జగన్‌ చెప్పిన ప్రణాళికపై విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలి. ఈరోజు కూడా అమరావతి నిరంతర ప్రక్రియ అంటున్నారు చంద్రబాబు. అంటే దానిని కామధేనువులా దోచుకోవాలన్నదే అతని ప్లాన్. ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజల మధ్య చర్చ జరగాలి” అని నేతలకు సజ్జల దిశానిర్దేశం చేశారు.

ఓవైపు కూటమి ప్రభుత్వం అమరావతికి తిరుగులేదని చెబుతోంది. పార్లమెంట్ లో ఆమోదముద్ర లభించిన నేపథ్యంలో… భవిష్యత్ లో కూడా ఎవరూ టచ్ చేయలేరని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ వైసీపీ మాత్రం…. రాజధానిగా అమరావతిని అంగీకరించలేకపోతుంది. జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ… దోచుకోవటం కోసమే అక్కడ పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More