చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నాననిపిస్తోంది.. ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాం.. కానీ తప్పడం లేదు: నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటూ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని అనడం విశేషం.
నటుడు నిఖిల్ సిద్ధార్థ తన మొదటి పీరియడ్ యాక్షన్ మూవీ 'స్వయంభు' షూటింగ్‌ను ఎట్టకేలకు పూర్తి చేశాడు. రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ సినిమా షూటింగ్ అనుభవాలను అతడు 'హిందుస్థాన్ టైమ్స్'తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.

స్వయంభు షూటింగ్‌పై..
తన నెక్ట్స్ మూవీ స్వయంభుపై అతడు స్పందించాడు. "ఈ సంవత్సరం నా సినిమా ఎందుకు విడుదల కాలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను ఏదో పెద్ద దాని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ పెద్ద విషయమే 'స్వయంభు'. రెండు సంవత్సరాల వ్యవధిలో 170 రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం కేటాయించాం. అదే సమయంలో నేను 'కార్తికేయ 2'ని కేవలం 80 రోజుల్లో పూర్తి చేశాను" అని నిఖిల్ తెలిపాడు.
నిఖిల్ సిద్ధార్థ్ 'కృష్ణన్ రామన్' పాత్రలో..
11వ శతాబ్దంలో కృష్ణన్ రామన్ అనే చోళ యోధుడు ఉన్నాడని నిఖిల్ చెప్పాడు. ఆ సేనాపతి గురించి విన్నప్పుడు, అతని కథను తప్పకుండా చెప్పాలని అనిపించిందని నిఖిల్ పేర్కొన్నాడు.
"నేను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లేదా మన 'బాహుబలి' వంటి పీరియడ్ కంటెంట్‌కి పెద్ద అభిమానిని. మనం తరచుగా గ్రీక్ హీరో అకిలెస్ గురించి చర్చిస్తాం. కానీ కృష్ణన్ రామన్ వంటి భారతీయ హీరో గురించి కొద్ది మందికే తెలుసు" అని నిఖిల్ అన్నాడు.
"నేను ఈ కథ గురించి, నా పాత్ర గురించి విన్నప్పుడు చాలా నచ్చింది. అతని కథను చెప్పాల్సిందేనని అనుకున్నాను. అతను కింగ్‌మేకర్. ఆ పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది" అని నిఖిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
యుద్ధ వీరుడి పాత్రలో సవాళ్లు
'స్వయంభు'లో ఆ పాత్ర పోషించడానికి నిఖిల్ తనను తాను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మార్చుకోవాల్సి వచ్చింది. చిన్న పొరపాటు కూడా చాలా పెద్దగా కనిపించే అవకాశం ఉన్నందున.. తన పాత్ర తెరపై ఎలా ఉంటుందనే విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉన్నానని అతడు చెప్పాడు.
"చారిత్రక కచ్చితత్వం ఉండేలా మేము జాగ్రత్తలు తీసుకున్నాము. నా పాత్రకు నేను న్యాయం చేశానని నాకు తెలుసు. నా పాత్ర సెంగోల్‌ను (రాజదండం) ఉపయోగించడం వంటి అంశాలను కూడా గౌరవంతో చూపించారు. ఫోన్లు లేని ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లడానికి, నేను ఆ మైండ్ సెట్ లో ఉండి, ఆ సమయానికి సరిపోయేలా ఉండటానికి నా వంతు కృషి చేశాను" అని నిఖిల్ వివరించాడు.
అయితే అత్యంత సవాలుగా అనిపించిన అంశం ఏమిటని అడిగినప్పుడు.. అతడు నవ్వుతూ ఇలా అన్నాడు. "మూడు నెలలు జుట్టు పెంచడం. వాళ్లు నాకు విగ్గు పెట్టాలనుకున్నారు. కానీ నేను నా సొంత జుట్టుతోనే చేస్తానని పట్టుబట్టాను" అని చెప్పాడు.
'కార్తికేయ 2' విజయంతో స్వయంభు
"కథ కాగితంపై అద్భుతంగా కనిపించింది. కానీ మాకు మంచి బడ్జెట్, గ్రాఫిక్స్ అవసరం. 2021లో 'కార్తికేయ 2' విజయం తరువాత మాకు అవసరమైన బడ్జెట్ లభించింది. మొత్తం బృందం అద్భుతమైన పని చేసింది" అని నిఖిల్ అన్నాడు.
ఫిబ్రవరి 13, 2026న విడుదల కానున్న 'స్వయంభు' తర్వాత నిఖిల్ చేతిలో ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. "నేను 'ది ఇండియా హౌస్' 50% షూటింగ్ పూర్తి చేశాను. అది నాకు పూర్తిగా భిన్నమైన జానర్. ఆ తర్వాత 'కార్తికేయ 3' ఉంది. కాబట్టి మంచి రోజులు ముందున్నాయని ఆశిస్తున్నాను" అని నటుడు అన్నాడు.
అయితే సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా తన కెరీర్లో బెస్ట్ ఇయర్స్ వృథా అవుతున్నాయేమోనని భయపడుతున్నట్లు నిఖిల్ నిజాయితీగా అంగీకరించాడు. "ఒకప్పుడు మేము ఆరు నెలల్లో సినిమాలను పూర్తి చేయగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు అది జరగడం లేదు. ఒక నటుడిగా నా యంగ్ ఏజ్ వృథా అవుతున్నాయేమోనని నేను భయపడుతున్నాను. కానీ మీరు అంత సమయాన్ని కేటాయించకపోతే ప్రేక్షకులు సినిమాలను చూడరు. నా ప్రయత్నాలు ఫలించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను" అని నిఖిల్ ముగించాడు.













