Bhoot Bangla: అక్షయ్ కుమార్ రియల్ భూత్ బంగ్లా.. అసలు రహస్యం ఇదే.. జైపూర్‌లోని ఆ రాజప్రసాదం కథేంటో తెలుసా? ఒక్క నైట్ కోసం

Bhoot Bangla: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘భూత్ బంగ్లా’. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో కనిపించిన భూత్ బంగ్లా నిజంగా ఎక్కడుందో తెలుసా? ఇందులో ఒక రాత్రి ఉండాలంటే ఎంత కట్టాలో ఇక్కడ చూసేయండి. 

Published on: Apr 18, 2026, 15:27:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhoot Bangla: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు వినోదాల విందు. వీరిద్దరి కలయికలో సుమారు 14 ఏళ్ల తర్వాత వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.

భూత్ బంగ్లా లోకేషన్ ఇదే (x)
భూత్ బంగ్లా లోకేషన్ ఇదే (x)

భూత్ బంగ్లా

భూత్ బంగ్లా సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన 'అర్జున్' అనే పాత్రకు తన పూర్వీకుల నుంచి మంగళపూర్‌లోని 'ఆచార్య నివాస్' అనే భారీ బంగ్లా వారసత్వంగా వస్తుంది. తన సోదరి పెళ్లి కోసం అక్కడికి వెళ్లిన అర్జున్ కుటుంబానికి ఆ ఇంట్లో ఉండే ఒక దుష్టశక్తి వల్ల ఎదురైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్థానికులు దీనిని 'భూత్ బంగ్లా' (దెయ్యాల కోట) అని పిలుస్తుంటారు.

నిజంగానే దెయ్యాల కోటనా?

భూత్ బంగ్లా సినిమాలో చూపిస్తున్నట్లుగా అది నిజంగానే దెయ్యాల కోట అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ 'చోము ప్యాలెస్' (Chomu Palace) లో జరిగింది. ఈ సినిమాలో కనిపించే భూత్ బంగ్లా ఇదే.

ఆ సినిమాలోనూ

విశేషమేమిటంటే, గతంలో అక్షయ్, ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'భూల్ భులైయా' (2007) చిత్రాన్ని కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఈ బంగ్లా సుమారు 350 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన కట్టడం. ప్రస్తుతం ఇది ఒక వారసత్వ హోటల్‌గా (Heritage Hotel) కొనసాగుతోంది.

350 ఏళ్ల చరిత్ర

చోము ప్యాలెస్ కేవలం ఒక భవనం కాదు, అది ఒక చారిత్రక కళాఖండం. భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మితమైన ఈ కోటను మొదట్లో 'చోముగఢ్ కోట' అని పిలిచేవారు. ఇది సామోద్ సంస్థానానికి చెందినది.

1550వ సంవత్సరంలో జైపూర్ రాజు మొదటి పృథ్వీరాజ్ సింగ్జీ నాలుగో కుమారుడైన రావు గోపాల్‌జీ ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించేలా, సైన్యం బస చేసేలా 5 మీటర్ల మందపాటి రాతి గోడలతో దీనిని అత్యంత వ్యూహాత్మకంగా నిర్మించారు.

రాజసం ఉట్టిపడే వాస్తుశిల్పం

రాజ్‌పుత్, మొఘల్, యూరోపియన్ నిర్మాణ శైలుల కలయికతో ఈ ప్యాలెస్ ముగ్ధులని చేస్తుంది. ఇక్కడి గోడలపై ఉండే ఫ్రెస్కోలు, పురాణ గాథలు, రాజరికపు వేట దృశ్యాలను ప్రతిబింబించే చిత్రాలు నాటి వైభవాన్ని కళ్లకు కడతాయి.

అద్భుతమైన మార్బుల్ ఇన్‌లే వర్క్, రంగురంగుల రాళ్లతో చేసిన పూల డిజైన్లు, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా రాతిలో చెక్కిన జాలీ వర్క్ ఈ కట్టడానికి ప్రత్యేక ఆకర్షణలు.

100 రూమ్ లు

సినిమాలో దెయ్యాల కోటగా కనిపించినా, నిజజీవితంలో ఇది విలాసవంతమైన బసకు కేరాఫ్ అడ్రస్. 'దంగయాచ్ గ్రూప్' ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హోటల్‌లో 100కు పైగా సూట్ రూములు ఉన్నాయి.

రాజరికపు ఫర్నీచర్, మార్బుల్ రూమ్స్, విలాసవంతమైన బాత్ టబ్స్, స్విమ్మింగ్ పూల్, రుచికరమైన రాజస్థానీ వంటకాలతో పర్యాటకులను ఇది అలరిస్తుంది. రాయల్ వెడ్డింగ్స్ కోసం కూడా ఇది దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన వేదికల్లో ఒకటిగా మారింది.

ఖర్చు ఎంత?

చోము ప్యాలెస్‌లో ఒక రాత్రి బస చేయాలంటే రూ. 39,999 నుంచి రూ. 51,999 వరకు ఖర్చవుతుంది. ఒకవేళ ఇక్కడ రెండు రోజుల పాటు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించుకోవాలనుకుంటే సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది జైపూర్ నుంచి 45 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి 255 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 11పై ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More