32 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ మిస్టరీ.. దెయ్యమే చంపిందా.. హారర్ లవర్స్ ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీకోసమే.. రియల్ స్టోరీ
ఓటీటీలోకి తాజాగా వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మంచి థ్రిల్ పంచుతోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. గౌరవ్ తివారీ అనే ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కథ. 32 ఏళ్లకే కన్నుమూసిన అతన్ని దెయ్యాలే చంపాయా అన్నదే అసలు మిస్టరీ.
హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడే వారి కోసం తాజాగా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓ సిరీస్ తీసుకొచ్చింది. దీనిపేరు భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐఎండీబీలో 8.8 రేటింగ్ సాధించింది. 2016లో చనిపోయిన గౌరవ్ తివారీ అనే పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ జీవితం చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఎలా ఉందో తెలుసుకోండి.

భయ్: ది గౌరవ తివారీ మిస్టరీ కథ ఇదీ
గౌరవ్ తివారీ.. మన దగ్గర చాలా కొద్ది మందికే తెలిసిన వ్యక్తి. బీహార్ లోని పాట్నాలో 1984లో జన్మించిన ఈ వ్యక్తి.. పైలట్ జాబ్ వదిలి తనకు ఎంతగానో ఇష్టమైన దెయ్యాల వేట సాగించాడు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఎన్నో అలాంటి కేసులను పరిష్కరించాడు. అతని జీవితం ఆధారంగా తెరకెక్కిందే ఈ భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్.
దీనిని అభిరూప్ ధర్ రాసిన ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ: ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఇండియాస్ ఫోర్‌మోస్ట్ పారానార్మల్ ఇన్టెస్విగేటర్ అనే బుక్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. ఇందులో కరణ్ టాకర్, కల్కి కొచ్లిన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.
గౌరవ్ తివారీ అసలు ఎందుకు తన పైలట్ జాబ్ వదిలిపెట్టాడు? అసలు ఈ పారానార్మల్ యాక్టివిటీస్ మీద అతనికి ఎందుకు ఆసక్తి కలిగింది? మెటాఫిజికల్ చర్చ్ ఆఫ్ హ్యూమనిస్టిక్ సైన్స్ లో అతడు నేర్చుకున్నది ఏంటి? తన జీవితంలో అతడు పరిష్కరించిన ఘోస్ట్ హంటింగ్ కేసులు ఏవి అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. అంతేకాదు 32 ఏళ్ల వయసులోనే 2016లో అతడు ఎలా మరణించాడన్నది కూడా ఈ సిరీస్ లో చూపించారు.
ఈ కథ 2006లో మొదలవుతుంది. గౌరవ్ సరదాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ హౌస్ పార్టీలో ఆ హౌస్ ఓనర్, చనిపోయిన బగ్గీ నాన్నమ్మను పిలుద్దామని అనుకుంటాడు. అందరూ కలిసి ఆత్మను పిలవగా.. అది గౌరవ్ రూపంలో వచ్చి మాట్లాడి వెళ్లిపోతుంది. మొదట దీనిని గౌరవ్ లైట్ తీసుకున్నా.. తర్వాత బగ్గీ చెప్పిన విషయాలతో ఆ ఆత్మను తనను ఎంచుకుందన్న అంతర్మథనం అతనిలో మొదలవుతుంది. అక్కడ మొదలయ్యే స్టోరీ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఆ తర్వాత అతడు పరిష్కరించే ఎన్నో కేసుల చుట్టూ తిరుగుతుంది.
భయ్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
గౌరవ్ తివారీ ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కావడంతో అతని మరణం కూడా అప్పట్లో చాలా మందిలో అనుమానాలు రేకెత్తించింది. అతన్ని హత్య చేశారని, అది కూడా దెయ్యాలే కావచ్చనీ అనుకున్నారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ పోలీసులు అతనిది ఆత్మహత్యగా తేల్చినా.. అతని మరణం చుట్టూ మిస్టరీ మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. సరిగ్గా ఈ పాయింట్ నే బేస్ చేసుకొని ఈ భయ్ వెబ్ సిరీస్ తెరకెక్కించారు.
ఇందులోని హరర్ ఎలిమెంట్స్ మంచి థ్రిల్ పంచేలా సాగాయి. కథలో ముందుకు, వెనక్కి తీసుకెళ్తూ అసలు గౌరవ్ తివారీ ఎలా చనిపోయాడు? ఏం జరిగిందన్న ఆసక్తిని చివరి ఎపిసోడ్ వరకూ కొనసాగేలా చేయడంలో డైరెక్టర్ రాబీ గ్రేవాల్ సక్సెస్ అయ్యాడు. ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా తన జీవితంలో గౌరవ్ తివారీ ప్రతి రోజూ ఎలాంటి భయానక అనుభవాలను ఎదుర్కొన్నాడన్నది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.
మొత్తం 8 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ సీట్లకు అతుక్కుపోయి బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది. రాబీ గ్రేవాల్ డైరెక్షన్, అర్షయ్ సయ్యద్ స్క్రీన్ ప్లే, లీడ్ రోల్స్ అయిన కరణ్ టాకర్, కల్కి కొచ్లిన్ నటన అద్భుతమని చెప్పొచ్చు. ఓ మంచి పారానార్మల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూడొచ్చు.














