బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే టీఆర్పీ రికార్డుల మోత.. గత 5 ఏళ్లలో ఇదే టాప్.. నాగార్జున ట్వీట్ వైరల్
బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డుల మోత మోగించింది. గత ఐదేళ్లలో ఇంత రేటింగ్ ఎప్పుడూ రాలేదంటూ అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అటు జియోహాట్‌స్టార్ లోనూ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు నమోదైంది.
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' (Bigg Boss Telugu 9) గ్రాండ్ ఫినాలే బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సీజన్ ఫినాలే రేటింగ్స్ చూసి నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది "అన్‌బీటబుల్" అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ఏకంగా 19కిపైగా రేటింగ్ నమోదు కావడం విశేషం.

రికార్డు బ్రేకింగ్ టీఆర్పీ
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసినా దాని క్రేజ్ ఇంకా తగ్గలేదు. తాజాగా వచ్చిన రేటింగ్స్ చూస్తుంటే ఈ షో ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో అర్థమవుతోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
నాగార్జున షేర్ చేసిన లెక్కల ప్రకారం.. స్టార్ మా ఛానెల్‌లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ వచ్చింది. ఇక డిజిటల్ వ్యూస్ విషయానికి వస్తే.. జియోహాట్‌స్టార్ ఓటీటీలో 285 మిలియన్ నిమిషాల వాచ్ టైమ్ నమోదైంది. గత 5 ఏళ్లలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్లన్నింటిలోకెల్లా ఇదే 'బిగ్గెస్ట్ ఫినాలే'గా నిలిచింది.
నాగ్ ఎమోషనల్ ట్వీట్
"అన్‌బీటబుల్.. అన్‌రీచబుల్.. ఎమోషన్స్, ప్యాషన్, గొడవలతో సాగిన ఈ సీజన్ నిజంగా చరిత్రాత్మకం. ఇంతటి విజయాన్ని అందించిన కోట్లాది మంది ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు, స్టార్ మా, ఎండెమోల్ షైన్ టీమ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని నాగార్జున పేర్కొన్నాడు.
బిగ్ బాస్ 9 ఫినాలే ఇలా..
బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21న జరిగిన విషయం తెలిసిందే. 15 వారాలపాటు ప్రేక్షకులను అలరించిన ఈ షో విజేతగా సామాన్య కంటెస్టెంట్, మాజీ సైనికుడు కల్యాణ్ పడాల నిలిచాడు. ఆరంభంలో అంచనాలు లేకపోయినా, తనదైన శైలిలో ఆడుతూ 'మొదటి ఫైనలిస్ట్'గా రికార్డు సృష్టించిన కల్యాణ్ చివరికి టైటిల్ ఎగరేసుకుపోయి 'జై జవాన్' అనిపించుకున్నాడు. రన్నరప్‌గా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిచింది.
టాప్-3 కంటెస్టెంట్లుగా కల్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్ మిగిలిన సమయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ హౌస్‌లోకి అడుగుపెట్టి రూ. 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ ప్రకటించాడు. చాలా సేపు ఆలోచించిన తర్వాత డిమాన్ పవన్ ఆ మొత్తాన్ని తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు.
దీనివల్ల విజేతకు దక్కాల్సిన రూ. 50 లక్షల ప్రైజ్ మనీ నుంచి 15 లక్షలు పోగా రూ. 35 లక్షలు మిగిలాయి. అంటే టైటిల్ విజేతకు ప్రైజ్ మనీగా రూ. 35 లక్షలు మాత్రమే వచ్చాయన్నమాట.
విజేతగా నిలిచిన కల్యాణ్ పడాలకు హోస్ట్ నాగార్జున ట్రోఫీతో పాటు భారీ బహుమతులను అందజేశారు. రూ. 35 లక్షలు, మారుతి సుజుకి వెక్టోరిస్ కారు, రాఫ్ టైల్స్ వారి నుంచి మరో రూ. 5 లక్షల నగదు ఇచ్చాడు.














