Biker Review: ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ సినిమా- శర్వానంద్ బైకర్ మూవీ ఎలా ఉంది? బైక్ రేసింగ్ స్టోరీ వర్కౌట్ అయిందా?
Biker Review: ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ అంటూ బైకర్ ప్రచారాన్ని అదరగొట్టారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తెగ కష్టపడ్డాడు. మరి ఈ రోజు థియేటర్లకు వచ్చిన బైకర్ చిత్రం ఎలా ఉంది? శర్వానంద్ కు మరో హిట్ దక్కిందా? అన్నది రివ్యూలో చూసేయండి.
సినిమా : బైకర్

నటీనటులు : శర్వానంద్, మాళవిక నాయర్, రాజశేఖర్, అతుల్ కులకర్ణి తదితరులు
రైటర్, డైరెక్టర్ : అభిలాష్ రెడ్డి
మ్యూజిక్ : జిబ్రాన్
ప్రొడ్యూసర్లు : వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 3, 2026
టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. 2026 సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ అంటూ బైకర్ తో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈ రోజు (ఏప్రిల్ 3) రిలీజైన బైకర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేయండి.
బైకర్ స్టోరీ
వికాస్ నారాయణన్ అలియాస్ విక్కీ (శర్వానంద్) ఇండియాలోనే టాప్ రేసర్. తండ్రి సునీల్ నారాయణన్ (రాజశేఖర్) శిక్షణలో విక్కీ రేసింగ్ పై పట్టు సాధిస్తాడు. ఒకప్పుడు రేసింగ్ లో అదరగొట్టిన సునీల్ నారాయణన్ తన కొడుకును ప్రపంచ ఛాంపియన్ గా చూడాలనుకుంటాడు.
ఇండియాలో క్రికెట్ లాగే రేసింగ్ కు కూడా క్రేజ్ రావాలని సునీల్ కోరుకుంటాడు. తండ్రి దగ్గర ట్రైనింగ్ పొందిన విక్కీ రేస్ ట్రాక్ పై బైక్ ను పరుగులు పెట్టిస్తాడు. కానీ సడెన్ గా రేసింగ్ ను వదిలేసి వెళ్లిపోతాడు. సునీల్ కు అవమానం ఎదురవుతుంది.
కట్ చేస్తే తన భార్య అనన్య (మాళవిక నాయర్), ఓ కొడుకుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు విక్కీ. ఓ గో కార్టింగ్ రేస్ ట్రాక్ నడుపుతుంటాడు. అయితే తన తండ్రికి జరిగిన అవమానం గురించి తెలిసి విక్కీ మళ్లీ రేసింగ్ స్టార్ట్ చేస్తాడు. అసలు విక్కీ రేసింగ్ ను ఎందుకు వదిలేశాడు? మళ్లీ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఇందులో అనన్యతో లవ్ స్టోరీ ఏంటీ? అన్నది తెలియాలంటే ‘బైకర్’ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ
ఇండియాలోని మొదటి మోటోక్రాస్ మూవీగా బైకర్ థియేటర్లలో రిలీజైంది. మేకర్స్ చెప్పినట్లు బైక్ రేసింగ్ గురించి ఇంత డీటెయిల్ గా చూపించిన సినిమా ఇంకోటి ఇండియాలో రాలేదు. తండ్రీ కొడుకుల అనుబంధం, వాళ్ల మధ్య ఎమోషన్, మరోవైపు బైక్ రేసింగ్ తో బైకర్ మూవీ సాగిపోతుంది. బైక్ రేసింగ్ నేపథ్యంలో వచ్చే సీన్లు హైలైట్ గా నిలిచాయి. తెలుగులో గతంలో కబడ్డీ, క్రికెట్, బాక్సింగ్ తదితర స్పోర్ట్స్ డ్రామా మూవీస్ వచ్చాయి.
కానీ ఫస్ట్ టైమ్ బైక్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన బైకర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. రేసింగ్ సీక్వెన్స్ అయితే అదిరిపోయాయి. అందుకు తగ్గట్లుగా శర్వానంద్ తీసుకున్న ట్రైనింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. మధ్యలో లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్ ను బాగానే చూపించారు. కానీ డెప్త్ కాస్త తగ్గిందని చెప్పొచ్చు.
స్పోర్ట్స్ డ్రామా మూవీస్ లో ఎప్పుడూ ఎమోషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో కూడా రాజశేఖర్, శర్వానంద్ మధ్య ఇలాంటి సీన్లను మరింత హైలైట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఆ ఎమోషనల్ డెప్త్ మిస్ అయిందని చెప్పొచ్చు. అదొక్కటి ఫుల్ ప్లెడ్జ్ గా పెట్టి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది.
ప్లస్ పాయింట్స్
- బైకర్ సినిమాకు శర్వానంద్ అతిపెద్ద ప్లస్ పాయింట్. బైకర్ గా కనిపించడం కోసం అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. సినిమా కోసం ఏకంగా 20 కిలోలకు పైగా బరువు తగ్గిన అతను ఓ ప్రొఫెషనల్ రేసర్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలోనూ తన స్టైల్లో అదరగొట్టాడు.
- బైకర్ మూవీ గురించి మాట్లాడితే రాజశేఖర్ గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఈ సీనియర్ హీరో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తండ్రీకొడుకులుగా రాజశేఖర్, శర్వానంద్ యాక్టింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది.
- బైక్ రేసింగ్ నేపథ్యం తీసుకోవడం కూడా కలిసొచ్చేదే. కొన్ని రేసింగ్ సీన్లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి.
- జిబ్రాన్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. ముఖ్యంగా రేసింగ్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. రేసింగ్ సీక్వెన్స్ లను సినిమాటోగ్రాఫర్ యువరాజ్ చక్కగా చూపించాడు. ప్రొడక్షన్ విలువలు రిచ్ గా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్
- బైకర్ మూవీలో కథనం ఊహకు తగ్గట్లే సాగడం ఓ మైనస్ పాయింట్. ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది.
- తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్ ఇంకా బలంగా ఉంటే బాగుండేది. రేసింగ్ సీన్లపై పూర్తిగా ఫోకస్ పెట్టిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, ఈ భావోద్వేగాలపై మరింత కసరత్తు చేయాల్సింది.
ఫైనల్ గా
బైకర్ సినిమా థియేటర్లలో ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుంది. బైక్ రేసింగ్ సీక్వెన్స్ లు మంచి కిక్ ఇస్తాడు. స్పోర్ట్స్ డ్రామాలను ఎంజాయ్ చేసే వాళ్లకు, శర్వానంద్ ఫ్యాన్స్ కు, తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని కోరుకునేవాళ్లకు ఈ మూవీ మంచి ఆప్షన్.
రేటింగ్: 3.25/5
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


