ఆరేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్- వీధి కుక్కల గురించి మాత్రం చర్చలు జరుపుతామంటూ హీరోయిన్ భూమి పెడ్నేకర్ రియాక్షన్

ఢిల్లీలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమాజం విఫలమవుతోందని, నేరస్థుల్లో చట్టం అంటే భయం లేకుండా పోతోందని భూమి పెడ్నేకర్ ఆవేదన చెందారు. ఇప్పుడు భూమి పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Published on: Jan 29, 2026, 09:02:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక అమానవీయ ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఆరేళ్ల వయసున్న ఒక పసి ప్రాణంపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఈ దారుణ ఉదంతంపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు.

ఆరేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్- వీధి కుక్కల గురించి మాత్రం చర్చలు జరుపుతామంటూ హీరోయిన్ భూమి పెడ్నేకర్ రియాక్షన్
ఆరేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్- వీధి కుక్కల గురించి మాత్రం చర్చలు జరుపుతామంటూ హీరోయిన్ భూమి పెడ్నేకర్ రియాక్షన్

మన సమాజం ఎటు వెళ్తోంది?

బుధవారం (జనవరి 28) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఘటనకు సంబంధించిన వార్తను షేర్ చేస్తూ భూమి పెడ్నేకర్ తన ఆవేదనను వెళ్లగక్కారు. "అసలు ఏం జరుగుతోంది? లైంగిక వేధింపులకు పాల్పడినా సులభంగా తప్పించుకోవచ్చని భావిస్తున్న ఇలాంటి రాక్షసుల్లో భయాన్ని కలిగించలేకపోతున్నామంటే.. మనం కచ్చితంగా విఫలమైనట్టే" అని భూమి ఘాటుగా విమర్శించారు. నేరస్థుల్లో చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు పునరావృతమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

వీధి కుక్కల కంటే క్రూరంగా..

దేశంలో వీధి కుక్కల వల్ల ముప్పు పొంచి ఉందంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతామని, వాటిని హింసిస్తామని.. కానీ అంతకంటే ఘోరమైన వాస్తవాలను మాత్రం పట్టించుకోమని, వీధి కుక్కల కంటే క్రూరంగా ప్రవర్తించే వారి గురించి మాట్లాడమని భూమి ఎత్తి చూపారు.

"మన దేశంలో మూగజీవాలను శిక్షించడానికి చూపిస్తున్న ఆసక్తి, ఆరేళ్ల చిన్నారికి రక్షణ కల్పించడంలో చూపించలేకపోతున్నాం. మైనర్ బాలురు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారంటే.. వారు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారో ఆలోచించండి. 'వేక్ అప్ ఇండియా'.. మన వీధుల్లో మన పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది" అంటూ భూమి పెడ్నేకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగింది?

ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో జనవరి 18న ఈ దారుణం చోటుచేసుకుంది. చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 7 గంటల సమయంలో తండ్రి ఆమెకు చాక్లెట్ కొనిపించి గల్లీ చివరిలో వదిలి వెళ్లారు. అప్పుడే ముగ్గురు బాలురు (వయసు 10, 13, 14 ఏళ్లు) బాలికకు చౌమిన్ తినిపిస్తామని ఆశ చూపి, సమీపంలోని ఒక ఖాళీ భవనంలోకి తీసుకెళ్లారు.

అక్కడ చిన్నారి నోట్లో బట్టలు కుక్కి, చేతులు కట్టేసి సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. రక్తపు మడుగులో ఇంటికి వచ్చిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో బాలుడు తన కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు.

Bhumi's Insta Story.
Bhumi's Insta Story.

భూమి పోస్ట్ వైరల్

డీసీపీ ఆశిష్ మిశ్రా ఈ కేసుపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని ధృవీకరించారు. మరోవైపు భూమి పెడ్నేకర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు, బాలికల భద్రతపై మరోసారి గళం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More