బోర్డర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మీ గుండె గర్వంతో ఉప్పొంగుతుందంటూ.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డైలాగులు
సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘బోర్డర్ 2’ మూవీ ఈరోజు (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు 4.5 రేటింగ్ ఇస్తూ అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. సన్నీ డియోల్ నటన, యుద్ధ సన్నివేశాలు, సంగీతం, డైలాగులు సినిమాకు ప్రధాన బలం అని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీగా నిలిచిన ‘బోర్డర్’కు సీక్వెల్‌గా వచ్చిన ‘బోర్డర్ 2’ (Border 2) ఈరోజు (జనవరి 23) థియేటర్లలో విడుదలైంది. రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో పేర్కొన్నారు. గురువారం (జనవరి 22) అర్ధరాత్రి దాటాక ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

బోర్డర్ 2 ఫస్ట్ రివ్యూ.. 4.5 రేటింగ్
తరణ్ ఆదర్శ్ ఈ బోర్డర్ 2 సినిమాకు 4.5 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. "బోర్డర్ 2 మనసును గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది. దేశానికి, సైన్యానికి ఈ సినిమా ఒక సెల్యూట్. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా" అని ఆయన రాసుకొచ్చారు.
దర్శకుడు అనురాగ్ సింగ్ ఒక అద్భుతమైన, భావోద్వేగభరితమైన యుద్ధ ఇతిహాసాన్ని అందించారని ప్రశంసించారు. 1971 యుద్ధ స్ఫూర్తికి కట్టుబడి, పాత 'బోర్డర్' సినిమా లెగసీని గౌరవిస్తూనే.. భారీ స్థాయిలో ఎంతో నిజాయితీతో ఈ సినిమాను తెరకెక్కించారని కొనియాడారు.
యుద్ధ సన్నివేశాలు ఊపిరి బిగబట్టేలా ఉన్నాయని, కేవలం యాక్షన్ కోసమే కాకుండా కథకు, పాత్రల భావోద్వేగాలకు అనుగుణంగా అవి సాగాయని తెలిపారు. దర్శకుడు విజువల్స్, సెంటిమెంట్‌ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేశారన్నారు.
డైలాగ్స్, మ్యూజిక్ హైలైట్..
సినిమాలోని డైలాగులు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయని అన్నారు. ఇవి చాలా షార్ప్ గా, శక్తివంతంగా ఉన్నాయని, దేశభక్తిని ప్రేరేపించేలా ఉన్నాయని తరణ్ పేర్కొన్నారు. విజిల్స్ వేయించే పంచ్ డైలాగులు థియేటర్లలో మారుమోగుతాయని చెప్పారు.
మ్యూజిక్ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా మొదటి పార్ట్‌లోని ‘ఘర్ కబ్ ఆవోగే’, ‘జాతే హుయే లమ్హో’ పాటలను రీక్రియేట్ చేసిన విధానం మనసును హత్తుకుంటుందని తెలిపారు.
నటీనటుల గురించి..
"సినిమాకు ఆత్మ సన్నీ డియోల్. ఆయన గర్జిస్తుంటే థియేటర్ దద్దరిల్లుతుంది. వింటేజ్ సన్నీని మళ్లీ చూస్తాం. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ మర్చిపోలేం" అని ఆకాశానికెత్తేశారు.
వరుణ్ ధావన్ తన నటనతో సర్ ప్రైజ్ చేశారని, పాత్రలోని తీవ్రతను, నిస్సహాయతను అద్భుతంగా పండించారని మెచ్చుకున్నారు. ఇక దిల్జీత్ దోసాంజ్ ప్రతి సీన్‌లోనూ ఆకట్టుకున్నారని, అహాన్ శెట్టి సీనియర్ల సరసన దీటుగా నటించారని కితాబిచ్చారు. మొత్తానికి జేపీ దత్తా పాత క్లాసిక్ మ్యాజిక్‌ను ‘బోర్డర్ 2’ రిపీట్ చేస్తుందని ఈ రివ్యూ స్పష్టం చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


