నాన్న ఎప్పుడూ నాతోనే ఉంటారు.. తండ్రిని తలుచుకుని సన్నీ డియోల్ ఎమోషనల్.. నేడు ధర్మేంద్ర జయంతి
సోమవారం ధర్మేంద్ర 90వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని సన్నీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో పంచుకున్నారు. నాన్న ఎప్పుడూ నాతోనే ఉంటారని పేర్కొన్నాడు సన్నీ.
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. సోమవారం (డిసెంబర్ 8) తన తండ్రి ధర్మేంద్ర జయంతి. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని సన్నీ డియోల్ భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర నవంబర్ 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు ఇది.

సన్నీ స్పెషల్ వీడియో
డిసెంబర్ నెలలో ఈ పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర మరణించారు. 'హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్'గా పేరొందిన ధర్మేంద్రతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సన్నీ డియోల్ ప్రకృతిని ఆస్వాదిస్తున్న వీడియోను సోమవారం పంచుకున్నారు. ఆ వీడియోతో పాటు భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను కూడా రాశారు. ధర్మేంద్ర గురించి సన్నీ డియోల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి.
ఎప్పుడూ నాతోనే
సన్నీ డియోల్, ధర్మేంద్ర ఉన్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో తండ్రీకొడుకులు తెలియని ప్రదేశంలో పర్వత దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు. సన్నీ డియోల్, ధర్మేంద్రను "డాడీ, ఎంజాయ్ చేస్తున్నారా?" అని అడగడం వినిపిస్తుంది. దానికి స్పందిస్తూ "నేను నిజంగా నా కొడుకుతో ఎంజాయ్ చేస్తున్నా. ఇది చాలా బాగుంది" అని ధర్మేంద్ర బదులిచ్చారు. "చాలా అందంగా ఉంది" అని సన్నీ డియోల్ అన్నారు. "ఈ రోజు నాన్న పుట్టినరోజు. నాన్న ఎప్పుడూ నాతోనే ఉంటారు, నాలోపలే ఉంటారు. ఐ లవ్ యూ నాన్న. మిస్ యూ" అని 'గదర్' హీరో సన్నీ డియోల్ క్యాప్షన్‌లో రాశారు.
ఈషా డియోల్ కూడా
ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ కూడా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేసింది. ఈషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో.. "నా ప్రియమైన నాన్నకు.. మన బంధం, అత్యంత బలమైన అనుబంధం. జీవితాంతం, అన్ని లోకాలలో.. మనం ఎప్పుడూ కలిసి ఉంటాం నాన్న. స్వర్గంలో అయినా, భూమిపై అయినా. మనం ఒకటే" అని రాశారు.
“ఇప్పుడు నేను నిన్ను నా హృదయంలో చాలా సున్నితంగా, జాగ్రత్తగా, విలువైనదిగా దాచుకున్నాను. ఈ జీవితకాలం నా తోడుగా ఉంటావు. నీతో గడిపిన అద్భుతమైన జ్ఞాపకాలు, జీవిత పాఠాలు, నీవు నేర్పిన విద్య, మార్గదర్శకత్వం, నీ వెచ్చదనం, షరతులు లేని ప్రేమ, నీవు నాకు కుమార్తెగా ఇచ్చిన గౌరవం, ధైర్యం.. ఇవేవీ మరెవరితోనూ పోల్చలేను” అని లేఖలో పేర్కొని ఎమోషనల్ అయింది ఈషా.
అరుదైన ఫొటో
అభిషేక్ డియోల్.. ధర్మేంద్రతో తన బాల్యదశ నుండి ఒక అరుదైన ఫోటోను పంచుకున్నారు. కొన్ని జీవిత పాఠాల గురించి కూడా తన అనుభవాలను పంచుకున్నారు. అతను ఆన్‌లైన్‌లో "అది 1985 లేదా 86 అయి ఉండాలి. నన్ను తిట్టడంతో నేను నిరాశగా ఉన్నాను. ఆయన నన్ను తన దగ్గరకు పిలిచి, పక్కన కూర్చోబెట్టుకుని 'వెలుగును చూడు' అని చెప్పి, ఫోటోగ్రాఫర్‌తో ఈ చిత్రాన్ని క్లిక్ చేయించారు.
నా సమయం వచ్చినప్పుడు, ఆయన ఆ మాటలను మళ్ళీ నాకు చెప్పే క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ రోజు ఆయన పుట్టినరోజు" అని పంచుకున్నారు. ధర్మేంద్ర భార్య, నటి హేమ మాలిని కూడా తన జ్ఞాపకాల దొంతరలోకి వెళ్లి, సోషల్ మీడియాలో భర్త మరణం వల్ల కలిగిన బాధ గురించి మాట్లాడారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


