బోర్డర్ 2 ట్రైలర్ వచ్చేసింది.. యుద్ధానికి సిద్ధమైన ఇండియన్ ఆర్మీ
బోర్డర్ 2 ట్రైలర్ వచ్చేసింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి లాంటి వాళ్లు నటించిన ఈ మూవీ 28 ఏళ్ల కిందట వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్. జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.
దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సినిమా ‘బోర్డర్’. దశాబ్దాల తర్వాత దానికి సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ (Border 2) రాబోతోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవైటెడ్ వార్ డ్రామా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ ట్రైలర్.. ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలిస్తోంది.

మాట తప్పం.. సరిహద్దు దాటనివ్వం!
1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో బోర్డర్ 2 మూవీ కథ సాగుతుంది. ట్రైలర్ సన్నీ డియోల్ పవర్ ఫుల్ స్పీచ్‌తో మొదలవుతుంది. "మనకు సరిహద్దు అంటే నేల మీద గీసిన గీత కాదు.. అది మన దేశ ప్రజలకు మనం ఇచ్చిన మాట. శత్రువును ఆ గీత దాటనివ్వం అని చేసిన ప్రమాణం" అంటూ సన్నీ చెప్పే డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. "ఈ రోజు ఏం జరిగినా సరే.. ఆ మాటను మనం తప్పకూడదు" అని అతడు తన సైన్యానికి దిశానిర్దేశం చేయడం ఆకట్టుకుంది.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. ఇలా మూడు దళాల వీరత్వాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. యుద్ధ సన్నివేశాలతో పాటు, సైనికుల వ్యక్తిగత జీవితాలు, వారి కుటుంబాల భావోద్వేగాలను కూడా ఇందులో హృద్యంగా చూపించారు.
రిపబ్లిక్ డే కానుకగా..
గుల్షన్ కుమార్, టీ-సిరీస్, జే.పీ. దత్తా ఫిల్మ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, జే.పీ. దత్తా, నిధి దత్తా నిర్మించారు. ఈ చిత్రంలో సోనమ్ బజ్వా, మోనా సింగ్, మేధా రాణా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గణతంత్ర దినోత్సవ వారాంతాన్ని పురస్కరించుకొని జనవరి 23న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
నాన్న ప్రేరణతోనే ‘బోర్డర్’ చేశా: సన్నీ డియోల్
ఇటీవల జైసల్మేర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో సన్నీ డియోల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నేను చిన్నప్పుడు మా నాన్న (ధర్మేంద్ర) నటించిన ‘హకీకత్’ సినిమా చూసి ఎంతో ఇష్టపడ్డాను. నటుడిగా మారాక అలాంటి సినిమానే చేయాలని నిర్ణయించుకున్నాను. అలా జే.పీ. దత్తాతో మాట్లాడి, లోంగేవాలా యుద్ధం నేపథ్యంలో ‘బోర్డర్’ చేశాం. అది మా అందరి గుండెలకు ఎంతో దగ్గరైన సినిమా" అని గుర్తు చేసుకున్నాడు.

E-Paper












