Brahmamudi July 11th Episode: బ్రహ్మముడి.. రాజుకు యాక్సిడెంట్.. లక్కీకి తెలియని నిజం.. దుగ్గిరాల ఇంట్లో నందు రాజ్యం

Brahmamudi Serial July 11th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 11 ఎపిసోడ్ మంచి ట్విస్టులతో సాగిపోయింది. తన ఫ్రెండ్ లక్కీ ఆ రేఖ కొడుకునే అని రాజు తెలుసుకోవడం, ఆ నిజం ఒప్పుకోవాలని రేఖను డిమాండ్ చేయడం, దీంతో రాజుకు రేఖ యాక్సిడెంట్ చేయించడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.

Published on: Jul 11, 2026, 07:06:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో కథను పూర్తిగా మలుపు తిప్పే సీన్లు కనిపిస్తాయి. రాజు యాక్సిడెంట్ అతని జీవితాన్ని మలుపు తిప్పగా.. ఇటు లక్కీకి మాత్రం తాను రేఖ కొడుకునే అనే అసలు నిజం ఇంకా తెలియదు. రాజు దుగ్గిరాల వారసుడే అని తెలుసుకొని ఇందు షాక్ తింటుంది.

Brahmamudi July 11th Episode: బ్రహ్మముడి.. రాజుకు యాక్సిడెంట్.. లక్కీకి తెలియని నిజం.. దుగ్గిరాల ఇంట్లో నందు రాజ్యం
Brahmamudi July 11th Episode: బ్రహ్మముడి.. రాజుకు యాక్సిడెంట్.. లక్కీకి తెలియని నిజం.. దుగ్గిరాల ఇంట్లో నందు రాజ్యం

ఒక్కసారైనా తల్లిని చూడాలన్న లక్కీ

తన తల్లిని ఒక్కసారైనా చూస్తే తన జన్మ ధన్యమవుతుంది మామా అంటూ రాజుతో లక్కీ ఎమోషనల్ అయ్యే సీన్ తో సీరియల్ శనివారం (జులై 11) ఎపిసోడ్ మొదలైంది. లక్కీ బాగా తాగడంతో అతన్ని ఇంట్లో పడుకోబెడతాడు రాజు. కానీ తల్లి విషయంలో అతడు పడుతున్న బాధేంటో తెలుసుకుంటాడు. తన తల్లి ఎవరో ఆ ఆంటోనీగాడికి తెలుసు అని మత్తులోనే రాజుతో చెబుతాడు లక్కీ.

ఆంటోనీని ఫాలో అయిన రాజు.. రేఖను చూసి షాక్

అదే ఆలోచిస్తూ రాజు బయటకు రాగానే ఆంటోనీ కనిపిస్తాడు. అతడు బండి తీసుకొని ఎటో వెళ్తుండటంతో రాజు అతన్ని ఫాలో చేస్తాడు. ఇంత రాత్రి వేళ వీడు ఎక్కడికి వెళ్లాడు.. ఎవరిని కలుస్తున్నాడు అని రాజు అనుకుంటున్న సమయంలోనే కారులో నుంచి రేఖ దిగి ఆంటోనీని కలవడం చూసి రాజు షాక్ తింటాడు. ఈ సమయంలో రేఖ పిన్నీని వీడెందుకు కలుస్తున్నాడు అని రాజు అనుకుంటాడు.

రేఖ కొడుకు లక్కీనే అని తెలుసుకున్న రాజు

పదే పదే ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానని ఆంటోనీపై రేఖ మండిపడుతుంది. నీ కొడుకును నా చేతుల్లో పెట్టి వెళ్లిపోయావు.. హాయిగా పెళ్లి చేసుకున్నావు.. కానీ ఆ కొడుకు ఇప్పుడు చాలా పెద్ద వాడు అయ్యాడు.. మా అమ్మ ఎవరో చెప్పాలని తెగ విసిగిస్తున్నాడు.. నిజం చెప్పొద్దు అంటే ఓ రూ.50 లక్షలు ఇవ్వండి అని రేఖను ఆంటోనీ డిమాండ్ చేస్తాడు.

అది విని రాజు మరింత షాక్ తింటాడు. అంత డబ్బు ఇవ్వను అని రేఖ అనడంతో అయితే నువ్వే తన తల్లివి అనే విషయం ఆ లక్కీగాడికి చెబుతాను.. దానికోసం ఓ రూ.10 లక్షలు ఇవ్వమంటే తల తాకట్టు పెట్టయినా ఇస్తాడు అని ఆంటోని అనడం విని రాజుకి అసలు నిజం తెలిసిపోతుంది. వారంలోగా తన డబ్బు ఇవ్వాలని చెప్పి ఆంటోనీ వెళ్లిపోతాడు.

రేఖను నిలదీసిన రాజు.. తన ఫ్రెండే ఆ లక్కీ అంటూ..

అతడు వెళ్లిపోగానే రేఖ వెనుక నుంచి చప్పట్లు కొడుతూ రాజు వస్తాడు. అతన్ని చూసి రేఖ మైండ్ బ్లాక్ అవుతుంది. నీ పెళ్లికి ముందు ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు అని రాజు అంటాడు. ఆ ఆంటోనీగాడు చెబుతున్న లక్కీ మరెవరో కాదు నా ఫ్రెండ్ లక్కీయే అని రాజు చెబుతాడు.

ఆ మాట వినగానే రేఖకు చెమటలు పడతాయి. తన కొడుకు ఈ రాజు వెంటన తన ఇంటికి కూడా వచ్చిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఆ ఆంటోనీకి రూ.50 లక్షలు ఇవ్వడం దండగ.. దానికంటే మీరే ఇంట్లో వాళ్లకు అసలు విషయం చెప్పేయండి.. లేదంటే ఆ నిజం నేనే అందరికీ చెబుతాను అని రేఖను రాజు బెదిరించి వెళ్లిపోతాడు. ఆంటోనీకి తోడు ఈ రాజు కూడా తోడవడంతో రేఖ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

ఐశ్వర్య, భ్రమరాంబకు నందు వార్నింగ్..

ఇటు ఇంట్లో ఐశ్వర్య, భ్రమరాంబకు నందు గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఉదయాన్నే తమకు అది కావాలి, ఇది కావాలి అంటూ వాళ్లు ఇందుని ఇబ్బంది పెడుతుంటారు. అది విన్న నందు.. ఇందు అక్క ఆ పనులు చేయదు అని చెబుతుంది. మిమ్మల్ని కూర్చోబెట్టి పశువులను మేపినట్లు ఎందుకు మేపాలి.. మీ పనులు మీరు చేసుకోండి అని నందు స్పష్టం చేస్తుంది.

దీంతో నందుతో ఐషూ, భ్రమరాంబ గొడవకు దిగుతారు. రాత్రి ఏదో అన్నావు చేయి చూద్దాం అని ఐశ్వర్య సవాలు విసిరితే.. కచ్చితంగా కొడతాను అని నందు అంటుంది. అవసరమైతే నీపైనా చేయి చేసుకుంటానని భ్రమరాంబతోనూ అనడంతో ఆమె దిమ్మదిరిగిపోతుంది. ఇందు అక్క ఈ ఆస్తికి అధిపతి.. ఇంటికి వారసురాలు.. ఆమె ఏ పనీ చేయదు అని నందు స్పష్టం చేస్తుంది.

పట్టించుకోకుండా వెళ్లిపోయిన రేఖ

ఏం చేయాలో అర్థం కాక నీ సంగతి రేఖకు చెబుతా అని భ్రమరాంబ అంటుంది. అప్పుడే ఆమె కిందికి వస్తుండటంతో నందు గురించి ఐశ్వర్య, భ్రమరాంబ చెబుతుంటారు. కానీ రాజు ఇచ్చిన షాక్ లో ఉన్న రేఖ అవేవీ పట్టించుకోదు. లక్కీ గురించి, ఆ నిజం తెలిస్తే వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ మరో లోకంలో ఉంటుంది. ఈ నందు సంగతి చూడు అని వాళ్లు అంటున్నా.. ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. దీంతో నందు మరింత రెచ్చిపోయి వాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తుంది.

నీ తల్లి గురించి తెలిసిపోయిందని లక్కీకి చెప్పిన రాజు

మరోవైపు లక్కీని కలుస్తాడు రాజు. అతన్ని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. నీ తల్లి ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చింది అని అంటాడు. నా ఎమోషన్ తో ఆడుకోకు మామ.. నీకు ఏం కావాలన్నా ఇస్తాను కానీ.. ఈ విషయంలో జోకులొద్దు అని లక్కీ అంటాడు. కానీ రాజు మాత్రం నిజంగా నీకు నీ తల్లి ఎవరో ఈ రోజు తెలుస్తుందని రాజు చెబుతాడు. అయితే ఆ విషయం తాను చెప్పనని, నీకే తెలుస్తుందని రాజు వెళ్లిపోతాడు.

రాజుకు యాక్సిడెంట్.. ఇందుకి తెలిసిన నిజం

రాజుతో ప్రమాదం పొంచి ఉండటంతో అతన్ని లేపేయడానికి రేఖ ప్లాన్ చేస్తుంది. బైకుపై వెళ్తుండగా యాక్సిడెంట్ చేయిస్తుంది. అయితే రాజు తలకు గాయమై హాస్పిటల్లో చికిత్స పొందుతుంటాడు. అతన్ని చూడటానికి వచ్చిన ఇందుతో చలపతి అసలు నిజం చెప్పేస్తాడు. నీ మొగుడని తెలిస్తేనే రేఖ ఇలా చేసింది.. దుగ్గిరాల వారసుడని తెలిస్తే ఏం చేస్తుందో అని చలపతి అనడంతో ఇందు షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More