Brahmamudi July 9th Episode: బ్రహ్మముడి.. లక్కీ రేఖ కొడుకు అని తెలుసుకున్న రాజు.. రేఖను బ్లాక్‌మెయిల్.. సూపర్ ట్విస్ట్
Brahmamudi July 9th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 9 ఎపిసోడ్ లో మొత్తం కథను మలుపు తిప్పే మరో ట్విస్ట్ ఎదురైంది. తన ఫ్రెండ్ లక్కీ.. ఆ రేఖ కొడుకే అని తెలుసుకున్న రాజు.. ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తాడు.
Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో మరో ఊహకందని ట్విస్ట్ ఎదురైంది. ఓవైపు నందు ఎంట్రీతో ఉక్కిరిబిక్కిరి అయిన రేఖకు ఆంటోనీ, రాజు రూపంలో మరో దిమ్మదిరిగే షాక్ తగులుతుంది. ఇటు నందును చూసి ఇందు, అపర్ణ, సుభాష్ ఎంతో సంతోషిస్తారు. కానీ రాజును తిరిగి పిలవడానికి మాత్రం ఇందు అంగీకరించదు.

మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్ చూపించిన నందు
ఆస్తి పేపర్లపై ఇందు సంతకం పెట్టడానికి రెడీగా ఉండగా.. నందు ఎంట్రీ ఇచ్చే సీన్ తో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రారంభమైంది. చిన్నప్పటి విషయాలు కొన్ని చెప్పి తాను నందునే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. రేఖ, భ్రమరాంబ కలిసి పెట్టిన హింసను గుర్తు చేస్తుంది.
అయితే రేఖ వాటిని నమ్మదు. దీంతో నందు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తుంది. చిన్నప్పుడు తాను ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాత ఓ పోలీసాయన చేరదీసి పెంచాడని, చదివించాడని చెబుతుంది. అంతేకాదు అప్పుడు ఆ పోలీసే మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడని చెప్పి దానిని రేఖకు చూపించడంతో ఆమె షాక్ తింటుంది.
ఆస్తి పేపర్లను చించి రేఖకు వార్నింగ్ ఇచ్చిన నందు
వచ్చింది నందుయే అని ఇంట్లో వాళ్లందరికీ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఆస్తి పేపర్లపై ఎక్కడ సంతకం పెట్టాలి అంటూ వాటిని చేతుల్లోకి తీసుకుంటుంది. ఆమె నిజంగానే సంతకం పెడుతుందేమో అని భ్రమరాంబ, భూషణ్ ఆశగా ఎదురు చూస్తారు.
పెన్ను నేలకేసి కొట్టి పేపర్లు చించేసి గాల్లోకి విసిరేస్తుంది. తాను సంతకం పెట్టడం ఎప్పటికీ జరగదని తేల్చి చెబుతుంది. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్న అక్కకు తాను అండగా ఉంటానని స్పష్టం చేసి ఇందుని తీసుకొని లోనికి వెళ్తుంది.
నందును చూసి సుభాష్, అపర్ణ ఎమోషనల్
నందును చూసి అపర్ణ, సుభాష్ ఎమోషనల్ అవుతారు. చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తన కోసం ఎంతగా వెతికామో ఆమెకు చెబుతారు. పారిపోయావా, ఎవరైనా కిడ్నాప్ చేశారా.. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో తెలియక ఎంతలా కుమిలిపోయామో వివరిస్తారు.
అయినా మీ అక్క కిడ్నాప్ అయిన సమయంలోనే ఇంట్లోనే ఉన్న నువ్వు అసలు నిజం ఎందుకు చెప్పలేదని అపర్ణ నిలదీస్తుంది. అయితే అక్కకు ఈ నిజం ముందే తెలుసని నందు చెప్పడంతో వాళ్లు షాకవుతారు. టైమ్ వచ్చినప్పుడు చెబుదామనే ఈ నిజం దాచినట్లు వాళ్లు చెబుతారు.
రాజు చెబితేనే వచ్చానన్న నందు
అయినా ఈ ఆస్తి పత్రాలపై సంతకం సంగతి నేను నీకు చెప్పలేదు కదా.. మరి నువ్వు ఎలా వచ్చావని నందును అడుగుతుంది ఇందు. ఆ విషయం బావ చెప్పాడని అంటుంది. బావ ఎవరు అని అడిగితే నీ మొగుడు రాజు అని నందు అంటుంది. ఆ తర్వాత రాజు తనని పిలిచి ఏం చెప్పాడో వాళ్లకు వెల్లడిస్తుంది.
ఆ ఇంటికి నువ్వు కూడా వారసురాలివి.. అంటే ఇందు ఒక్కతే సంతకం పెడితే సరిపోదు.. నువ్వు కూడా సంతకం పెట్టాలి.. ఈ టైమ్ కు నువ్వు ఎంట్రీ ఇస్తేనే కరెక్ట్ అని నందుతో రాజు చెబుతాడు. అది విని అపర్ణ, సుభాష్, స్వాతి ఎంతో సంతోషిస్తారు.
రాజును తిరిగి ఇంటికి తీసుకురమ్మని ఇందుకి చెప్పిన అపర్ణ
రాజు ఈ ఇంట్లో లేకపోయినా, నువ్వు అవమానించి పంపించినా ఈ ఇంటి గురించే అతడు ఆలోచిస్తున్నాడని ఇందుతో అపర్ణ అంటుంది. మళ్లీ రాజుని ఈ ఇంటికి తీసుకురావాలని కోరుతుంది. అతడితో ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తోందని, ఒకవేళ ఈ ఇంటితో సంబంధం లేకపోయినా వారసుడిగా అన్నీ చూసుకుంటున్నాడని అంటుంది. పెళ్లి విషయం వాళ్ల అమ్మానాన్నలకు రాజు చెప్పి ఒప్పించగలడని కూడా అపర్ణ అంటుంది. అటు సుభాష్ కూడా అదే చెబుతాడు. బావకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలని అటు నందు, స్వాతి కూడా అడుగుతారు.
రాజును రమ్మనలేనని తేల్చి చెప్పిన ఇందు
కానీ ఇందు మాత్రం అందుకు అంగీకరించదు. ఎందుకు అని వాళ్లు ఆమెను నిలదీస్తారు. ఈ ఊబిలోకి రాజును తీసుకొచ్చే ఉద్దేశం తనకు లేదని, తాను, నందు అక్కా చెళ్లెళ్లం కాబట్టి తప్పదని, కానీ రాజుని అనవసరంగా ఈ వివాదంలోకి లాగొద్దని అనుకుంటున్నట్లు ఇందు స్పష్టం చేస్తుంది.
లక్కీ రేఖ కొడుకని తెలుసుకున్న రాజు
అయితే ఈ ఎపిసోడ్ చివర్లోనే అసలు ట్విస్ట్ ఎదురవుతుంది. రేఖను ఆంటోనీ కలుస్తాడు. తన తల్లి ఎవరు ఎవరు అని లక్కీ అడుగుతున్నాడని, అసలు నిజం అతనికి చెప్పకూడదు అంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కానీ ఇదంతా చాటుగా ఉండి వింటాడు రాజు.
ఆంటోనీ వెళ్లిపోయిన తర్వాత రేఖ దగ్గరికి వచ్చిన రాజు కూడా ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తాడు. లక్కీ నీ కొడుకే అని ఇంట్లో వాళ్లకు చెప్పాలని, గతంలో నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలని, లేదంటే తానే వచ్చి చెబుతానని బెదిరిస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


