Brahmamudi October 21 Episode: బ్రహ్మముడి.. రాజుకు ప్రాణగండం.. ఇందు మెడలో తాళి కడితేనే రక్షణ.. రేఖ పరువు తీసిన ఐశ్వర్య

Brahmamudi Serial October 21st Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 21 ఎపిసోడ్ లో రాజుకు ప్రాణగండం ఉందని తేలుతుంది. అయితే ఇందు మెడలో తాళి కట్టడమే అతనికి శ్రీరామరక్ష అని ఓ స్వామి చెప్పడంతో అపర్ణ వాళ్ల పెళ్లి కోసం పట్టుబడుతుంది.

Published on: Oct 21, 2026, 09:08:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ పరువు తీస్తుంది ఐశ్వర్య. ఏకు మేకైనట్లు ఐషూ తీరు రేఖకు అంతుబట్టదు. మరోవైపు రాజుకు ప్రాణగండం ఉందని, ఇందు మెడలో తాళి కడితేనే అతడు ప్రాణాలతో ఉంటాడని తెలుసుకున్న అపర్ణ.. వాళ్ల పెళ్లి కోసం పట్టుబడుతుంది.

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 21 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 21 ఎపిసోడ్

వెంకీని బుక్ చేయడానికి ఐశ్వర్య ప్లాన్

ఐశ్వర్య దొంగ బంగారం డీల్ చేసే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ మొదలైంది. ఇలాంటి వాటి కోసం తమ కంపెనీలో కొందరు బకరాలను ఏర్పాటు చేసుకుంటామంటూ డీల్ కోసం వచ్చిన వ్యక్తి.. ఐశ్వర్యకు వెంకీని చూపిస్తాడు. అతన్ని చూసి ఐషూ షాకవుతుంది.

అయితే అన్నతోపాటు తమ్ముడిపైనా ఒకేసారి పగ తీర్చుకునే అవకాశం తనకు దక్కిందని మురిసిపోతుంది. అన్న సుఖాలు వెతుక్కుంటూ వెళ్తే.. తమ్ముడు కష్టాలను వెతుక్కుంటూ వచ్చాడని మనసులో అనుకుంటుంది. డీల్ ఓకే అని చెబుతుంది.

ఐశ్వర్యకు టెండర్.. స్వీట్లు పంచిన ఇందు

ఇటు ఐశ్వర్య టెండర్ న్యూస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. నీకే టెండర్ వస్తుందిలే అని రేఖ అంటే.. అది తనకు తెలుసని, కానీ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు ఐషూ చెబుతుంది. ఇంతలో ఇందు ఎంతో సంతోషంతో స్వీట్లు పంచుతూ ఇంట్లోకి వస్తుంది.

టెండర్ ఐశ్వర్యకే వచ్చిందని చెబుతుంది. అది విని లక్కీ ఎంతో సంతోషిస్తాడు. ఐషూని ఎత్తుకొని గాల్లో తిప్పుతాడు. ఆమె అతన్ని తిడుతుంది. మీ ఓటమిని ఇలా కవర్ చేసుకుంటున్నారా అని ఇందుని ఐశ్వర్య, రేఖ, భ్రమరాంబ దెప్పిపొడుస్తారు. కాదు.. తన అక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానని ఇందు అంటుంది.

కంపెనీ పవర్స్ ఇస్తున్నట్లుగా సైన్ చేయాలన్న ఐశ్వర్య

అయితే ఐషూ మాత్రం తనకు కంపెనీ పవర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. నువ్వు చెప్పినట్లే టెండర్ దక్కించుకొని ఛాలెంజ్ లో గెలిచాను.. చెక్ పవర్, కంపెనీ పవర్స్ అన్నీ నాకు ఇస్తున్నట్లుగా సంతకం పెట్టు అని ఐషూ డిమాండ్ చేస్తుంది. దీంతో ఇందు ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిమెంట్ పై సంతకం చేస్తుంది. కానీ దుగ్గిరాల కుటుంబం పరువు పోయేలా చేస్తే మాత్రం బాగుండదని వార్నింగ్ ఇస్తుంది.

ఇందుకి శృతి ఫోన్.. టెండర్ ఎలా వచ్చిందో చెప్పి..

ఆ తర్వాత ఇందుకి శృతి ఫోన్ చేస్తుంది. ఐశ్వర్య కోటి తక్కువకే టెండర్ దాఖలు చేయడం వల్లే ఎప్పుడూ స్వరాజ్ గ్రూపుకు రావాల్సిన టెండర్ ఆమెకు వెళ్లిందని చెబుతుంది. ఇందులో ఏదో మతలబు ఉంది.. లాభం లేకుండా ఆ కాంట్రాక్ట్ చేయాలంటేనే రూ.5 కోట్లు అవసరం.. అలాంటిది రూ.4 కోట్లకే ఎలా వేస్తుంది.. ఆఫీసుకు కూడా ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు.. ఇప్పుడు మేలుకోకపోతే ప్రమాదం అని శృతి హెచ్చరిస్తుంది. దీంతో ఇందు షాకవుతుంది. ఈ విషయం తాను చూసుకుంటానని, ఎవరికీ చెప్పొద్దని ఇందు అంటుంది.

రాజు, లక్కీ మధ్య గొడవలు పెట్టాలని రేఖ ప్లాన్

మరోవైపు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుండగా.. లక్కీకి ఇష్టమైన పీతల కూర చేయలేదని పని మనిషిపై రేఖ మండిపడుతుంది. దొరకలేదని, రేపు చేస్తుంది లే అని అపర్ణ అంటే.. మీ మనవడు రాజుని ఒకలాగా.. తన కొడుకు లక్కీని మరోలా ఎందుకు చూస్తున్నారని రేఖ నిలదీస్తుంది. రాజు, లక్కీ మధ్య గొడవలు పెట్టడానికి ప్లాన్ చేసేలా మాట్లాడుతుంది. అటు ఐశ్వర్య కూడా రేఖకు సపోర్ట్ చేస్తుంది. స్టేటస్ చూసి మర్యాద ఇస్తున్నారా అని రేఖ అంటే.. అలా చేసేది మీరు అని రాజు అంటాడు.

నిజం చెప్పబోయిన అపర్ణ.. ఆపిన ఇందు.. రేఖలో అనుమానం

స్టేటస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా.. ఓ బస్తీవాడివి.. ఇందుని పెళ్లి చేసుకోకపోతే ఈ ఇంటి వాచ్ మన్ గా కూడా పనికి రావు అని ఐశ్వర్య అంటుంది. దీంతో అపర్ణ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నువ్వు రాజు కాలిగోటికి కూడా పనికి రావు.. అసలు వాడు ఎవడో తెలుసా అని అపర్ణ ఆవేశంలో నిజం చెప్పబోతుంది. ఇంతలో ఇందు వచ్చి వద్దని వారిస్తుంది. రాజుకి ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు అని రేఖ అంటే.. ఇప్పుడా విషయం వద్దు అని ఇందు అంటుంది.

టెండర్‌పై ఐశ్వర్యను నిలదీసిన ఇందు

ఆ తర్వాత టెండర్ పై ఐశ్వర్యను ఇందు నిలదీస్తుంది. అసలు ఆ టెండర్ ఎలా వచ్చిందని అడుగుతుంది. రూ.5 కోట్ల విలువైన పనిని రూ.4 కోట్లకే ఎలా చేస్తావ్ అని అంటుంది. అది బిజినెస్ సీక్రెట్.. అలాంటివి నీకు చెప్పను అని ఐషూ అంటుంది. ఎప్పుడూ స్వరాజ్ గ్రూపు వచ్చే టెండర్ నీకు వచ్చేసరికి ఇందు అలా అంటుందని భ్రమరాంబ అంటుంది.

లక్కీకి సపోర్ట్ చేసి గదిలోకి వచ్చి తిట్టిన ఐశ్వర్య

ఇక నుంచి నా బిజినెస్ లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఐశ్వర్య గట్టిగా చెబుతుంది. అంతేకాదు ఈ ఇంట్లో లక్కీని ఎవరూ తక్కువ చేయొద్దు.. రాజుకి మర్యాద ఇచ్చినట్లుగానే లక్కీకి కూడా ఇవ్వాలి.. అతడు రేఖ ఆంటీ కొడుకు.. నాకు భర్త అని ఐశ్వర్య అంటుంది. దీంతో లక్కీ ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి.

గదిలోకి వెళ్లి బెడ్ పై పూలు చల్లి ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంతలో ఐషూ వచ్చి అతన్ని తిడుతుంది. ఈ కడుపులో నీ వల్ల వచ్చిన బిడ్డను భరించడమే కష్టం.. ఇక నిన్ను భరించాలా.. అక్కడ వాళ్లతో ఏదో ఒక విధంగా గొడవ పడటమే నాకు కావాలి.. ఈసారి నువ్వు దొరికావు కాబట్టి గొడవ పడ్డాను అంతే అని చెప్పడంతో లక్కీ నిరాశగా వెళ్లిపోతాడు.

ఐషూ టెండర్ సీక్రెట్స్ రాబట్టే పనిలో ఇందు, రాజు

మరోవైపు ఐశ్వర్య టెండర్ గురించి ఇందులో ఆందోళన పడుతూ ఉంటుంది. అందుకే ఆమెకు బిజినెస్ పెట్టించొద్దని నేను చెప్పానని రాజు అంటాడు. అసలు అంత తక్కువకు ఆమె ఆ డీల్ ఎలా పూర్తి చేస్తుందో కనిపెట్టాలి.. ఇది కుటుంబ పరువుకు సంబంధించిన విషయం అని ఇందు అంటుంది. ఇక నుంచి అది తెలుసుకునే పనిలో ఉందాం.. డిటెక్టివ్ లుగా మారదాం అని రాజు చెబుతాడు. ఇందు సరే అంటుంది.

అటు ఐశ్వర్యను రేఖ మెచ్చుకుంటుంది. ఇక నుంచి స్వరాజ్ గ్రూపుకు వెళ్లాల్సిన టెండర్లన్నీ తనకే వస్తాయని ఐషూ అంటుంది. అంత తక్కువకు ఎలా కోట్ చేశావని రేఖ అడిగితే.. మీకు తెలియదా అని అడుగుతుంది. ఇందుని దివాళా తీసేలా చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది.

రేఖ కారు తీసుకెళ్లిన రాజు, ఇందు.. రేఖ పరువు తీసిన ఐశ్వర్య

మరోవైపు రేఖ తన కారును సిద్ధంగా ఉంచాలని డ్రైవర్ కు చెప్పి ఉంచుతుంది. కానీ రాజు, ఇందు కారు లేకపోవడంతో రేఖ కారు తీసుకొని వెళ్లిపోతారు. ఐశ్వర్య కారు తీసుకు వెళ్లడానికి వెళ్లగా.. ఆమె వస్తుంది. మీరు ఎలాగూ ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నారు కదా.. ఏదైనా కొత్త బిజినెస్ ప్లాన్ ఆలోచించండి.. నేను సాయం చేస్తాను అని చెప్పి పరువు తీయడంతో రేఖ ఆవేశంతో రగిలిపోతుంది.

రాజుకు ప్రాణగండం.. ఇందుతో పెళ్లి జరగాలని..

మరోవైపు రాజుకు మరోసారి మృత్యువు గండం ముంచుకొస్తోందని ఓ స్వామీజీ.. అపర్ణ, సుభాష్ లకు చెబుతాడు. అప్పుడే రాజు ఓ యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటాడు. మరేం చేయాలని అడిగితే.. రాజుకి పెళ్లి చేస్తేనే ఈ గండం నుంచి బయటపడతాడని అంటాడు. దీంతో రాజు నీ మెడలో తాళి కట్టాలని ఇందుపై అపర్ణ ఒత్తిడి తెస్తుంది. కుదరదు అని ఇందు అంటే అసలు విషయం చెబుతుంది. దీంతో ఆమె షాకవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More