Brahmamudi September 25 Episode: బ్రహ్మముడి.. రాజు, ఇందుకి నిరాశ.. భ్రమరాంబను ఎడాపెడా వాయించేసిన సిరి.. ప్లాన్ సక్సెస్

Brahmamudi Serial September 25 Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 25 ఎపిసోడ్ లో రాజు, ఇందుకి సిరి విషయంలో నిరాశే ఎదురవుతుంది. అటు సిరి నుంచి నిజాలు రాబట్టాలని చూసి ఆమెతో చెంపదెబ్బలు తింటుంది భ్రమరాంబ.

Published on: Sep 25, 2026, 08:24:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ సిరి గురించి తెలుసుకోవడానికి ఇటు రాజు, ఇందు.. అటు భ్రమరాంబ చేసే ప్రయత్నాల చుట్టూ తిరిగింది. అటు రాజు, ఇందు.. మదన్, స్వాతి ఇంటికి కూడా వెళ్తారు. కానీ రేఖ విషయంలో మదన్ వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెబుతాడు.

Brahmamudi September 25 Episode: బ్రహ్మముడి.. రాజు, ఇందుకి నిరాశ.. భ్రమరాంబను ఎడాపెడా వాయించేసిన సిరి.. ప్లాన్ సక్సెస్
Brahmamudi September 25 Episode: బ్రహ్మముడి.. రాజు, ఇందుకి నిరాశ.. భ్రమరాంబను ఎడాపెడా వాయించేసిన సిరి.. ప్లాన్ సక్సెస్

సిరి ఇంటికి రాజు, ఇందు.. కుటుంబం గురించి తెలుసుకొని షాక్

సిరి ఇంటికి రాజు, ఇందు వెళ్లే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. అక్కడ ఇంట్లో ఎవరూ ఉండరు. పక్కనున్న ఓ మహిళ వచ్చి ఏం కావలని అడిగితే సిరి తండ్రి శ్రీనివాస్ గురించి అడుగుతారు. వాళ్లు రెండేళ్ల కిందట ఉండే వాళ్లని, తర్వాత కనిపించకుండా పోయారని ఆమె చెబుతుంది. వాళ్లకు ఇంకా ఎవరూ లేరని, ఆయన భార్య చాలా ఏళ్ల కిందటే చనిపోయిందని అనడంతో రాజు బాధపడతాడు.

వాళ్లు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదని, వాళ్ల గురించి పెద్దగా విషయాలు తెలియవని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో సిరికి ఈ గతి పట్టడానికి తానే కారణమంటూ రాజు బాధపడతాడు. ఇందు అతనికి సర్ది చెబుతుంది. తర్వాత మదన్, స్వాతి ఉండే ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది.. వెళ్దామనడంతో రాజు సరే అంటాడు.

సిరితో భ్రమరాంబ పులుసాట.. అటూఇటూ వాయించేసిన సిరి

మరోవైపు ఇంట్లో సిరి నుంచి ఆమె విషయాలు రాబట్టడానికి పులుసాట ఆడుతుంటుంది భ్రమరాంబ. నువ్వు ఓడిపోతే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.. నేను ఓడిపోతే నువ్వు ఏం కావాలంటే అది చేయొచ్చని భ్రమరాంబ చెబుతుంది.

తొలిసారి సిరి ఓడిపోవడంతో రాజు నీకేం అవుతాడు అని భ్రమరాంబ, శేషు అడిగితే మొగుడు అని అంటుంది. ఆ తర్వాత భ్రమరాంబ ఓడిపోతుంది. దీంతో సిరి ఆమెను లాగి పెట్టి కొడుతుంది. ప్రతిసారీ భ్రమరాంబే ఓడిపోవడంతో ఆమె చెంపలను అటూఇటూ వాయించేస్తుంది. దీంతో ఈ ఆట వద్దంటూ ఆమె వెళ్లిపోతుంది.

అపర్ణకు అసలు విషయం చెప్పిన సిరి

శేషుకు తన కందిపోయిన బుగ్గలు చూపిస్తూ భ్రమరాంబ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అపర్ణను సిరి తీసుకొని వస్తుంది. ఏం జరిగిందని అడిగితే.. తానే కొట్టానని సిరి చెబుతుంది. తాము ఆడిన ఆట గురించి సిరి చెప్పడంతో అపర్ణ షాక్ తింటుంది.

అలా కొట్టొద్దని, నీకేమైనా కావాలంటే తనను అడగాలని అపర్ణ చెప్పడంతో సిరి వెళ్లిపోతుంది. ఆ తర్వాత భ్రమరాంబను నిలదీస్తుంది. మీ మనవరాలి జీవితం గురించి మీరు పట్టించుకోవడం లేదు.. అందుకే నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆమె చెబుతుంది. మళ్లీ ఆ విషయం జోలికి వెళ్లొద్దని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చి అపర్ణ వెళ్లిపోతుంది.

మదన్, స్వాతి ఇంటికి రాజు, ఇందు.. జాబ్ ఆఫర్

మరోవైపు మదన్, స్వాతి ఇంటికి రాజు, ఇందు వెళ్తారు. పంతాలు మానేసి తిరిగి ఇంటికి రావాలని, ఇలాగే ఉండిపోతే దూరాలు పెరిగిపోతాయని మదన్ కు రాజు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మదన్ మాత్రం ఈ విషయంలో తన తల్లిని క్షమించబోనని, ఆమె తనను మోసం చేసిందని అంటాడు. ఏదైనా ఉద్యోగం చూసుకున్నావా.. ఇల్లు గడవాలి కదా అడిగితే ప్రయత్నం చేస్తున్నానని మదన్ చెబుతాడు.

ఎక్కడో ఎందుకు.. స్వరాజ్ గ్రూపులోనే ఉద్యోగం చేయు.. మాకు కూడా నువ్వు తోడుగా ఉన్నట్లు ఉంటుందని రాజు, ఇందు అంటారు. కానీ మదన్ దానికి కూడా అంగీకరించడు. అలా అయితే మా అమ్మ నన్ను నీచంగా చూస్తుందని, తనకు బతకడం చేతకాక మళ్లీ ఇక్కడికి వచ్చానని అంటుంది.. అంతేకాదు అక్కడికి వస్తే ఆమెను చూడాలి.. అది ఇష్టం లేదు అని మదన్ స్పష్టం చేస్తాడు. అటు స్వాతి కూడా అలాగే అంటుంది. దీంతో చేసేది లేక.. జాగ్రత్తలు చెప్పి రాజు, ఇందు వెళ్లిపోతారు.

డైనింగ్ టేబుల్ దగ్గర భ్రమరాంబ పరువు తీసిన సిరి

ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే సిరి కూడా తినడానికి వస్తుంది. భ్రమరాంబను చూసి ఆమెను ఆటపట్టిస్తుంది. డబ్బా పిన్ని బుగ్గలు ఎలా అయ్యాయో చూశారా అని అడుగుతుంది. దీంతో భ్రమరాంబ మొహం వాడిపోతుంది. తర్వాత సిరి తన చేతులతో తానే తినడం చూసి అందరూ షాక్ తింటారు. ఇలా తినడం ఇందు నేర్పించిందని అనడంతో శేషు మెచ్చుకుంటాడు. చేత్తో తిన్నంత మాత్రాన ఆమెకున్న వెర్రి తగ్గిపోతుందా అని రేఖ నోరు జారడంతో రాజు ఆమెకు క్లాస్ పీకుతాడు.

తాగి నిజం వాగేసిన రాజు

ఆ తర్వాత భ్రమరాంబ మరో ప్లాన్ వేస్తుంది. శేషుతో కలిసి రాజు మందు తాగేలా చేస్తుంది. రాజు పీకలదాకా తాగిన తర్వాత సిరి గురించి అడుగుతుంది. దీంతో అతడు ఆ మత్తులో అన్ని విషయాలు చెప్పేస్తాడు. అది చూసిన ఇందు కూడా షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More