Brahmamudi September 7 Episode: బ్రహ్మముడి.. రాజుని కాపాడిన ఇందు.. సిరి గురించి చెప్పిన రాజు.. రేఖ చేతిలో బ్రహ్మాస్త్రం
Brahmamudi Serial September 7th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 7 ఎపిసోడ్ లో రాజును ఇందు కాపాడుతుంది. అయితే సిరి ఎవరో ఆమెకు అసలు నిజం చెప్పేస్తాడు రాజు. ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో లక్కీ అనే బ్రహ్మాస్త్రాన్ని రేఖ రంగంలోకి దింపుతుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజును అందరికి ముందూ ఇరికించాలని రేఖ వేసిన ప్లాన్ ఫెయిలవుతుంది. రాజును ఇందు కాపాడుతుంది. అయితే సిరి తన భార్య కాదని, అసలు ఏం జరిగిందో ఆమెకు మొత్తం చెప్పేస్తాడు రాజు. అటు లక్కీని ఉపయోగించుకొని ఆస్తిపై రేఖ కన్నేస్తుంది.

సిరి గురించి అడిగి రాజును ఇరికించిన రేఖ
రాజుని సిరి గురించి అడిగి రేఖ ఇరికించే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. హాస్పిటల్ కు ఎందుకు వెళ్లావ్.. అక్కడ ఎవరున్నారు అని రేఖ నిలదీస్తుంది. నీకు సంబంధించిన వాళ్లందరూ ఇక్కడే ఉన్నారు కదా అని అంటుంది.
దీంతో చలపతి కూడా హాస్పిటల్ కు ఎందుకు వెళ్లావని అడుగుతాడు. కానీ రాజు మాత్రం నోరు తెరవడు. ఎవరో తెలిసిన వాళ్లు కావచ్చు.. అందుకే వెళ్లాడని అపర్ణ రాజుని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో హాస్పిటల్లో ఎవరున్నారని గతంలో రాజుని తాను అడిగిన విషయాన్ని ఇందు కూడా గుర్తు చేసుకుంటుంది.
సిరి.. రాజు భార్యే అని చెప్పేసిన రేఖ.. ఆధారాలు చూపించి..
హాస్పిటల్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? ఆ సిరికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని రేఖ గుచ్చిగుచ్చి అడుగుతుంది. రాజు చెప్పకపోవడంతో సిరి ఇతని భార్యే అని రేఖ అంటుంది. దీంతో అందరూ షాకవుతారు. నీవన్న కట్టుకథలు.. మేము నమ్మం అని అపర్ణ అంటుంది. దీంతో రేఖ తన దగ్గర ఉన్న ఆధారం చూపిస్తుంది. సిరి ఫైల్ చూపిస్తూ అందులో భర్త స్థానంలో రాజు సంతకం చేయడాన్ని చూపెడుతుంది. అది చూసి సిరి భర్త రాజుయే అని అందరూ నమ్ముతారు.
రాజుని నిలదీసిన చలపతి.. నిందించిన భ్రమరాంబ
చలపతి కూడా రాజుని నిలదీస్తాడు. మాకు తెలియకుండా ముందే ఓ పెళ్లి చేసుకున్నావా.. మరి ఇందుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్.. ఆమెను మోసం చేశావా అని అడుగుతాడు. అసలు సిరి ఎవరు? పెళ్లి చేసుకున్నావా అని లక్ష్మీ కూడా అడగుతుంది. భ్రమరాంబ రంగంలోకి దిగి రాజుని నిందించడం మొదలు పెడుతుంది. ఆస్తి కోసం ఇందుని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అంటుంది. ఇలాంటి వాడిని ఇంట్లో ఉండనివ్వొద్దని, వెంటనే మెడ పట్టుకొని గెంటేయమని ఇందుతో అంటుంది.
రాజుని కాపాడిన ఇందు.. సిరి గురించి తెలుసంటూ..
అవసరం లేదు పిన్ని అని ఇందు అంటుంది. సిరి గురించి తనకు ముందే తెలుసు అని చెప్పడంతో రేఖ సహా అందరూ బిత్తరపోతారు. ఏం మాట్లాడుతున్నావ్.. రాజును కాపాడుతున్నావా అని ఇందుని రేఖ నిలదీస్తుంది. కానీ ఇందు మాత్రం ఈ విషయం నాకు ముందే తెలుసు.. ఈ విషయం ఇక్కడితో అందరూ వదిలేయండి అంటూ కేకు కట్ చేయమని రాజుకు చెబుతుంది. హ్యాపీ బర్త్ డే అంటూ పాట పాడుతుంది. అందరూ షాక్ లో ఉండగానే రాజు కేక్ కట్ చేస్తాడు. ఆ సీన్ అక్కడితో ముగుస్తుంది.
సిరి తన భార్య కాదని ఇందుకి చెప్పిన రాజు
గదిలోకి వెళ్లిన తర్వాత ఇందు ముందు రాజు దోషిలా నిలబడతాడు. సిరి గురించి నీకేం తెలియదు కదా.. ఎందుకు తెలుసు అని చెప్పావని ఇందుని రాజు అడుగుతాడు. నాకేం తెలియదు.. కానీ నువ్వు ఓ అమ్మాయిని మోసం చేయవన్న నమ్మకం మాత్రం నాకుంది అని ఇందు అంటుంది. ఇప్పటికీ నువ్వు నిజం చెప్పాలనుకుంటే చెప్పు లేదంటే లేదు అని స్పష్టం చేస్తుంది. సిరి తన భార్య కాదని రాజు చెబుతాడు. ఆ విషయం తనకు తెలుసు అని ఇందు అంటుంది.
సిరి యాక్సిడెంట్ గురించి చెప్పిన రాజు
తనపై అంత నమ్మకంతో ఉన్న ఇందుని రాజు హగ్ చేసుకుంటాడు. థ్యాంక్స్ చెబుతాడు. ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత సిరి గురించి అసలు నిజం చెప్పేస్తాడు. ఓ రోజు తాను కారు నడుపుతుండగా.. సిరి, వాళ్ల నాన్న బండిపై అడ్డుగా వచ్చారని, కారుతో తాను గుద్దేశానని అంటాడు. ఈ యాక్సిడెంట్ లో ఆమె తండ్రి అక్కడిక్కడే మరణించాడని, సిరికి గాయం కావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు చెబుతాడు. అయితే అక్కడ ఆమెకు చికిత్స చేయడం కోసం నర్సు అడిగితే భర్త స్థానంలో సంతకం చేసినట్లు వెల్లడిస్తాడు.
ఈ విషయం అప్పుడే పోలీసులకు చెబుదామని అనుకున్నా రాజు ఫ్రెండ్ అతన్ని అడ్డుకుంటాడు. తాను నిజం చెబితే తప్పు వాళ్లదే అయినా ఆయన చనిపోయాడు కాబట్టి జైల్లో వేస్తారని అంటాడు. దీంతో రాజు పోలీసుల దగ్గరికి వెళ్లడు. అటు సిరి కోమాలోకి వెళ్లిందని డాక్టర్ చెబుతాడు. ఆమెకు చికిత్స చేయించి కోలుకున్న తర్వాత ఆమెతో నిజం చెప్పిస్తే తనకు ప్రమాదం ఉండదని భావిస్తాడు. అందుకే ఆమె చికిత్స ఖర్చు తాను భరిస్తున్నట్లు చెబుతాడు.
నిజం ఎవరికీ చెప్పొద్దన్న ఇందు
ఈ నిజం రేఖ పిన్నికి చెప్పేస్తానని రాజు అంటాడు. వద్దని ఇందు వారిస్తుంది. ఆమె నీపై పగ పట్టిందని, ఈ విషయం తెలిస్తే పోలీసులకు పట్టిస్తుందని అంటుంది. కనీసం మా అమ్మానాన్న, మీ నాన్నమ్మ, తాతయ్యలకు అయినా చెబుదామన్నా ఇందు వద్దంటుంది. వాళ్లకు చెప్పినా రేపు రేఖ, భ్రమరాంబ పదేపదే మాటలు అంటుంటే ఆవేశంతో వాళ్లు నిజం చెప్పేస్తారని, అది నీకే ప్రమాదం అని రాజుతో ఇందు అంటుంది. ఈ నిజం మన ఇద్దరి మధ్యే ఉండాలని రాజుకు చెబుతుంది.
లక్కీని రంగంలోకి దించిన రేఖ
రాజుపై ఏ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో లక్కీని రంగంలోకి దించాలని రేఖ నిర్ణయించుకుంటుంది. అతనితోనే రాజును మనం దొంగ దెబ్బ తీయొచ్చని భూషణ్, భ్రమరాంబలతో అంటుంది. అప్పటి నుంచి లక్కీపై ప్రేమ కురిపిస్తుంది. అతనికి తినిపిస్తుంది. లక్కీని తన పెద్ద కొడుకుగా అందరి ముందూ అనౌన్స్ చేస్తామని చెప్పడంతో రాజు, ఇందు, అపర్ణ షాక్ తింటారు. రేఖ పిన్ని ఇంకేదో ప్లాన్ చేస్తోందని ఇందుతో రాజు అంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


