బ్రహ్మముడి డిసెంబర్ 5 ఎపిసోడ్: రాజ్ దగ్గర పెన్‌డ్రైవ్ కోసం వెంట పడిన రౌడీలు.. కేరళలో ప్రమాదంలో రాజ్, కావ్య

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 5) ఎపిసోడ్ మొత్తం కేరళలో రాజ్, కావ్య చుట్టూ తిరిగింది. ఓ రౌడీ మూక వాళ్ల వెంట పడుతుంది. ఓ పెన్‌డ్రైవ్ కోసం వాళ్లు ఆ ఇద్దరిని వెంబడిస్తారు. ఓసారి తప్పించుకున్నా మరోసారి ప్రమాదంలో పడతారు.

Published on: Dec 5, 2025, 07:10:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 896వ ఎపిసోడ్ కేరళలోని రాజ్, కావ్య.. ఇటు అప్పు, కల్యాణ్ లను ధాన్యలక్ష్మి నిలదీయడం చుట్టూ తిరిగింది. కేరళలో వైద్యం కోసం వెళ్లిన రాజ్, కావ్య ఓ పెన్‌డ్రైవ్ కోసం ప్రమాదంలో చిక్కుకుంటారు. వాళ్లకు అక్కడ ఏం జరగబోతోంది అన్న ఆందోళన మధ్య ఈ ఎపిసోడ్ సాగింది.

బ్రహ్మముడి డిసెంబర్ 5 ఎపిసోడ్: రాజ్ దగ్గర పెన్‌డ్రైవ్ కోసం వెంట పడిన రౌడీలు.. కేరళలో ప్రమాదంలో రాజ్, కావ్య
బ్రహ్మముడి డిసెంబర్ 5 ఎపిసోడ్: రాజ్ దగ్గర పెన్‌డ్రైవ్ కోసం వెంట పడిన రౌడీలు.. కేరళలో ప్రమాదంలో రాజ్, కావ్య

కేరళలో ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజ్, కావ్య

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 5) ఎపిసోడ్ రాజ్, కావ్య కారు ముందు ఓ వ్యక్తి వచ్చి పడిపోయే సీన్ తో మొదలవుతుంది. అతన్ని రౌడీలు వెంబడించడంతో పరుగెత్తుకుంటూ వచ్చి కారును ఢీకొడతాడు. దీంతో రాజ్, కావ్య కంగారు పడుతూ అతని దగ్గరికి వస్తారు. అతడు ఏదో చెప్పబోతుండగా.. దూరం నుంచి రౌడీలు వాళ్లను చూస్తారు. ఆ వ్యక్తి దాహం దాహం అంటుండగా కావ్య నీళ్లు తేవడానికి వెళ్తుంది.

ఇంతలో ఆ వ్యక్తి రాజ్ వేసుకున్న కోటులో ఓ పెన్ డ్రైవ్ వేస్తాడు. ఆ పెన్ డ్రైవ్ కోసమే రౌడీలు అతన్ని వెంబడించినట్లు అర్థమవుతుంది. నీళ్లు తెచ్చే లోపే అతడు చనిపోతాడు. అప్పుడే ఆ రౌడీలు వచ్చి అతడు మీతో ఏం చెప్పాడని రాజ్, కావ్యలను నిలదీస్తారు. ఏమీ చెప్పలేదని వాళ్లు అంటారు. దాహం అని మాత్రమే అన్నాడని కావ్య అంటుంది. అయితే రౌడీల కంటే ఎక్కువగా వాళ్లు కమెడియన్లలో ఉండటంతో సరే అంటూ వాళ్లను వదిలేస్తారు. దీంతో వాళ్లు ఊపిరి పీల్చుకుంటూ వెళ్లిపోతారు.

అప్పు, కల్యాణ్‌ను నిలదీసిన ధాన్యలక్ష్మి.. కాపాడిన ప్రకాశం

ఇటు బయటకు వెళ్లి రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి వచ్చిన అప్పు, కల్యాణ్ లను ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. ఇంతసేపూ ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. అన్నయ్యను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి, డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చేసరికి లేటైందని అంటారు. అయినా ధాన్యం వినకపోవడంతో ప్రకాశం ఎంట్రీ ఇస్తాడు. అప్పు, కల్యాణ్ లను అతడు కాపాడతాడు.

హాస్పిటల్ కు వెళ్లి నేరుగా ఇంటికి రావడానికి వాళ్లు మనలాగా ముసలోళ్లు కాదని, అలా షికారు వెళ్లి ఉంటారని అంటాడు. మరి టెస్టులు చేయించుకున్నారు కదా.. రిపోర్టులు ఏవి అని ధాన్యం అడుగుతుంది. అప్పు, కల్యాణ్ మరోసారి నీళ్లు నములుతుంటే.. ప్రకాశమే రిపోర్టులు రావడానికి ఒక రోజు పడుతుంది కదా అని అంటాడు. ఇన్వెస్టిగేటర్ లాగా ప్రశ్నలు అడగటం ఆపేయమంటూ వాళ్లను ప్రకాశం పంపించేస్తాడు.

పాట పాడి కావ్యకు కషాయం తాగించిన రాజ్

ఇటు కేరళలో రిసార్టుకు తిరిగి వచ్చిన రాజ్.. తన కోటు తీసివేస్తుండగా అందులోని పెన్ డ్రైవ్ కింద టేబుల్ కింద పడిపోతుంది. అది అతడు గమనించడు. మరోవైపు కావ్య కంగారు పడుతూ ఉంటుంది. వైద్యం కోసం వస్తే.. ఆ వ్యక్తి ఎవరో వచ్చి మన కారు కింద పడి చనిపోవడం ఏంటని అడుగుతుంది.

దానితో మనకు సంబంధం లేదు.. ఇక్కడికి వైద్యం కోసం వచ్చాం.. చేయించుకొని వెళ్లిపోదాం.. ఈ కషాయం తాగు అని ఇస్తాడు. అది తాగి చాలా చేదుగా ఉందని, వద్దని కావ్య అంటుంది. దీంతో రాజ్ బతిమాలుతాడు. మహేష్ బాబు పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తాడు. దీంతో చివరికి కావ్య కరిగిపోయి కషాయం తాగేస్తుంది. అతన్ని వాటేసుకుంటుంది.

ఇటు పెన్‌ డ్రైవ్ లేకుండా వచ్చిన రౌడీలను వాళ్ల బాస్ కొడతాడు. అది తనకు కావాల్సిందే అని వాళ్లకు తేల్చి చెబుతాడు. దీంతో ఆ రౌడీలు మళ్లీ కావ్య, రాజ్ వేటలో పడతారు. ఆ ఇద్దరూ రెస్టారెంట్ లో ఉండగా అక్కడికి వస్తారు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More