Carmeni Selvam Review: కార్మేని సెల్వం రివ్యూ- అప్పులు తెచ్చే తంటాలు చూపించే మూవీ- సముద్రఖని ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Carmeni Selvam Review In Telugu: విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ కార్మేని సెల్వం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీకొడుకుల బంధం, సామాజిక బాధ్యత నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి కార్మేని సెల్వం రివ్యూలో చూద్దాం.
టైటిల్: కార్మేని సెల్వం

నటీనటులు: సముద్రఖని, గౌతమ్ మీనన్, అభినయ, లక్ష్మీ ప్రియ, జాంగిరి మధుమితి, బడవ గోపి తదితరులు
కథ, దర్శకత్వం: రామ్ చక్రి
సంగీతం: మ్యూజిక్‌క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ (రామానుజన్ ఎంకే)
సినిమాటోగ్రఫీ: యువరాజు దక్షణ్
ఎడిటింగ్: జగన్ ఆర్‌వీ, దినేష్ ఎస్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
విడుదల తేది: 03 ఏప్రిల్ 2026
నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తాజాగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా కారేమెని సెల్వం. ఇందులో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించారు.
సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (ఏప్రిల్ 3) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కార్మేని సెల్వం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఈ సినిమా కథ అంతా కార్మేని సెల్వం (సముద్రఖని) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక మధ్యతరగతి తండ్రి. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ సంపత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) వద్ద డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు సెల్వం. తన కొడుకు భవిష్యత్తు కోసం, తన ఊరి బాగు కోసం నిరంతరం తపించే వ్యక్తి. అయితే, జీవితంలో ఎదురైన కొన్ని అవమానాలు సెల్వంను అప్పుల బాట పట్టిస్తాయి. సమాజంలో ఎంతో గౌరవంగా బతికిన సెల్వంను అప్పులు దారుణైన పరిస్థితిలోకి నెట్టేస్తాయి.
అప్పులు అంటేనే పడని సెల్వం అప్పులు ఎందుకు చేశాడు?, అవి తీర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు?, సమాజంలోని కుళ్లు రాజకీయాలు, స్వార్థపూరిత నిర్ణయాలు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన ఆశయాల కోసం అతను చేసిన పోరాటం ఏంటి? చివరికి కోడుకు, భార్య కోసం సెల్వం ఏం చేశాడు? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
విశ్లేషణ:
ఈ సినిమాను వెండితెరపై కనిపించే కథలా కాకుండా రియల్ జీవితంలోని ప్రతి ఒక్కరి స్టోరీలా అనిపిస్తుంది. ఇలాంటివి రోజు మన ఇంట్లో, పక్కింట్లో, ఎదురింట్లో చూసేదే. అందుకే ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ కథలంటూ తెలుగులో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి.
అలా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా పాతదే అయినప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. సినిమా ఆరంభం కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ, పాత్రల పరిచయం తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా సముద్రఖని తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, సమాజం పట్ల తపన ఉన్న వ్యక్తిగా ఆయన అద్భుతంగా నటించారు.
హృద్యంగా సన్నివేశాలు
సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి. తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కళ్లు చెమర్చిస్తాయి. అప్పుల గురించి చూపించే సన్నివేశాలు బాగున్నాయి. అవి ప్రతి సగటు మధ్యతరగతి వ్యక్తిని ఆలోచింపజేసేలా చేస్తాయి. అప్పులు ఇచ్చేందుకే పుట్టుకొచ్చే సంస్థలు, తర్వాత అప్పులు కట్టలేక పడే ఇబ్బందులు, ఇరుగురుపొరుగు సూటి పోటి మాటలు, మన అప్పులు వల్ల చుట్టాల్లో కలిగే భావన వంటి సీన్స్ చాలా సహజసిద్ధంగా చూపించారు.
బంధుమిత్రుల మాటలు, ఇతరులను చూసి గొప్పగా బతకలానే భావనతో మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామే చూపించే సినిమా ఇది. అందులో డైరెక్టర్ రామ్ చక్రి బాగా సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ అందరిలో తప్పు చేయకూడదనే ఆలోచనను రేకెత్తిస్తుంది.
సహజమైన నటనతో మెప్పించే పాత్రలు
ఇక నటీనటుల విషయానికొస్తే సముద్రఖను తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ వ్యక్తి కార్మేని సెల్వం పాత్రలో జీవించేశారు. ఆయన నటన సినిమాకు హైలెట్. తండ్రిగా, భర్తగా ఆకట్టుకున్నారు. గౌతమ్ మీనన్ పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ ప్రభావం చూపించేలా ఉంది. నటన పరంగా గౌతమ్ మీనన్ ఆకట్టుకుంటారు.
లక్ష్మీ ప్రియ సహజ నటనతో అలరించారు. సెల్వం కుమారుడిగా చేసిన బాబు కూడా మెప్పిస్తాడు. మిగతా పాత్రలు సైతం పర్వాలేదనిపించాయి. నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది, పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. ముఖ్యంగా రెండో భాగంలో కొన్ని సాగతీత సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
సముద్రఖని పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.
హృదయాన్ని హత్తుకునే ఎమోషన్స్.
సమాజానికి ఇచ్చే మంచి సందేశం.
మైనస్ పాయింట్స్:
నెమ్మదైన కథనం.
ఫైనల్‌గా చెప్పాలంటే?
సందేశాత్మక చిత్రాలను, సహజ సిద్ధమైన నటనను ఇష్టపడే వారికి కార్మేని సెల్వం ఒక మంచి ఆప్షన్. కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నా, మనసుకి హత్తుకునే కథాంశంతో ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిలి కచ్చితంగా చూసే సినిమానే కార్మేని సెల్వం.
రేటింగ్: 3 /5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


