Nolan: యూట్యూబ్‌లో డిస్‌లైకుల వరద- అయినా తగ్గని నోలన్ క్రేజ్- 47 వేలకుపైగా ది ఒడిస్సీ టికెట్ ధర- జోరుగా బ్లాక్ దందా!
The Odyssey Ticket Prices To 47000: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా మొదటి రోజు ఐమాక్స్ షోల టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఏకంగా 47 వేల రూపాయలకు పైగా అమ్ముతుండటం సంచలనం సృష్టిస్తోంది.
The Odyssey Ticket Prices To 47000: ప్రపంచ సినిమా రంగంలో క్రిస్టోఫర్ నోలన్ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు, అది కేవలం వెండితెర వినోదంగా కాకుండా ఒక గ్లోబల్ ఈవెంట్‌లా మారిపోతుంది.

గ్రీకు పురాణ గాథ
అణుబాంబు పితామహుడి బయోపిక్ అయినా, కలల ప్రపంచం చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ కథ అయినా.. నోలన్ మార్క్ టేకింగ్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడతారు. ఇప్పుడు ఆయన మేధస్సుకు ప్రాచీన గ్రీకు పురాణ గాథ తోడైతే ఎలా ఉంటుందో చూపించేందుకు 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
జూలై 17న విడుదల కానున్న ది ఒడిస్సీ సినిమా టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన డిమాండ్ కనిపిస్తోంది. మొదటి రోజు షోల కోసం టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఏకంగా 500 డాలర్ల (దాదాపు రూ. 47,500) భారీ ధరకు విక్రయిస్తుండటం హాలీవుడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
గంటలోనే అమ్ముడైన ఐమాక్స్ టికెట్లు
క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు సాధారణంగానే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కానీ, 'ది ఒడిస్సీ' విషయంలో ఆ పిచ్చి పీక్స్‌కు చేరింది. నోలన్‌కు ఎంతో ఇష్టమైన 70 ఎంఎం ఐమాక్స్ (70 mm IMAX) ఫార్మాట్ స్క్రీనింగ్ టికెట్లను ఏడాది క్రితమే అడ్వాన్స్‌గా అమ్మకానికి పెట్టగా.. కేవలం ఒక గంటలోనే అన్నీ అమ్ముడయ్యాయి. ఇక గత నెలలో పూర్తిస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగానే టికెటింగ్ వెబ్‌సైట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి.
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఏఎంసీ లింకన్ స్క్వేర్, లాస్ ఏంజిల్స్‌లోని ఏఎంసీ సిటీవాక్ వంటి ప్రముఖ థియేటర్లలో కొన్ని వారాల పాటు అన్ని షోలు హౌస్‌ఫుల్ అయిపోయాయని అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదించింది. ఎలాగైనా సీటు దక్కించుకోవాలని చూస్తున్న ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా చేసుకుని, ఈబే (eBay) వంటి సైట్లలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది.
ఇండియాలో కూడా తగ్గని క్రేజ్
మన దేశంలోనూ నోలన్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఐమాక్స్ స్క్రీన్ల వద్ద నోలన్ ఫ్యాన్స్ చేసే హంగామా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను తలపిస్తుంది. ఇండియాలో ఈ సినిమా ఐమాక్స్ టికెట్ల అమ్మకాలు నెల రోజుల ముందే ప్రారంభించారు.
విడుదలవడానికి ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో రూ. 3,300 వరకు ధర ఉన్న ప్రీమియం టికెట్లు ఇప్పటికే దాదాపు అన్ని థియేటర్లలో అమ్ముడైపోయాయి. హైదరాబాద్‌లోని ఐమాక్స్ స్క్రీన్లలో సైతం బుకింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విపరీతమైన హైప్ గురించి దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ స్పందిస్తూ, తనకు ఎప్పుడూ ప్రేక్షకులే అత్యంత ముఖ్యమని చెప్పారు.
ప్రేక్షకులే అన్నీ.. భయం వేస్తోంది: నోలన్
"సినిమా ఏంటనేది ప్రేక్షకులే చెప్తారు. ఈ క్షణం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తున్నప్పటికీ, మరోవైపు అంతే భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఇదంతా నిజంగా జరుగుతోంది. ఇక్కడ దాక్కోవడానికి ఏమీ లేదు. మేము ఈ సినిమాను కేవలం థియేటర్ అనుభూతి కోసమే నిర్మించాం. ఇప్పుడు ఇది ప్రపంచం ముందుకు వెళ్తోంది. ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి" అని అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ నోలన్ పేర్కొన్నారు.
దాదాపు 2,500 ఏళ్ల క్రితం హోమర్ రాసిన గ్రీకు పురాణ గాథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచ సాహిత్యంలో అత్యధికంగా చదివిన ఈ కథను వెండితెరపై సరికొత్తగా చూపించాలనుకున్నట్లు నోలన్ చెప్పారు.
సినిమాల్లో ఇలాంటి కథలను ఎలా చూపించాలనే పాత ఆలోచనలను మార్చడమే తన లక్ష్యమని, ఇందులో కొంత రిస్క్, సవాలు కూడా ఉన్నాయని అంగీకరించారు.
అందుకే ఈ సినిమాలో నేటి వాడుక భాషను, అమెరికన్ యాక్సెంట్‌ను ఉపయోగించడంతో పాటు వేర్వేరు కథల ఎలిమెంట్స్‌ను కలిపేశారు. దీనిపై ఇప్పటికే కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
హాలీవుడ్ హేమాహేమీల దండయాత్ర
భారీ తారాగణంతో వస్తున్న 'ది ఒడిస్సీ' సినిమాలో ఇథాకా పురాణ రాజు 'ఒడిస్సియస్' పాత్రలో హాలీవుడ్ స్టార్ నటుడు మాట్ డామన్ నటిస్తున్నారు. ట్రాజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఆయన స్వదేశానికి తిరిగొచ్చే క్రమంలో ఎదుర్కొన్న ప్రమాదకరమైన ప్రయాణమే ఈ సినిమా కథాంశం.
ఈ చిత్రంలో అన్నే హాత్వే, టామ్ హాలండ్, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, షార్లిజ్ థెరాన్ వంటి హాలీవుడ్ టాప్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇంతింతటి తారాగణం, నోలన్ మార్క్ మేకింగ్‌తో వస్తున్న ఈ విజువల్ వండర్ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
యూట్యూబ్‌లో డిస్‌లైకుల వరద
అయితే, జూలై 1న రిలీజ్ అయిన ది ఒడిస్సీ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో డిస్‌లైకుల వరద పారింది. ది ఒడిస్సీ ట్రైలర్‌ను మెచ్చుకుంటూ 53 వేలకుపైగా లైక్స్ రాగా.. డిస్‌లైక్స్ మాత్రం ఏకంగా 3 లక్షలకుపైగా వచ్చాయి. అంటే, ఈ డిస్‌లైకు శాతం 85 శాతం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


