The Odyssey: టికెట్ ధర 3300- అయినా నెలకు ముందే షోస్ హౌస్‌ఫుల్- ది ఒడిస్సీ రికార్డ్- క్రిస్టోఫర్ నోలన్ 20 ఏళ్ల కల

Christopher Nolan The Odyssey Ticket Price 3300 Rs: దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్‌కు ఇంకా ఐదు వారాల సమయం ఉండగానే భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, రూ. 3300 అత్యధిక ధర ఉన్న టికెట్లు సైతం హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

Published on: Jun 11, 2026, 13:34:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Christopher Nolan The Odyssey Ticket Price 3300 Rs: ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్‌కు క్రిస్టోఫర్ నోలన్ పేరు ఒక బ్రాండ్. మన తెలుగు రాష్ట్రాల్లోనూ నోలన్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. 'ఇంటర్‌స్టెల్లార్', 'ఇన్సెప్షన్', 'ఓపెన్‌హైమర్' చిత్రాల విజువల్స్ చూసి మన ఆడియన్స్ ఫిదా అయ్యారు.

టికెట్ ధర 3300- అయినా నెలకు ముందే షోస్ హౌస్‌ఫుల్- ది ఒడిస్సీ రికార్డ్- క్రిస్టోఫర్ నోలన్ 20 ఏళ్ల కల (X/ @odysseymovie)
టికెట్ ధర 3300- అయినా నెలకు ముందే షోస్ హౌస్‌ఫుల్- ది ఒడిస్సీ రికార్డ్- క్రిస్టోఫర్ నోలన్ 20 ఏళ్ల కల (X/ @odysseymovie)

క్రిస్టోఫర్ నోలన్ క్రేజ్

థియేటర్లలో నోలన్ సృష్టించే మాయాజాలాన్ని ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌లపై చూసేందుకు సినిమా ప్రియులు ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనుకాడరు. ఇప్పుడు అదే క్రేజ్ నోలన్ రాబోయే సరికొత్త విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) విషయంలో మరోసారి రుజువైంది.

ది ఒడిస్సీ సినిమా గ్లోబల్ రిలీజ్‌కు ఇంకా ఐదు వారాల సమయం ఉంది. అయినా మూడు రోజుల క్రితమే దేశంలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మెట్రో నగరాల్లో టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, నోలన్ అభిమానులు పోటీ పడి మరీ టికెట్లను కొనేస్తున్నారు.

రూ. 3300 టికెట్ ధర.. అయినా హౌస్‌ఫుల్!

ది ఒడిస్సీ సినిమా కోసం దేశంలోనే అత్యధిక టికెట్ ధర ముంబైలో నమోదైంది. ముంబైలోని ఫీనిక్స్ పల్లాడియమ్ మాల్‌లోని పీవీఆర్ ఐకాన్ (PVR Icon) థియేటర్లో రీక్లైనర్ సీట్ల ధరను ఏకంగా రూ. 3300 గా నిర్ణయించారు. ఇంత భారీ ధర ఉన్నప్పటికీ శని, ఆదివారాలకు సంబంధించిన షోల టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయాయి.

కేవలం ప్రీమియర్ నైట్ షోలకు మాత్రమే కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి. అలాగే ముంబైలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన వడాలా మిరాజ్ సినిమాస్ ఐమాక్స్‌లో సోఫా సీట్ల ధర రూ. 1800 కాగా, అక్కడ మొదటి వారాంతం (జూలై 17-19) షోలన్నీ ఫుల్ అయిపోయాయి.

దేశ రాజధానిలో రూ. 2400గా టికెట్ ధర

ఇక దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో (Delhi-NCR) చూసుకుంటే సెలెక్ట్ సిటీ వాక్, ప్రియా థియేటర్లలోని పీవీఆర్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలు రూ. 2100 నుంచి రూ. 2400 వరకు ఉన్నాయి. అక్కడ కూడా వీకెండ్ నైట్ షోల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

సినిమా విడుదలకు నెల రోజుల ముందే థియేటర్లలోని ఫ్రంట్ రోస్ (ముందు వరుసలు) సైతం బుక్ అయిపోవడం చూస్తుంటే నోలన్ క్రేజ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. కనీసం ఐమాక్స్ స్క్రీన్‌ల పరంగానైనా ఈ సినిమా ఇండియాలో వంద శాతం హౌస్‌ఫుల్ బోర్డులతో ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా చరిత్రలోనే మొదటిసారి.. నోలన్ 20 ఏళ్ల కల!

భారతదేశంలో జూన్ 8 నుంచే ది ఒడిస్సీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా తెరిచారు. ప్రపంచవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించిన మొదటి కొన్ని మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి కావడం విశేషం.

"ది ఒడిస్సీ సినిమా చరిత్రలోనే సరికొత్త మైలురాయి. ఐమాక్స్ కెమెరాలతోనే పూర్తిగా రూపొందిన మొదటి చిత్రమిది. ఈ విజువల్ అద్భుతాన్ని సాధించడానికి దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దాదాపు ఇరవై ఏళ్లు శ్రమించారు. భారతీయ నోలన్ అభిమానులకు ఇది ఒక గొప్ప సందర్భం. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులతో పాటు మన దేశంలోనూ ఒకేసారి ఈ సరికొత్త ఐమాక్స్ అనుభూతి కోసం బుకింగ్స్ చేసుకోవడం ఆనందంగా ఉంది" అని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ డెంజిల్ డియాస్ పేర్కొన్నారు.

హోమర్ పురాణ గాథతో హాలీవుడ్ విజువల్ వండర్

ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టోఫర్ నోలన్ స్వయంగా స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోమర్ రాసిన కాలాతీత పురాణ గాథ (Homer’s epic) ఆధారంగా తెరకెక్కింది. ట్రాయ్ పతనం తర్వాత ఇథాకా రాజు ఒడిస్సియస్ తన స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో ఎదుర్కొన్న భయంకరమైన, సాహసోపేతమైన ప్రయాణమే ఈ సినిమా కథ.

హాలీవుడ్ స్టార్ యాక్టర్స్

ఇందులో ఒడిస్సియస్‌గా హాలీవుడ్ స్టార్ యాక్టర్ మాట్ డామన్ నటిస్తుండగా, ఆయన కుమారుడు టెలిమాకస్ పాత్రలో 'స్పైడర్ మ్యాన్' ఫేమ్ టామ్ హాలండ్ కనిపించనున్నారు.

ఒడిస్సియస్ భార్య పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే నటిస్తున్నారు. వీరితో పాటు జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, చార్లిజ్ థెరాన్, జాన్ బెర్న్ థాల్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో భాగమయ్యారు.

ది ఒడిస్సీ రిలీజ్ డేట్

ఈ అద్భుత దృశ్యకావ్యం ది ఒడిస్సీ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More